2341* వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

చల్లపల్లి వీధి శుభ్ర - సుందరీకరణ శ్రమదాన తరంగాలు @2341*

శనివారపు బ్రహ్మ ముహూర్తాన (5-2-2022) స్వచ్చోద్యమ కారుల సన్నద్ధత – 4.20 కి ముందు 11 మందిది, తదుపరి కూడ అంతే మందిది. పని ముగింపు సమయం మాత్రం 6.22! కార్యకర్తల శ్రమదాన విన్యాసాల పరిధి మూడు రహదార్ల కూడలి నుండి పొట్టి శ్రీరాములు వీధి దాక! పని గంటల అంచనా 40 కి పై మాటే! నాగాయలంక మార్గంలోని 150 గజాల మేర పరిశుభ్ర - సుందరీకరణకైన ఖర్చు - ఇంత చల్లని మంచు వేళలో సైతం 20 మంది తుడుచుకొన్న చెమట చుక్కలు!

          ఈ రోజు మాత్రం గ్రామ శ్రమదాతల కన్న ముందుగానే దట్టమైన తెలిమంచు క్రమ్ము కొచ్చి, హాజరయింది! గ్రామస్తులు కాని, ప్రయాణికులు గాని ఎవరెంతగా ఈ నిస్వార్థ శ్రమదాన దృశ్యాన్ని చూశారో ఆలోచించారో - తెలియదుగాని, వీధి దీపాల కాంతుల్లో పొగ మంచు నడుమ, చీపుళ్ల వల్ల చెలరేగుతున్న ధూళి మేఘాల వలయంలో శ్రమిస్తున్న అరుదైన దృశ్యాన్ని నేను మాత్రం తదేకంగా చాలసేపు గమనించాను.

          ఈ శ్రమజీవన సుందర సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూశారో లేదో తెలియదు గాని, నిన్న ఒకమారు, అంతకుముందు కొన్నిమార్లు పరిశీలించడానికై గుంటూరు నుండి వచ్చిన జనచైతన్య వేదిక సభ్యులు, రాష్ట్ర మద్యపాన నిర్వీర్య బాధ్యులూ ఐన వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి తదితరులు సైతం చల్లపల్లిలో ఎనిమిదేళ్లుగా జరుగుతున్నది అనితర సాధ్యమైన ఆదర్శ కృషిగా ప్రశంసించారు. (మరి - తమ సొంత ఊరి స్వచ్చోద్యమాన్ని అంటీ ముట్టక - తామరాకు మీది నీటి బొట్టుగా గడుపుతున్న కొందరు గ్రామస్తుల సంగతేమిటి?)

          ఐతే - నేటి 20 మంది కార్యకర్తలకు మాత్రం ఈ భూషణ దూషణలు గాని, అత్మస్తుతి - పరనిందలు గానీ ఎక్కడ పట్టాయి గనుక? వాళ్ల దృష్టి ఏ పెట్రోలు బంకు దగ్గర స్వచ్ఛ - శుభ్రతలు కొరవడ్డాయో, ఏ చిల్లరకొట్ల పండ్ల కొట్ల - కూరల దుకాణాల దగ్గర ఎన్నెన్ని చెత్తలు పోగుబడ్డాయో, ఏ రహదారి మీద పరిపాలకుల నిర్లక్షంతో ఎన్ని గోతులు పడి ఏ ప్రయాణికుడు పడిపోతాడో ... వంటి వాటి మీదే ఉంటున్నదాయె! మరికొన్ని గజాల దూరం తమ గ్రామ వీధిని బాగుచేద్దామనే ధ్యాసేనాయె!

          నిజంగా అలాంటి ఒక సంఘటన ఈ ఉదయం 5.30 కు జరగనే జరిగిపోయింది. 3 రోడ్ల ముఖ్య కూడలి దగ్గర - అవనిగడ్డ రోడ్డు మొదటే - క్రీనీడలో కనపడని అక్కడి పెద్దగుంటలో ఒక ద్విచక్ర వాహనం అంతెత్తున ఎగిరి పడిపోయినంత పనైంది! ఆలోచించగా తరచుగా సదరు గోతులకు కారణం కూల్ డ్రింకు దుకాణస్తులు రాత్రి వేళ దిమ్మరించే వ్యర్ధ ద్రవాలే అని బోధపడింది. మరి కార్యకర్తలు నిరంతరం పాటుబడే గ్రామ మెరుగుదల చర్యలు ఫలించకపోతున్న ఈ దురదృష్టకర సంగతుల్ని ఎవరికి చెప్పుకోవాలి!

          6.35 తరువాత – DRK గారి సమీక్షకు ముందు - ఎన్నడూ లేనిది ఆలస్యంగా వచ్చిన డాక్టరమ్మ గారు (ఎడమ చేతికి పెద్ద పిండికట్టుతో) కుడిచేత మైకు పట్టి గ్రామ స్వచ్ఛ శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలిచ్చి - నేటి స్వచ్ఛంద కార్యక్రమాన్ని ముగించారు.

          చల్లపల్లి స్వచ్చోద్యమం పట్ల నిబద్ధతను ఋజువు చేస్తూ ఒక సీనియర్ కార్యకర్త – కోడూరు వేంకటేశ్వరరావు చిరకాలంగా తన నెలవారీ చందా అయిన 520/- రూపాయల పారితోషకాన్ని మేనేజింగ్ ట్రస్టీ గారికి సమర్పించడం ముదావహం.    

          రేపటి మన నూతనోత్సాహ పూరిత వీధి శుభ్ర - సౌందర్య సాధన కోసం అదే రహదారిలో కరీముల్లా వస్త్ర దుకాణం దగ్గరే మన కలయిక!

 

          స్వచ్ఛ అడుగు జాడలు

ఉరు దాటి ఎచటెచటో స్వచ్చోద్యమ వీరులు

అది తమ వీథే తమవార్డే తమ ఇల్లే అనుకొందురు

అందుకె ఈ విశ్వనరులు స్వార్థాల కతీతులు

అనుసరించు - అనుష్ఠించు అట్టి అడుగుజాడలు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   05.02.2022.

కోడూరి వేంకటేశ్వర రావు గారి విరాళం