2332* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

మకర సంక్రాంతి వీధి సేవలో 35 మంది - @2332*

        నిన్నటి పెద్ద వర్ష కారణంగా NTR పార్కు బదులు మునసబు, రాయపాటి వీధుల్లో జరిగిన పారిశుద్ధ్య కృషిలో పాల్గొన్న వారి సంఖ్య 35! శనివారం పర్వదిన శుభోదయాన 4.17 సమయానికే ప్రారంభమైన గ్రామ బాధ్యతలలో పండగ పనుల్ని కాస్త వాయిదా వేసి, ఇందరు శ్రామికులు - ముఖ్యంగా మహిళలు గ్రామ స్వచ్చోద్యమంతో మమేకమవ్వడం ఊరంతటికీ శుభప్రదం!

        “నా ఇల్లు నా కుటుంబం - నా సొంత బాధ్యతలు నా వాళ్ల బాగోగులు......అనుకోక – “ఈ ఊరి బాధ్యత నాకు గూడ ఉన్నది - నేనీ మాత్రం ఒక గంటన్నర సమయం పొరుగువాళ్ల కోసం శ్రమించలేనా...అనుకొనే 30 – 40 – 50 మందికి పైగా త్యాగధనులుండడమే - ఈ చల్లపల్లి ప్రత్యేకత! ఈ మాత్రం కర్తవ్య స్పృహ ఈ కొద్ది మందిలో ఎప్పుడు మొదలయిందో - ఇక వాళ్లు క్రమ క్రమంగా వీధులు ఊడుస్తున్నారు - డ్రైన్లు శుభ్రపరుస్తున్నారు - ప్రధాన రహదార్ల వందలాది గుంటలు పూడుస్తున్నారు - శ్మశానాలు, RTC ప్రాంగణాలు, ఒకటేమిటి, ఊరికేవి ప్రయోజనకరమైతే అవన్నీ చేస్తూనే ఉన్నారు - ఎనిమిదేళ్ల నుండీ!

        “ఇదసలే పెద్ద పండుగ! ఏమైనా సరే - ఉదయం పూట 8.00 కాకముందే నిద్ర లేవాలి - తలంట్లు, కొత్తబట్టలు, అరిసెలూ, పరమాన్నాలూ.....ఇవ్వాళంతా హ్యాపీగా గడపాలి...అనేది సాంప్రదాయకమే! కాని, “ఇల్లూ, పెరడూ, పరిసరాలూ ఇవాళ బాగా శుభ్రపరచుకోవాలి - ఇంటెదుటి వీధిని కూడ జాగ్రత్త పడాలి - ఇరుగు పొరుగు వాళ్లు సైతం శుభ్రంగా - సంతోషంగా ఉన్నారా లేదో గమనిద్దాం....!అనేదేమో కాలానుగుణ క్రొత్త, మంచి సంస్కృతి! అంటే - ఈ స్వచ్ఛ కార్యకర్తల నూతన సంప్రదాయం!

        “తింటే గారెలే తినాలి - వింటే భారతమే వినాలి!అనే మంచి సామెతలాగా:ఉంటే ఇలా బాధ్యత గల స్వచ్ఛ కార్యకర్తల్లా ఉండాలి - స్వచ్ఛ శుభ్ర - సుందర చల్లపల్లి లాంటి ఊళ్లోనే ఉండాలిఅని ఒక కొంగ్రొత్త సామెత తోడైతే బాగుంటుంది!

 

        నేడు శుభ్రపడినది అమరావతి జమీందార్ల భవన దక్షిణ వీధి. మహా ఐతే వంద గజాల చిన్నవీధి! (కాలుష్యాలూ, పిచ్చి - ముళ్ల మొక్కలూ, రోడ్డు మీద పేర్చిన అడ్డాలు, ఆక్రమణల్లో మాత్రం తక్కువ తిన్నదేం కాదు!) పాతిక మంది కార్యకర్తల - 40 పని గంటల శ్రమంతా ఈ చిరు వీధికే సమర్పితమయిందంటే - దాని పరిస్థితేంటో చూసుకోండి! నిన్నటి వానకు తడి - పొడిగా, చీకటిగా ఉన్న ఈ రోడ్డంతా చాల వరకు బాగు పడింది!

        మునసబు వీధి కిరువైపులా - మలుపులో బెత్లెహేము చర్చిదాక గడ్డి తొలగి, గజం చొప్పున రెండు ప్రక్కలా గోకుడు పారల చెక్కుడుతో ఇసుక దుమ్ము పోయి, మరింత విశాలంగా కనిపిస్తున్నదంటే అందుకు బాధ్యులు 10 మంది కార్యకర్తలు!

        ఏమయితే నేం సంక్రాంతి నాడు కూడ ఈ రెండు వీధుల స్వచ్ఛ - సౌందర్యాలు సాధించి పంతం నెగ్గించుకొన్న కార్యకర్తలు అభివందనీయులు!

        7.00 కు కాస్త ముందు - కాఫీకి ముందు గానే అరిసెల, చెక్కల సాంప్రదాయాన్ని ట్రస్టు వారు పాటిస్తే - RMP శేషు సందర్భానుగుణ గేయాలాలపిస్తే - రాయపాటి సోదరులిద్దరు - వేంకట సూర్య ప్రసాదరావు, రాధాకృష్ణ గారలు మేనేజింగ్ ట్రస్టీకి చెరి రెండు వేల విరాళం సమర్పించగా - తాతినేని (నర్సరీ) రమణ ముమ్మారు స్వచ్ఛ శుభ్ర సౌందర్య ప్రతిజ్ఞలు నినదించగా నేటి శ్రమదాన పండుగ పరిసమాప్తి!

        రేపటి కనుమ పండగను కమ్యూనిస్టు వీధి దగ్గర ఆగి, కలుసుకొని, బందరు రహదారి శుభ్రతా పూర్వకంగా జరుపుకొందాం!

 

        ఇదొక స్వచ్ఛతా వృక్షం

ఎందరెందరిదొ స్వప్నం - ఇది గ్రామ వికాస పథం

కలలనేవి సాకారం కావడమే అద్భుతం!

చల్లపల్లి స్వచ్ఛ సైన్య సాహసమొక అంకురం

ఎన్నెన్నో గ్రామాలకు విస్తరించె ఆ వృక్షం!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  15.01.2022.

రాయపాటి సోదరులిద్దరు - వేంకట సూర్య ప్రసాదరావు, రాధాకృష్ణ గారలు మేనేజింగ్ ట్రస్టీకి చెరి రెండు వేల విరాళం సమర్పించారు.