2236* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

పాగోలు రోడ్డు మెరుగుదలలో విజయవంతమైన స్వచ్చ సైనికులు- @2236*.

 

24 వ తేదీ శుక్రవారం వేకువ 4.21 వేళలో పాగోలు మార్గంలోని మహాబోధి – NTR ఉన్నత పాఠశాల వద్దకు వచ్చి చేరినది 17 మందైతే ఇంకా 8 మంది సైతం క్రమంగా తోడై, అక్కడి నుండి పడమర రోడ్డు మలుపు దాక ఉభయ దిశల్లో  స్వచ్చ-సుందరీకరణ జరిగింది. ముఖ్యంగా దక్షిణం ప్రక్కనే నేటి శ్రమదానం కేంద్రీకృతమైంది.

 

          చల్లపల్లి లోనికి ప్రవేశించే  ఏడు రహదారులూ గత ఏడెనిమిదేళ్లుగా  ఈ స్వచ్చంద కర్మిష్టులు ప్రణాళికా బద్ధంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నదే.  వీటిలో ఏది మిన్న అంటే చెప్పడం కష్టమే గాని, దేని ప్రత్యేకత, చరిత్ర దానివే! ఇవన్నీ గత దశాబ్దంలో పరమ నికృష్టంగా ఉండి,  ప్రయాణికుల ముక్కు,కన్ను మూసుకొని రాకపోకలు జరిపినవే! వారిలో ఎవరైనా ఇన్నేళ్ల తర్వాత వచ్చి చూస్తే నమ్మక అవాక్కులై పోదగినవే!

 

          ఈ పాగోలు బాట ఇప్పుడున్నంత సౌకర్యంగా, పుష్ప-హరిత సంభరితంగా తన వందల ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఉండి ఉండదు. మరి ఈ స్వచ్చ-పరిశుభ్ర-సౌందర్య సంపదంతా ఎలా సమకూరింది? ఇందుకు ప్రధాన బాధ్యులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి, నిర్వహిస్తున్న చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలైతే-అడపాదడపా  పాల్గొనే పాగోలు కార్యకర్తలు-ముఖ్యంగా రామబ్రహ్మం గారు!  ఇంతగా తీర్చిదిద్దిన వృక్ష సంపద, పారిశుద్ధ్యం, రంగు రంగుల రకరకాల పూల వైభవం, మళ్ళీ మళ్ళీ నడిచి చూడాలనిపించే పరిశుభ్రతా ఉన్న రహదారులు ఇంకా ఏ ఊరికైనా  ఉన్నాయా అనీ, ఈ అద్భుతాలెలా సాధ్యపడినవనీ ప్రతి ప్రయాణికుడూ ఆలోచించాలి!

 

          ఈ వేకువ 100 నిముషాల పాటు 25 మంది గ్రామ స్వచ్చ-శుభ్రతా కంకణ బద్ధులు అలాంటి పాగోలు రోడ్డులో ఎందుకు ఏమి సాధించారంటే :

- వానలకు, తోడైన గాలులకు తడిసి, ఒరిగిపోయిన మువ్వన్నెల అడవి తంగేడు పూల మొక్కల్ని జాగ్రత్తగా నిలబెట్టి, కొయ్యలు పాతి, ఊతమిచ్చి పాదులు మళ్ళీ సరిజేశారు.

- పిలవని పేరంటంగా మొలిచి, పెరుగుతున్న కొన్ని తాడి మొక్కల్ని, ముళ్ల మొక్కల్ని, పిచ్చి-దిష్టి మొక్కల్ని వీలైతే పీకి, లేకుంటే నరికి బాట అందాన్ని క్రమబద్ధీకరించారు. తీగలు చాస్తున్న గడ్డిని పీకి, చెక్కి, కొందరీ తుక్కునంతా దంతెలతో పోగులు చేయగా-ట్రాక్టర్ లోకి దానిని బట్వాడా చేసి, చెత్త కేంద్రానికి చేర్చే పని మంతులు కొందరు.

 

          అదలా ఉండగా కార్యకర్తల శ్రమదానాన్ని మెచ్చి కాబోలు-ప్రతి రోజూ వాళ్ళ పని వేళలో వరుణదేవుడు సాదరంగా పరామర్శించి పోతూనే ఉన్నాడు.

 

          నేటి కృషి  పర్యావలోకనసమయంలో నిన్నటి-గంగులవారిపాలెం రోడ్డు లో జరిగిన అష్ట వర్ణాల ఫౌంటైన్  ప్రారంభ వేడుక గురుంచి చర్చ జరిగింది. పనిలో పనిగా కాఫీలతో బాటు శంకర శాస్త్రి గారి బిస్కట్ల వితరణ కూడ ఐపోయింది.

 

          రేపటి వేకువ మనం కలుసుకొని సాధించవలసిన శుభ్ర-సౌందర్యాలు కూడ పాగోలు రోడ్డు లోనే!

 

          ఇట్టి వాళ్ళకె నా ప్రణామం 12

కృతజ్ఞతన్నదె మిగిలి ఉంటే- మంచికొక ప్రోత్సాహముంటే

భవితపై విశ్వాసముంటే- స్వచ్చతకె ప్రాధాన్యమిస్తే

నిరంతర శ్రమదాతలిరుగో నిర్నిబంధ గ్రామ ప్రగతికి

కర్తలిరుగో- స్వచ్చ సుందర కళాకారుల కొక ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

24.09.2021.