ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?
ఊరి శుభ్ర – సౌందర్య – స్వస్తతా సాధనలో 2259* వ నాడు
గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమానికి గర్వకారణంగా (?) –
28000 వేల ప్రజలకు గాను 28 మంది - వేకువ 4.20 కే ప్రధాన వీధి పారిశుద్ధ్య సౌందర్యాల కోసం సంసిద్ధులయ్యారు. తదాదిగా - 6.10 వేళ దాక చిన్న కార్ల షెడ్డు - 3 రోడ్ల సెంటరుల నడుమ నెలకొన్న పరిశుభ్రతకూ, రేపు చేయవలసిన రహదారి భాగానికీ వ్యత్యాసాన్ని వాట్సాప్ ఛాయా చిత్రంలో గమనించండి. వీలైతే – ఈ ఏడెనిమిదేళ్ల స్వచ్చోద్యమ సుందర చల్లపల్లికీ - వందల, వేల ఇతర గ్రామాలకూ ఏ తేడా ఉందో కూడా గుర్తించండి!
ఔను - నిజం! విజ్ఞతా - చైతన్య గ్రామమనే పేరున్న - 28 వేల సంఖ్యాబలమున్న మన మహత్తర గ్రామం నుండి కర్తవ్య నిర్వహణకు కదలివచ్చింది 28 మందే! మళ్ళీ ఇందులో పొరుగు గ్రామాల నుండి, జిల్లా నుండి ప్రాతినిధ్యం ఉంది సుమా! ఐతే - మరో కోణం నుండి చూస్తే – ఈ కొద్దిమందే అసంఖ్యాక గ్రామాల మీద చూపిన ప్రభావము కూడా తక్కువేం గాదు!
పిట్టకొంచెం - కూతఘనం. ఈ అల్ప సంఖ్యాక కార్యకర్తల అభినివేశం, చాకచక్యం, ఉత్సాహం, ఈ నాటి 50 పనిగంటలలో సాధించిన గ్రామ పారిశుద్ధ్యం తక్కువేమీ కాదు! అందుకు సాక్ష్యం ట్రక్కుల కొద్దీ ఉడ్చి, డిప్పలతో నింపిన దుమ్ము – ఇసుక - ఖాళీ సీసాలు – రకరకాల ప్లాస్టిక్ తుక్కులూ!
దీన్నే కాస్త తిరగేసి ఆలోచిస్తే – నిత్యం మనం నడిచే – ఈ అందమైన గ్రామ రహదారుల్ని ఇంతగా కశ్మలమయం చేసి, పాతిక మందికి పైగా కార్యకర్తలకు ముమ్మరంగా పనికల్పించే సత్తా, సామర్థ్యంలో మన చల్లపల్లి మాత్రం ఏ ఇతర గ్రామం కన్న బొత్తిగా వెనుకబడి లేదే! పొరుగూళ్ల నుండి - ఎక్కడో తణుకు నుండి - వచ్చి, తమ ఊరి శుభ్ర -సౌందర్యాలకు వేలాది దినాలుగా పాటుబడుతున్న వాళ్లను చూసి కూడ తాము మాత్రం ప్రయత్నించని నిబ్బరం ప్రస్తావనార్హం కాదా?
అదేపనిగా గూళ్ళునొప్పి పట్టేంతగా చీపుళ్లతో ఇన్ని షాపుల - బంకుల – గుడుల - బేకరీల మట్టినీ, ఇసుకనూ, ఇతర వ్యర్ధాలనూ ఊడ్చే ఇందరు శ్రమదాతలను చూస్తున్నప్పుడు - ముఖ్యంగా బ్యాంకు ముంగిటి మురుగు కాల్వను బాగుచేసే దృశ్యంతో నాకు మాత్రం తనువూ – మనసూ పులకిస్తున్నది!
ఎందరెందరో గ్రామ పారిశుద్ధ్య పర్యవేక్షకులకు భిన్నంగా చల్లపల్లి జనం స్వస్తతకు ఎంతగానో అంకితుడైన సుధాకర్ 6.25 సమయంలో ఊరి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య స్ఫోరక నినాదాలు ప్రకటించారు.
ఈ నాటి కార్యకర్తల శ్రమదాన వేడుకకు ఒక సీనియర్ పాత్రికేయుడు సాక్ష్యంగా నిలిచారు.
రేపటి గ్రామ సామాజిక బాధ్యతా నిర్వహణకై మూడు రహదార్ల కేంద్రం దగ్గరే మనం కలుసుకోవలసి ఉన్నది.
ఈ మహాత్ములకే ప్రణామం – 33
గతం తెలిసీ, వర్తమానపు గంద్రగోళం గుట్టెరింగీ,
పూర్వ పరములెరింగి, వాస్తవ పరిస్థితులు సమన్వయించీ,
భావి తరముల మేటి బ్రతుకుకు బాట పరచు మహోద్యమంలో
మమేక మయ్యే స్వచ్ఛ సుందర మాన్యతకు చేసెద ప్రణామం!
ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త
23.10.2021.