2233* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

216 వ జాతీయ రహదారి హరితోద్యమంలో - 2233* వ నాటి కృషి.

 

20 వ సెప్టెంబరు వేకువ 4.20 నుండి 6.45 దాక సుమారు రెండు గంటల సమయం బళ్ళ నాగన్న ఆశ్రమం దగ్గర ఆగి, ఉభయ పార్శ్వాలలో క్రిక్కిరిసిపోయేంతగా పూల మొక్కలు నాటిన 8 మంది శ్రమదాతలకు శుభాభివందనాలు! మొక్కలు బాగా బ్రతికి, పెరిగి, ఋతువు నడుమనే తరి తప్పకుండ ఒక్క ఉదుటున 84 మొక్కల పాదులు త్రవ్వి ప్రతిష్టించాలనే నిన్నటి నిర్ణయాను సారం జరిగిన సత్కార్యానికి స్వాగతం!

 

గత నాల్గు దినాల వానలకు బాట ప్రక్కల ఏటవాలు నేల చక్కగా పదునై పెట్టిన ప్రతి మొక్కా బ్రతికి, దిన దిన ప్రవర్ధమానములై వసంత ఋతువు నాటికి విరగ బూసే దృశ్యం నాకిప్పుడే కనిపిస్తున్నది. ఈ వేకువ నాటిన ఎక్కువగా మూడు రంగుల అడవి తంగేడు పూల మొక్కలు, పరిమితంగా చైనా బెర్రీ, రేల మొక్కలూ మొత్తం 84 కొలువు తీరినవి. అంతకుముందు నాటి బ్రతికి, పెరిగి, ఈ రహదారిలో వచ్చే పోయే వారికి నవ్వులు పంచుతున్న వందలాది పూల మొక్కలకూ, వరి పొలాల శ్యామల వర్ణ నేపధ్యంలో పెరుగుతున్న డజన్ల కొద్దీ పచ్చని వృక్షాలకూ ఇవి అదనం!

 

పరిసర గ్రామస్తులు గాని, దూర ప్రయాణికులు గాని ఈ 2 – 3 కిలో మీటర్ల సువిశాల సుశ్యామల సుమ శోభిత రహదారి నిర్మాతలైన చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల వేల దినాల శ్రమదానాన్ని తలచుకొని సందేహించరాదు జాలిపడరాదు - వట్టి అభినందనలు కనిపించరాదు! ఎవరి ఊరిని, వీధుల్ని, పరిసరాల్ని వారు పోటీపడి ఇంతకన్నా మిన్నగా తీర్చిదిద్దుకోవడమే చేయదగిన భవిష్య కార్యం! ఇక అప్పుడు మన గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు కూడ న్యూజిలాండ్ లుగా స్విడ్జర్లాండ్లుగా స్వీడన్ లుగా మారిపోవా?

 

6.45 ప్రాంతంలో ఈ అష్ట సంఖ్యాక శ్రమదాతలు మనకోసం మనంకార్మిక పర్యవేక్షకుడు కస్తూరి శ్రీను ముమ్మారు ప్రకటించిన స్వగ్రామ స్వచ్ఛ - శుభ్ర సౌందర్య సాధనా సంకల్ప  నినాదాలకు బదులిచ్చి గృహోన్ముఖులయ్యారు.

 

బుధవారం వేకువ మన స్వచ్ఛ కార్యక్షేత్రం కాసానగర్ సమీపమే!

 

            ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 10

 

ఇచట శుభ్ర స్వచ్ఛ యజ్ఞం అచట సుందర పుష్పలోకం

మరొక చోటున మురుగు కాల్వల మరామత్తుల విశ్వరూపం 

ఊరిలో ప్రతి మూల రోజూ ఉనికిలో ఉద్యమ విశేషం

చల్లపల్లి విశిష్ట ఉద్యమ సారధులకే మా ప్రణామం! 

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

20.09.2021.