2257* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి ?

 

2257 * వ నాడు స్వగ్రామ బాధ్యతలు మోసిన ధన్యులు 27 మంది!

 

ఈ గురువారం సైతం అదే దృశ్యం! 4-18 సమయానికే 17 మంది చిల్లలవాగు గట్టు శ్మశానం (అసలీ పదం సమంజసం కాదేమో! - నిష్పక్షపాతులైన కొత్తవాళ్లది చూస్తే రుద్రభూమిఅనజాలరు!) దగ్గర సుప్రభాత గ్రామ సేవలకు సంసిద్దులు కావడమూ, మిగిలిన 10 మంది (అందులో ఇద్దరు ట్రస్టు కార్మికులు) అనతి క్షణాలలో వచ్చి కలవడమూ - ఇక అక్కడినుండి సుమారు 2 గంటలపాటు వక్కలగడ్డ, చల్లపల్లి పరిధిలోని 1 ½  కిలోమీటరు నిడివిగల విజయవాడ రహదారిలో 3-4 చోట్ల గ్రామ హితైక దృష్టితో సవినయ శ్రమదాన దృశ్యావిష్కరణమూ...

 

కోట ఉత్తరపు మలుపు దగ్గర, నడకుదురు దారి మలుపులో గుత్తేదారు రోడ్డు సరిజేయడానికి త్రవ్వించిన తారు- రాళ్ల గుట్టలుండడమూ, కార్యకర్తలు ఆ మిశ్రమ వ్యర్థంతో ఊరి ఇతర రోడ్ల మరమత్తు చేయాలని, సంబంధిత అధికారుల్ని సంప్రదించి, పూనుకోవడమూ, చకచకా జరిగిపోయినవి!

 

మరి- అప్పుడు చూడాలి - అసలైన గ్రామ ప్రయోజనకర శ్రమైకజీవన సౌందర్యాన్ని! మూడు ట్రాక్టర్ల ట్రక్కుల్లోకి ఆ గంటన్నర కాలంలో బరువైన- జిగటైన తారు – రాళ్ల మిశ్రమాన్ని డిప్పల్తో, చేతుల్తో, పెళ్లగించి, నింపడంలో కార్యకర్తల పట్టుదల ఎలాంటిదో గ్రహించవచ్చు-ముఖ్యంగా, సర్పంచితో సహా మహిళల ఉత్సాహం వాట్సాప్ ఫొటోల్లో గమనించండి.

 

ఒక గ్రామం సమస్యల్ని- బాగోగుల్ని- ప్రజల సౌకర్యాన్ని- క్షుణ్ణంగా ఆకళించుకొని, ఉన్న ఊరినంతా సొంతం చేసుకొని

( దీనర్థం ఐనకాడికి ఆక్రమించడం కాదు- బాగు చేయడం) ఊరి జనమంతటినీ తనవాళ్లుగా నిర్ణయించుకొని, మేమున్నామని ఆచరణ పూర్వకంగా భరోసా ఇవ్వడమంటే ఇది కాదా? మన హక్కుల్ని ఇతరుల మీద రుద్దడం కాక - గ్రామస్తులందరి బాధ్యతల్ని మనం స్వీకరించడం కన్న వేరే ఘనత ఏమిటి? ఏ గ్రామానికైనా ప్రస్తుతం కావలసింది ఇలా బాధ్యతలు మోసే కార్యకర్తలే!

 

చిల్లలవాగు వంతెన కటూఇటూ గత 3 రోజుల కార్యకర్తల శ్రమదానంతో ఇప్పుడెంత స్వచ్ఛ- పరిశుభ్రంగా ఉన్నదో గమనిస్తే సుదీర్ఘ కాలంగా వారి కృషి , ప్రణాళిక ఎంతగా ఫల ప్రదమౌతున్నదో తెలుస్తుంది!

కాఫీ వేళ జరిగిన సమీక్షా సమావేశంలో యార్లగడ్డ గ్రామ స్వచ్ఛ- శుభ్ర- హరిత కర్తవ్యాన్ని 750 దినాలుగా నెరవేరుస్తున్న రెవిన్యూ ఉద్యోగి- తూము వెంకటేశ్వరావుగారి త్రిగుణాత్మక సంకల్ప నినాదాలూ, కొంతకాలం స్వచ్చోద్యమంలో పాల్గొని, 14 రోజుల్నాడు దివంగతులైన పిండిగంటి సీతారామయ్య గారి రేపటి కర్మకు వారి కుమారుని పిలుపూ చోటుచేసుకున్నవి.

 

శుక్రవారం వేకువ మన స్వచ్ఛంద శ్రమదాన ప్రదేశం బందరు మార్గం లో- సంతబజారు దగ్గరే!

 

         ఈ మహాత్ములకే ప్రణామం  31

 

“భూమి తాపమె ప్రళయ శాపం - భూరి కాలుష్యమె కారణం”

అనెడి శాస్త్రజ్ఞుల ప్రచారం ఆలకించీ- కలత చెందీ

 దేశమందొక గ్రామమైనా తేజరిలి కాలుష్యరహితం

చేయుటకు పోరాడు వారికి చేసెదను నా తొలి ప్రణామం!                  

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

21.10.2021.