2232* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

NH.216 మెరుగుదల ఉద్యోగంలో 2232* వ నాడు.

 

సెప్టెంబరు - 19 (ఆదివారం) నాటి బ్రహ్మ ముహూర్తానికి ముందే కాసానగర కాసారం దగ్గర రహదారి సేవలకు సంసిద్దులైన 15 మంది స్వచ్ఛ వాలంటీర్లు, ఒక దశలో అంతకుమించిన సంఖ్యలో వచ్చి చేరిన వాళ్ళూ 6.20 సమయం దాక చక్కబెట్టినదేమంటే అసలే అందంగా ఉన్న, నిన్న గూడ శుభ్రపరచిన భాగంతో బాటు చెరువు ఉత్తర దిక్కున మరింత బాట అంచును మరింతగా తీర్చిదిద్దడమే!

 

నేటి శుభ్ర సుందరీకర్తలు 30 మందే గాని, ఈ రహదారిలోని నానా వర్ణరంజిత హరిత శోభల నాస్వాదించే అదృష్టవంతులెందరో! ఈ కార్యకర్తల ఆచరణ పూర్వక స్ఫూర్తి నందుకో గల ధన్యులు కనుక ఉంటే వాళ్లెందరో! వెనకటికి ఒక మహాకవి ఇలాంటి ఉద్యమాల చరిత్రలను నిలదీసి ప్రశ్నించినట్లుగా

 

ఏ గ్రామ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం?

- “ఏ గ్రామం ఏ కాలంలో సాధించినదే పరమార్ధం?

     ఏ శుభ్రత? ఏ సౌందర్యం? ఏ భవితలకీ ప్రస్థానం...?”

 

అని కాస్త సీరియస్ గా ఆలోచించేదెందరు?

           

            “ఈ పెద్ద డాక్టర్లేమిటి - రోడ్లు ఊడ్చడమేమిటి?”

 

ఇందరు విశ్రాంత ఉద్యోగులు వేకువ 4:20 కే తయారై, 2/3 కిలోమీటర్ల దూరంలో రహదారి మట్టి, ఇసుక చెత్త ఏరి లాగి పోగులెందుకు చేస్తునట్లు? ఈ రైతులకు మరో పనేదీ లేక చీకట్లో ఊరి మురుగు కాల్వల తుక్కు తీసే పనులెందుకు? ఇంతమంది గృహిణులకు తమ ఊరి స్వచ్ఛ శుభ్ర సౌందర్యాల కోసం ఎందుకీ తపన...అని సానుకూలంగా తర్కించుకొనే గ్రామస్తులిప్పుడెందరు?

 

మన శక్తి యుక్తుల్ని నమ్ముకోక, సమైక్య కృషితో సొంత ఊరిని సౌకర్యవంతంగా సుందర నందనంగా తీర్చిదిద్దుకోక స్వచ్చంద శ్రమదాతలతో చేతులు కలపక హక్కుల్ని తప్ప బాధ్యతల్ని గుర్తుంచుకోక ఎంత కాలం కొందరు గ్రామస్తులిలా స్తబ్దంగా ఉండిపోతారు!

 

            స్వచ్ఛ కార్యకర్తల ప్రయత్నం మాత్రం ఎప్పటిలాగే

 

నిన్నటి జడివానకు దారి కిరు ప్రక్కల కాల్వలు నిండి, తమ దైనందిన స్వచ్ఛ శుభ్ర సుందరీకరణలో కాస్త జాప్యం జరిగినా, ప్లాస్తిక్ తుక్కు, ఎంగిలాకులు, ఎండుటాకుల సేకరణ కొంచెం కష్టమైనా వాళ్ల పనులన్నీ యదావిధిగా జరిగిపోయాయి.

 

పూల మొక్కల కుదుళ్ళ కలుపు తీయడం మాత్రం తడి నేలలో కాస్త సులభమై పోయింది!

 

నేటి కృషి పర్యాలోకనం సమయంలో :

 

- రేపు కాసానగర్ దగ్గర నాటవలసిన కొన్ని మొక్కల గురించీ,

- లాబొరేటరీ రవీంద్ర గారి మధ్యాహ్న విందూ

- ఈ నాటి కార్యకర్తల శ్రమదాన విషయమూ

ప్రస్తావనకు వచ్చాయి!

 

బొమ్మిశెట్టి ఆత్మ పరబ్రహ్మం గారి స్వచ్ఛ - శుభ్ర సౌందర్య సాధనా సంకల్ప నినాదాలతో నేటి కార్యక్రమం ముగింపు.

 

బుధవారం వేకువ కూడ మన శ్రమదాన విశేషం కాసానగర సమీపంలోనే!

 

            ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 9

 

నిరుడు కురిసిన హిమ సమూహం, శరశ్చంద్రిక మాయజాలం

సమాజ శ్రేయస్సు కోసం పెద్ద పీటలు పరచు తత్త్వం

మరొక మారీ స్వార్ధ జగతికి మనోవీధిని నిల్చునట్లుగ

ఉద్యమించిన కార్యకర్తల బృందమున కిదె మా ప్రణామం!

                         

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

19.09.2021.