2261* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?

గ్రామ మెరుగుదల కృషిలో 2261* వ రోజు

            ఈ బుధవారం (27.10.2021) వేకువ 4.20 నిముషాలకు 27 మంది స్వచ్చంద కార్యకర్తల శ్రమదానంతో మరింత మెరుగులు దిద్దుకున్న ప్రదేశం RTC బస్ ప్రాంగణ సమీపం. పై కార్యకర్తలలో 12 మంది తొలి వాట్సాప్ చిత్రంలో బస్ ప్రాంగణం లోపల కనిపిస్తున్నారు.

            ఐదారుగురు మహిళా కార్యకర్తల రకరకాల వీధి పారిశుధ్య కృషి గాని, వివిధ పనిముట్లతో అంత వేకువ నడి రోడ్డుపైన భయసంకోచాలు తెలియని వీరి శ్రమ, సమయ త్యాగం గ్రామస్తులలో ఎందరు ప్రదర్శిస్తున్నారు?

            బస్ ప్రాంగణం లోపలి భాగం ఎన్నెన్నో పూల మొక్కలతో పచ్చని చెట్లతో స్వచ్చోద్యమ సంబంధిత నినాదాల వ్రాతలతో అడుగడుగున ఐదారేళ్ళ కార్యకర్తల శ్రమ ఫలితం అనేది ప్రయాణికులు, RTC అధికారులు ఉద్యోగులు ఎప్పుడూ గుర్తుంచుకుంటున్నారు. మరి, గ్రామస్తుల వైఖరి ఏమిటి ?

            ఏడెనిమిదేళ్ళ కార్యకర్తల ఉగ్గుబాలతో అలవడిన రకరకాల స్వచ్ఛ సుందర ప్రయత్నాలే నేడు కూడా పునరావిష్క్రుతమయినది! అనగా చీపుళ్ళతో ఊడవడం, హోటళ్ళ బడ్డీ కొట్ల - వివిధ వాణిద్య సముదాయాల ప్లాస్టిక్ తుక్కులూ, ఎంగిలాకులు, రాళ్లు రప్పలూ ఎక్కడైనా ఉంటే పిచ్చి, ముళ్ళ కంపలు తొలగించి వందలాది బస్సుల, ప్రయాణికుల ఆహ్లాదమే ధ్యేయంగా పని పూర్తి చేశారు.          

            స్వచ్చంద శ్రమదానం ముగింపు వేళ 6.20 నిముషాలకు తమ గ్రామ స్వచ్ఛ సుందర దీక్షా నినాదాలను పలికే వంతు ఘంటశాల - నందేటి - పాటల శ్రీనివాస్ ది.

            రేపటి వేకువ మన దీక్ష కొనసాగింపు కోసం మరల ఈ ప్రభుత్వ ప్రయాణ రవాణా కేంద్రంలోనే కలుద్దాం.

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

27.10.2021.