2258* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

అద్భుత ఆదర్శ సామూహిక - శ్రమదానం 2258* వ రోజు.

 

            నేటి (22-10-21) ఉషోదయాత్పూర్వ గ్రామసేవల రంగస్థలం బందరు రహదారిలో సంతవీధి మొదలు పెట్రోలు బంకు దాక! పనివేళ - 4.20 నుండి 6.15 వరకు. వీధి పారిశుద్ధ్య కృషికి అంకితులైనదేమో 25 మంది! వచ్చి - పోతున్న ప్రయాణికులు, భక్తులు, వ్యాపారులు మాత్రం వందల కొద్దీ!

 

            120x20 గజాల సువిశాల మార్గాన్ని ఈవేకువ వేళ, 45 పనిగంటలు శ్రమించి, సుందర స్వచ్చ - శుభ్రంగా తీర్చిదిద్దిన వాళ్లనూ, గత రాత్రి దాక వీధిని - ముఖ్యంగా ATM కేంద్రాన్ని తమ వ్యాపార కార్యకలాపంతో - అజాగ్రత్తతో కలుషితం చేసిన కొందరు వ్యక్తులు గబగబా వచ్చి, తమ తోపుడుబళ్ళను, చాపల్ని, పట్టల్ని పరుస్తున్నవైనాన్ని గమనిస్తుంటే కొంచెం వింతగా అనిపించింది!

 

            ఈ వీధి 150 గజాల్లోనే ఇన్ని ఎరువుల కొట్లు, కూరల అంగళ్లు, వాహన విక్రయ కేంద్రాలు, బంకు, మెకానిక్ షెడ్లు, హోటళ్లు, బ్యాంకులు, చిన్న - పెద్ద గుడులు, తోపుడు బళ్లు, కార్ల నిలయాలు....అరే! చల్లపల్లి ఇంత దినదినాభివృద్ధి చెందుతుందా?” అనిపిస్తుంది. కాని, పెరుగుతున్న జనజీవన వేగంతో, తరుగుతున్న స్వచ్ఛ - సుందర పారిశుద్ధ్యానికి కర్తలెవ్వవరు? భోక్తలెవ్వరు?

 

పాతిక మంది కార్యకర్తల నేటి గ్రామ బాధ్యతా నిర్వహణం ఇలా ఉంది :

 

- చీపుళ్లతో ముఠా వారు - (రెండేసి చీపుళ్లలో కూడా కొందరు) ఈ వెడల్పాటి దారినెంతగా ఊడ్చారంటే - దుమ్ము, ఇసుక, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఖాళీ సీసాలనెంతగా విడివిడిగా సమీకరించారంటే - టాటా ఏస్ ట్రక్కునిండా!

 

- ఐదారుగురు బాధ్యులు గోకుడు పారల్తో దారి అంచుల్ని గోకి, అంటుకున్న ఇసుక దుమ్ము మిశ్రమాన్ని డిప్పలకొద్దీ పోగులు పెట్టారు.

 

- అసలీ రోజు ATM. కేంద్ర కశ్మలమే 10 మంది కార్యకర్తలకు గంటకుపైగా సవాలు విసిరింది.

 

- బ్యాంకుల, దుకాణాల, హోటళ్ల ముంగిళ్లను ముగ్గురు మహిళా కార్యకర్తలు శుభ్రపరచడాన్ని సదరు యజమానులసలు గుర్తుంచుకొంటారా అని!

 

            వాళ్ల గుర్తింపులు, మెప్పులు ముఖ్యం కాదు గాని - 6.15 సమయంలో సంతవీధి బంకుల నడిమి పరిశుభ్ర - దర్శనీయ రహదారి ఎంతగా ఆకట్టు కొంటున్నదో పరిశీలించండి.

 

            గ్రామస్తులకు 6.30 వేళ ముమ్మారు స్వచ్ఛ పరిశుభ్ర - సౌందర్య దృఢ సంకల్పాన్ని కాస్త భిన్నంగా గుర్తుచేసిన వారు పల్నాటి అన్నపూర్ణ. ఈ మధ్యాహ్నం 12.30 కు దివంగత మన కార్యకర్త పిండిగంటి సీతారామయ్య గారికి శ్రద్ధాంజలి ఘటించదగిన సమయం.

 

            శనివారం వేకువ కూడ మన స్వచ్ఛ సంకల్ప గమ్యం ATM కేంద్రమే!

 

            ఈ మహాత్ములకే ప్రణామం – 32

 

జాతకాలూ, ముహూర్తాలూ, హేతు బద్ధం కాని చర్యలు

మాకు వలదని శాస్త్ర విహితపు మార్గమందే ప్రయాణిస్తూ

రాటు దేలిన గామరక్షక సుందరీకరణ ప్రబోధక

చల్లపల్లి స్వచ్ఛ సుందర జనుల కిదిగో నా ప్రణామం!

                         

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

22.10.2021.