2336* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

చల్లపల్లిలో ఒక అనుసరణీయ శ్రమదానం వయస్సు 2336* రోజులు!

            ఈ జనవరి 19 వ నాటి - బుధవారం వేకువ బందరు రహదారిలో నిర్దేశిత భాగం సూరి డాక్టర్ వీధి నుండి షాబుల బజారు దాక ఫలప్రదమైన శ్రమదానానికి కర్తలు 28 మంది! సదరు ముహుర్త కాలం 4.15 నుండి 6.17 వరకు! ఇందులో స్థానికులు ముగ్గురు. 50 కి పైగా పనిగంటలు – (ఉసూరుమంటూ కాదు) - ఉత్సాహభరిత వీధి పారిశుద్ధ్య కృషికి సాక్షులైన గ్రామస్తులు 50 కి పైగానే! (అందులో ఉత్తేజితులెందరో చెప్పలేం!)

            గ్రామానికి చాల ముఖ్యమైన ఈ వ్యాపార కేంద్రం సువిశాలమైనదే – (ముత్యాల) చంటి హోటల్ దగ్గర వినియోగదారులే 30 కి పైగా ఉన్నారు. వాళ్లు గాని, గృహస్తులు గాని, దుకాణదారులు గాని, 8 గంటలకు ఠంచనుగా వచ్చి, రోడ్డు మార్జిన్లలో టిఫిన్, పళ్ళు, కూరలు, ఎన్నెన్నో వస్తువులు విక్రయించుకొనే డజన్ల కొద్ది చిరు వ్యాపారులు గాని, ఏ ఒక్కరు వచ్చి, ఏ ఒక్కనాడైనా శ్రమదానానికి పాల్పడరే! (బందరు దారికి కాస్త ఎడంగా ఉన్న చంటి హోటల్ వారు తప్ప!)

            ఇందరు విద్యాధిక-  ఔద్యోగిక, విశ్రాంత – కర్షక - కార్యకర్తలు 2336* రోజులుగా వేకువ 3.30 కే లేచి, 4.00 కే ఇంటి నుండి బైటపడి - 4.15 కే ఎందుకిలా డైన్ల మురుగుల్ని, రోడ్డు దుమ్ము ధూళిని, రెండు గంటల పాటు స్వార్థ రహితంగా ఊడుస్తారో – సుందరీకరిస్తారో, ఈ వార్డులో జనం ఆలోచించవద్దా? ఇన్ని లక్షల పనిగంటల శ్రమదానానికి ముందు ఊరెలా అఘోరించిందో ఇప్పుడెలా మారిందో గుర్తుచేసుకోరా?

            సహకరించని గ్రామస్తుల్ని, ఉపేక్షిస్తున్న వార్డు విజ్ఞుల్ని, కలిసిరాని దుకాణాల వారి వైఖరికీ ఈ కార్యకర్తలేనాడూ నిరుత్సాహపడలేదు. రహదారుల్ని కశ్మల భూయిష్టం చేస్తున్న వారి పట్ల అసహనమో, ద్వేషమో పెట్టుకోలేదు! నిష్కామ కర్మిష్టుల్లాగా తమ బాధ్యతను ఏళ్ల తరబడీ కొనసాగిస్తూనే ఉన్నారు! ఏ రోజూకారోజు తమ గ్రామ పారిశుద్ధ్య మెరుగుదల కృషి పట్ల సంతృప్తి చెందుతూనే ఉన్నారు!

            వాట్సప్ చిత్రాలను బట్టి – నేటి వేకువ నన్ను కాదు – కాస్త సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా ఆలోచింపచేసే ఆచరణకు వురికొల్పేవి కొన్ని దృశ్యాలున్నాయి! అవేమంటే

- ఇద్దరు మహిళా కార్యకర్తలు – ఇంటి పనుల్లో అస్సలు తీరికే దొరకనివాళ్ళు (పేరుకు వదినా మరదళ్లు) పరమ దరిద్రంగా ఉన్న మురుగు కాల్వలో ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు, సంచులు, బురద మట్టి బైటకు లాగి మురుగు నీటికి చలనం తెచ్చిన విధానం!

- గ్రామ సర్పంచమ్మ, నర్సులు వెడల్పాటి – 50 గజాల రహదారిని ఊడ్చి, దుమ్మును – అన్ని రకాల తుక్కును పోగులు చేసి డిప్పల్తో ట్రక్కులో సర్దడం!

- బాటకు రెండు ప్రక్కలా, ఆస్పత్రి దిశగా, షాబుల్ వీధి మొదట్లోనూ 20 మంది కార్యకర్తలెంత క్షుణ్ణంగా – చిన్న కశ్మల శేషం కూడ మిగలనంతగా శుభ్రపరచడం తప్పక గమనించాలి.     

            కాఫీల వేళ 6.40 వేకువ మన సీనియర్ వైద్యుని సమీక్షానందం యధాతధం! అంతకు ముందు కార్యకర్తల్లో ఒక స్థూల వృద్ధ సింహం (కో వేంరావు) గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య భవిష్యత్తు నాకాంక్షించే నినాదాలను ముమ్మారు గర్జించింది.   

            రేపటి వేకువ మన కార్యక్షేత్రం షాబుల్ వీధి సమీపస్త బందరు రహదారే! మన పునర్దర్శన స్తలం గౌతమి దుకాణం దగ్గరే!

 

            బ్రతికేదీ బ్రతికించేది.

ఈ భూగోళం పుట్టుక ఎన్నెన్ని యుగాల మాట!

అదిటీవల పర్యావరణ ఆమూలం విధ్వస్తం

ఎన్ని కోట్ల స్వచ్ఛభటులు ఎంతెంతగ పాటుబడిన

అది బ్రతుకును, బ్రతికించును అభిలమానవాళిని!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  19.01.2022.