2333* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

 

         కనుమ పండుగ పూట సైతం 34 మంది శ్రమదాన పండుగ -@2333*.

 

         నిన్న కూడ ఉనికి చాటుకొన్న అకాల వర్షం ఈ ఆదివారం (16.01.2022) వేకువ విశ్రాంతి తీసుకొన్నది గాని, సంక్రాంతి సహజ శీతలానికి తోడు- వర్షం తాలూకు వాతావరణం, ఈదురు గాలి వల్ల బాగా చలిగానే ఉన్నది! ఐతేనేం 4.24 నుండి 6.17 నిముషాల దాక కార్యకర్తల గ్రామ బాధ్యతలు మాత్రం యదావిథిగా జరిగి, పెద్ద మసీదు నుండి యడ్ల వారి వీధి దాక స్వచ్చ భావుకులకు దర్శనీయంగా మారిపోయింది!

 

         ఈ రహదారి భాగం నిడివి 150 గజాలే గాని, చిన్నపాటి ఆక్రమణల్ని తట్టుకొని కూడ విశాలంగానే ఉన్నది! ఐతే – మేదర వృత్తి కారుల కార్మిక శాలలు రోడ్డు మార్జిన్ల లోనే; టిఫిన్ హోటళ్ల- టీ దుకాణాల కస్టమర్ల వినియోగ వ్యర్థాలు, రాజ్య లక్ష్మి ఆస్పత్రి బాట మూలలో తుక్కు- గడ్డి- ఇతర వ్యర్థాలు, వర్షాల వల్ల రోడ్డు కంటిన ఇసుక-దుమ్ము మిశ్రాలు, టీ కప్పులు.... ఈ రోడ్డుకు మాత్రం ఏం తక్కువ? కూరల, పళ్ల దుకాణాలు మాత్రం ఏ కాస్త అజాగ్రత్తగా ఉన్నా కాలుష్యాలు విరజిమ్మవా? ఇటు బందరు దారికీ, అటు ఆస్పత్రి బాట వాహనాలకీ అసౌకర్యం కలిగిస్తూ- ఏళ్ల తరబడీ రోడ్డును కొంత ఆక్రమించి ఠీవిగా నిలబడ్డ పాత ఫర్నీచర్ కొట్టు సంగతేమిటి?

 

         స్వచ్చోద్యమం ఏళ్లకేళ్లు గడిచిపోతూ ఉన్నా-30-40-50 మంది శ్రమదాతలు అలుపెరగక శ్రమిస్తూ ఉన్నా- ప్రధాన వీధిలో టీ-కాఫీ దుకాణ దారుల, వ్యాపారుల, స్తల యాజమానుల బాధ్యతాయుత స్పందన ఇంతేనా?

 

         ఏడెనిమిదేళ్లుగా స్వచ్చ-శుభ్ర-సుందర వాతావరణంలో ఉన్న గ్రామస్తుల పరిస్థితే ఇలా   ఉంటే- కడమ ఊళ్ల మాటేమిటి?

 

         ఈ ఉదయం మంచి ఆసక్తికర అంశమేమంటే-ఆస్పత్రి, సూరి డాక్టర్ వీధుల మయాన- ఒక సుపరిచితుడైన గ్రామస్తుడే గాని- పేరు గుర్తు లేదు-గంట సేపు ఈ గ్రామ ప్రముఖులు, పెద్దలు, మహిళలు పారలతో, గోకుడు- రైల్వే పారల్తో-చీపుళ్లతో మట్టిని గోకి ఇసుకను ఊడ్చి, దిక్కుమాలిన వ్యర్థాలను పోగులు చేసి, ట్రాక్టర్ లో నింపి శ్రమిస్తూ ఉంటే- ఆసక్తి గాను, పరిశీలన గాను చూస్తూనే ఉన్నాడు తప్ప-టెంప్ట్ కాలేదు, వేలు పెట్టనూ లేదు!

(ఇలాంటప్పుడే తాత్కాలికంగా మన స్వచ్చోద్యమం పట్ల కాస్త అనుమానం వస్తుంటుంది!)

         - ఆ వ్యక్తి చూస్తుండగానే క్షణం తీరుబడి లేని అక్కడి హోటల్ యజమానురాలు  ఆలస్యంగానైనా వచ్చి, మురుగు గుంట దగ్గర 20 నిముషాలైనా సహకరించి వెళ్లింది.

 

         - ఇంటి బాధ్యతలు పిలుస్తూ ఉన్నా, సర్ది చెప్పుకొని, వీధి పారిశుద్ధ్యమే ముఖ్యమనుకొని కొందరు గృహిణులు అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నారు!

 

         - ఈ 34 మందిలో నాలుగైదు కిలో మీటర్ల దూరం గ్రామం నుండి వచ్చి శ్రమించిన వారూ ఉన్నారు!

 

         - రోడ్డు ఉత్తర భాగాన చట్టుగా మారిన ఎర్ర మన్ను-ఇసుకల మిశ్రమాన్ని ఐదారుగురు పెద్దలు తొలగించి, బాట అందానికి మెరుగులు దిద్దుతూనే ఉన్నారు!

 

         అప్పుడిక తెలతెలవారి, 6.15 దాటి డి.ఆర్.కె గారి మూడవ (పని విరామ సూచక)ఈల మ్రోగి, ఒక నిత్య నూతన సంతృప్తి తో కార్యకర్తలు కాఫీలు సేవించి, కమ్యూనిష్టు వీధి ప్రవేశంలో అర్థ వలయంగా నిలిచి, శివరామపురం నుండి రోజూ వచ్చి, చల్లపల్లి ఉన్నతికై శ్రమిస్తున్న ఒక రైతు పెద్ద- మల్లంపాటి ప్రేమానందం మూడు మార్లు ప్రకటించిన గ్రామ స్వచ్చ-పరిశుభ్ర-సౌందర్య  ప్రతిజ్ఞలకు స్పందించి, 6.50 తరువాత ఇంటి దారి పట్టారు!

         బుధవారం నాటి (19.01.2022) వేకువ పారిశుద్ధ్య ప్రయత్నం కోసం మనం ఇదే బందరు రహదారిలోని చంటి హోటల్ దగ్గర కలుసుకొందాం!  

 

                  అనుసరిస్తే-అనుకరిస్తే

రెండు వేల దినాలపైగా వండి వార్చిన స్వచ్చ శుభ్రత

వాళ్లు మానితె గ్రామ శౌచం వట్టి బోవును - నీరుగారును

కరోన సమయంలోన ప్రతి యొక గ్రామ పౌరుడు నడుం కట్టి

అనుకరింపుడు-అనుసరింపుడు స్వచ్చ సైన్యం అడుగుజాడలు!  

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  16.01.2022.