1850* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1850* వ నాటి కృషి.

ఈ నాటి ఉదయం 4.07-6.25 నిముషాల నడుమ విజయవాడ మార్గంలో గ్రామం కోసం జరిగిన స్వచ్చ శ్రమదానంలో పాల్గొన్న ధన్యులు 25 మంది. ఒక బృందంగా కాక, మూడు చీలికలుగా సాగిన ఈ కృషి వ్యవసాయ శాఖ కార్యలయం నుండి మండల రెవిన్యూ కార్యాలయాల మధ్య జరిగింది.

 

సుందరీకరణ బృందం  ఈ సారి నీటి పారుదల శాఖ కు చెందిన భవనం ప్రహరీల వెలుపల- డ్రైను ప్రక్క జాగాను ముందు శుభ్రం చేసి, పిదప ఆ గోడను తుడిచి, రేపు రంగులు వేసేందుకు గాను ప్రైమర్ పూశారు.

 

డజను మంది ఇక్కడే రోడ్డుకు పడమర దిశ లోని రోడ్ల- భవనాల శాఖ అతిథి గృహం ఆవరణలో స్వచ్చ-శుభ్ర-సుందరీకరణలకు పాల్పడ్డారు. అక్కడి పిచ్చి-ముళ్ల కంపలను, తీగలను నరికి, అనేక రకాల కశ్మలాలను ఊడ్చి, ఆ గుట్టలను ట్రాక్టర్ లోకి ఎక్కించి, చెత్త కేంద్రానికి తరలించారు.

 

క్రమంగా శిథిలావస్తలోకి జారుతున్న ఆ భవన ప్రాంగణం ఇప్పుడు కొంత చూడదగినదిగా ఉన్నది.

 

మూడవ బృందం M.D.O కార్యాలయం ముందున్న అంబేద్కర్ విగ్రహం ఎదుటి-ఒకప్పటి తామే ఏర్పరచిన ఉద్యానవనాన్ని శుభ్రతరం కావించారు. విజయవాడ రహదారి ని కొంత మేరకు ఊడ్చి మెరుగుపరచారు.

 

పూల మొక్కల (తాతినేని) రమణ గారు నివాస భవనాల ఉపరితలం మీద సేంద్రీయ కూరగాయల-ఆకు కూరల పెంపకాన్ని సవివరంగా ప్రస్తావించి, కార్యకర్తలంతా అతి తక్కువ ఖర్చుతో ఈ ఆరోగ్యప్రదమైన వ్యవసాయం చేయాలని సూచించారు. 6.40 నిముషాల కు ఈయనే మన గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించడం తో నేటి మన గ్రామ సామాజిక బాధ్యతకు స్వస్తి.

 

రేపటి మన శ్రమదానం కోసం బికనీర్ దగ్గర కలుసుకొందాం!

 

       ఇంక మిగిలిన దొక్కటే మరి.

మనో నిబ్బర గుణం ఉన్నది-మహోత్తమ సంస్కారమున్నది

కొత్త సంస్కృతి ప్రతిష్టించే నిత్య నూత్న ప్రయత్నమున్నది

సుదీర్ఘ శ్రమదాన మొసగే స్వచ్చ సుందర మనసులున్నవి

చల్లపల్లి కి మహర్దశ ఇక సంభవించుటె మిగిలియున్నది!

  

     నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 5/12/2019,

చల్లపల్లి.