2271*వ రోజు....

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు...

 

గ్రామ సుందర - స్వచ్చోద్యమంలో ఇది 2271* వ తరంగం.

 

ఇటీవలి కాలంలో సోమవారం చల్లపల్లి స్వచ్చంద శ్రమదానానికి ఆటవిడుపుగా మారింది. అయితే అతుత్సాహపరులైన కొందరు కార్యకర్తలు – ఆటవిడుపుగానైనా సరే విరామాన్ని సహింపక ఈ వేళ కూడా శ్రమత్యాగానికి పాల్పడ్డారు. ఐతే ఇది స్వగ్రామంలో కాక ఐదు కిలోమీటర్ల దూరంలోని ఘంటసాల పంచాయితీ పరిధిలోని పెద్ద గూడెం వీధులకెక్కింది.

 

          స్థానిక యువ శ్రమదాతలు కొందరు వీరికి తోడై అక్కడి వీధి పారిశుద్ధ్యం, పచ్చదనం, మరికొంత సుందరీకరణం ఆ వీధులలో సాధించడం విశేషమే కదా! ఇంతేనా, అక్కడి శ్మశానంలో సైతం ఆ వేకువ చీకటిలోనే – ప్రమధ గణంలా శ్మశాన సేవలలో భాగంగా – పిచ్చి, ముళ్ళ మొక్కల్ని తొలగించి బాటను నడకకనువుగా మార్చి, గంటన్నర పైగా శ్రమించి కాస్త జన సంచాయోగ్యంగా రూపొందించి గాని సంతృప్తి చెందలేదు. ఇక స్థానికుల సంఘీభావం, సంతృప్తి సరే సరి!

 

          ఊరేదైనా, చోటేదైనా మన శ్రమదాన వ్యసనపరులకు క్రొత్త ఏముంటుంది, అది అసలు వీళ్ళు శ్రమదానమమనో, కష్ట సాధ్యమనో, బరువు బాధ్యతలనో భావిస్తే గదా?  

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

08.11.2021.