2340* వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

గ్రామ ముఖ్య వీధి పారిశుద్ధ్య కృషిలో 2340* వ నాడు.

         శుక్రవారం (4-2-22) వేకువ 4.18 కే బందరు రహదారిలోని చిన్న కార్ల స్థావరం దగ్గర మొదలైన స్వచ్ఛ కార్యకర్తల శ్రమానందం అక్షరాలా 2 గంటలు కొనసాగింది. మరొక వీధి - నాగాయలంక మార్గంలోని మరొక పెట్రోలు బంకు దాక అది వ్యాపిస్తుందనుకొన్నాను గాని, 22 మంది కార్యకర్తల ప్రయత్నం దానికి కాస్త దూరంలోనే ఆగింది!

         అందుకు కారణములేవనగా - ఇది అత్యంత జన సమ్మర్ద ప్రదేశం కావడమూ, వ్యాపార కూడలి ఐనందునా, ముఖ్యంగా వినియోగదారుల్లోను, దుకాణదారుల్లోను తగినంత స్వచ్ఛ - శుభ్ర స్పృహ లేకపోవడమూ, వృష్టి ప్రయోజనాలు గ్రామ సమష్టి ఆహ్లాదకర ప్రయోజనాన్ని మించిపోవడమూ....

         పాతిక మంది మొదలు 40 మందికి పైగా కార్యకర్తలు 1 ½ కిలోమీటర్ల ఈ బందరు రహదారిని శుభ్ర – సుందరం చేసేందుకు (మధ్యలో కొన్ని రోజులు మినహా) నెల రోజులు పట్టిందంటే - అందుకు తొలి కారణం గ్రామ సమాజంలో రావలసినంత సానుకూల పరివర్తన రాలేదనే గదా! వేలమంది గ్రామస్తుల - మరి కొన్ని వేల మంది సమీప గ్రామస్తుల బాధ్యతంతా ఈ పాతిక – ముప్పై మంది స్వచ్చోద్యమ కారులదేనా?

         నిన్నటి తరువాయిగా కాక, మళ్లీ నిన్న శుభ్రపరచిన చోటనే ఈరోజు కూడ చీపుళ్లకు పనిచెప్పడం ఈ నాటి పని జాప్యానికికొక కారణం! BSNL విశ్రాంత ఉద్యోగులిద్దరు బేకరీల ఎదుటి డ్రైను నుండి అరగంటలోనే నాలుగైదు డిప్పల కాగితం పొట్లాలు, ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు, కప్పులు, ఇతర వ్యర్థాలను బైటకు లాగడమంటే - ఇన్నేళ్ల స్వచ్చోద్యమం పిదప - అది దుకాణదారుల కాలుష్యానికొక కొలబద్ద!

         వచ్చే – పోయే మోటారు వాహనాల వేగాల నడుమనే ఈ మూడు రోడ్ల కూడలిలో డజను మంది కార్యకర్తల గంట సమయపు శ్రమకేళిని చూసి తీరాలి! చీపుళ్ల ఊడ్పుతో 2 గజాల ఎత్తుకు లేస్తున్న దుమ్ము - ధూళి మేఘాల మధ్య రెండు రకాల చీపుళ్లు ప్రయోగిస్తూ ఇసుక - దుమ్ముల్ని గుట్టలు చేయడం, నలుగురైదుగురా గుట్టల్ని డిప్పల్తో ఎత్తి రెండు రకాల వ్యర్థాలను రెండు ట్రక్కుల్తో డంపింగ్ కేంద్రాకి చేర్చడం, మిగిలిన ఐదారుగురు స్వీట్ల బళ్ల – పండ్ల – కూరల దుకాణాల మాటున దాగిన సమస్త వ్యర్ధాలనూ బైటకు లాగడం - ఇవి నా మట్టుకు నాకు మనోహర దృశ్యాలే!

         6.40 సమయంలో కాఫీ కబుర్ల ముగింపు పిదప ఈనాటి స్వచ్ఛ – పరిశుభ్ర – సుందర గ్రామ సంకల్ప నినాదాలిచ్చిన వారు పల్నాటి అన్నపూర్ణ!

         రేపటి మన ఊరి మెరుగుదల కోసం కలుసుకోదగిన చోటు - అవనిగడ్డ మార్గంలోని పాత శీతల పానీయ విక్రయశాల దగ్గరే!

 

     వంద మంది కాదు 30 వేల మంది

స్వచ్చోద్యమ చల్లపల్లి శ్రమదాతలు వందమందె

వెన్ను తట్టి నిలిచినదీ – నిలిపినదీ వేయి మందె

ప్రతి పౌరుడు ఇక మీదట స్వచ్ఛ కార్యకర్తవుతూ

అనుసరించి - ఆదరింపుడా అడుగుల జాడలను!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   04.02.2022.