2264*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?

 

2264* వ నాటి ఉదాహరణయోగ్యమైన అభ్యున్నత కృషి.

 

          నిలకడైన - ప్రజోపయోగకరమైన - సుదీర్ఘ స్వచ్చోద్యమానికి చిరునామాగా మారిన చల్లపల్లిలో RTC బస్ ప్రాంగణమది. తమ గ్రామ మెరుగుదలకు ఏడెనిమిదేళ్లగా కంకణబద్ధులైన 26 మంది 4.18 - 6.10 నడుమ ఉషోదయంలో ఈ శనివారం సమర్పించిన శ్రమశక్తితో - వచ్చే పోయే బస్ రొదల మధ్యనే 3 చోట్ల శుభ్రంగా మారింది.

 

          ఐదారుగురు బాహ్య నిష్క్రమణ మార్గం దగ్గర పారలతో, డిప్పల్తో నిర్విరామంగా, బురద మట్టిని ట్రక్కులో నింపి, శ్మశానవాటికలో దాన్ని వాడిన కృషితో బాటు – ఒక RTC ఉద్యోగి 10 గజాల దూరంలో చక్కని మూత్రశాల ఉన్నా – ఈ కార్యకర్తల సమీపంలోనే విలాసంగా అల్పాచమానానికి పాల్పడడం కూడ చూశాను!

 

          సుందరీకరణ బృందం బాహ్య మార్గంలో గోకుడుపారతో, డిప్ప - కత్తి సాధనాలతో – వాళ్ళ శైలిలో వాళ్ళు ప్రయత్నించడమూ – ముఖ్యంగా బురదలోనే మోకాళ్ళ మీద కూర్చొని, బోగన్ విలియా అందాలకు మెరుగులు దిద్దిన కార్యకర్తను ఇప్పుడైనా వాట్సాప్ లో చూడవచ్చు!

 

          భారీ వేప వృక్షం - పాత మూత్రశాల ప్రాంతంలో 10-12 మంది రాటు దేలిన కార్యకర్తలు తడి-పొడి బురదలోనే చెత్త తొలగించి, ఎవరెవరి ఉచ్చిష్టాలనో ఏరి, ఎగుడు దిగుడుల్ని సరిజేస్తున్న గంటన్నర శ్రమజీవన ధన్యతకు నేను ఖరీదు కట్టనూ లేను – నా గ్రామస్తులు ప్రతిస్పందించనూ స్పందించరు!

 

          ఇలాంటి అభ్యంతరాలను వదిలేస్తే, 6.10 వేళలో వాళ్ళు పని ముగించి, కాఫీ సేవిస్తున్నప్పుడు - ఈ విశాల ప్రాంగణాన్ని ఆసాంతం పర్యాలోకించగా :

 

- మన చల్లపల్లి మద్య సంస్కృతీ వైభవ చిహ్నంగా - రోజుటిలాగే కార్యకర్తలు ఏరి గుట్టలు పెట్టిన ఖాళీ సీసాలు,

 

- మహిళలు ఉడ్చిన కసవు పోగులు, ప్లాస్టిక్ సంచులు, సేకరించిన ఇతరేత వ్యర్ధాల గుట్టలు,

 

- అదే సమయంలో శుభ్ర – స్వచ్చీకరించినమేర సంతృప్తికరంగా, ప్రయాణికులకు ఆహ్లాదకరంగా రూపొందిన ప్రదేశమూ,

 

- ఇన్ని విధాలుగా, ఇందరు శ్రమదాతలు పాటుబడుతున్నా చిద్విలాసంగా, చిన్మయంగా చూడడం తప్ప స్పందించని స్థిత ప్రజ్ఞులు...       

          వంటి దృశ్యాలు కనిపించాయి!

 

          సాక్షి విలేకరి, స్వచ్చోద్యమ విధేయుడు ఐన జిలాని నామధేయుడు నేటి కారకర్తల కృషికి పొంగిపోతుండగా, ఈ ఊరి సౌందర్య ప్రక్రియను భుజాల మీద మోస్తున్న డాక్టరు పద్మావతి స్వచ్చోద్యమాన్ని నినదిస్తుండగా, ఉద్యమసారథి ప్రణాళికా పూర్వక సమీక్ష నిర్వహించగా - 6.40 కి నేటి మన ప్రయత్నం రేపటికి వాయిదా పడింది!

          రేపటి శుభ్ర - సుందరీకరణ ఉద్యోగం కోసం వేకువనే మన కలయిక ఇదే బస్ ప్రాంగణంలోనే !

          ఈ మహాత్ములకే ప్రణామం – 37

“కలలు కనుడని - నిజం చేస్తూ గర్వపడుడని" కలాం చెప్పిన

సూక్తులన్నీ ఒంట బట్టిన స్వచ్ఛ - సుందర కార్యకర్తల

ఏడొ - ఎనిమిదొ ఏళ్ల కృషితో ఈ పురాతన గ్రామ చిత్రం

మార్చి వేయుటకై శ్రమించిన మార్గదర్శుల కే ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త,

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

30.10.2021.