2342* వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

ఇదొక ముఖ్య వీధి సుందరీకరణ దృశ్యం - 2342*

            ఆదివారం – (6.2.22) నాటి వేకువ 4.18 కే మొదలైన ఊరి కాలుష్యం మీద పోరు 6.30 దాక జరుగుతూనే ఉంది! ఆయుద్ధ వీరులు 34 మందైతే - శత్రువులేమో 30 వేల మంది గ్రామస్తుల ఆరోగ్య - ఆహ్లాదాలను నష్టపరచే నానారకాల కశ్మలాలు, దుమ్ము - ధూళి, రోడ్ల గోతులు వగైరా ! నాగాయలంకకు దారి తీసే రహదారే ఈ నాటి యుద్ధరంగం! మరి - విజేతల సంగతి వేరే చెప్పాలా? కాకలు తీరిన చల్లపల్లి స్వచ్చ సైన్యమే ఎప్పటిలాగే విజేత!

            ఈ సైన్యాన్ని గురించీ, చల్లపల్లిని గురించీ కొందరు కలం - గళం యోధులు గతంలోనే పాటలు, పద్యాలు వ్రాశారు - ఇప్పటికీ వ్రాస్తూనే/ పాడుతూనే ఉన్నారు.

            విజయవాడ కవి ఒకాయన ఆకుపచ్చ చల్లపల్లి - అందమైన చల్లపల్లి

            చేయి కలిపి ఒకరికొకరు సేవచేయు చల్లపల్లి.....అని వర్ణిస్తే,

ఒకానొక స్థానిక ఛోటాకవి

            “శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ సాక్ష్యంఅనీ

            ‘స్వచ్చ సంస్కృతికి తొలి ఉదాహరణంఅనీ కొంచెం తొందరపడి

            కాస్త ముందస్తు గానే తన ఊరి మీద పాట కట్టాడు!

            ఘంటశాలకు చెందిన ఒక చల్లపల్లి స్వచ్చ సైనిక/ వాగ్గేయకారుడికైతే -

            “గాంధీజి బ్రతికొస్తే మీ ఊరికొచ్చేను -

            ఘనమైన మీ పోరు చూసి గర్వించేను....అని కూడ అనిపించిందట!

నా వరకైతే - ఈ స్వచ్చ నిస్వార్ధ శ్రమజీవుల 2342* దినాల మొండి ప్రయత్నం ప్రతి వేకువా ఒక నిత్య నూతన శుభోదయ సుందర రమణీయ కావ్యమే!

            వెనకటికి ఒక కళాత్మక సినీ దర్శకుని సూపర్ హిట్ సినిమా (స్వాతిముత్యం) లో

            “సీతా కల్యాణ వైభోగమే!

            వినగ వినగ కమనీయమే - కనగ కనగ రమణీయమే సీతాకల్యాణ ...

అనే ఒక సమ్మోహన గేయం ఉన్నది. నాలాంటి చాల మందికేమో ఎంతో బాధ్యతాయుతమైన సృజనశీలమైన స్వార్ధమే అంటని గ్రామ చైతన్యకారకమైన ఈ చల్లపల్లి స్వచ్చోద్యమమే ఎన్నాళ్ళు - ఎన్నేళ్లు చూసినా తనివి తీరనిది, మరింత సమ్మోహనమైనది!

            దుమ్ము ఊడ్చిన చెత్త తొలగించిన - షాపులన్నిటి ముందు ఇంకా ఇంకా శుభ్ర - సుందరీకరించిన కార్యకర్తల కృషి ఎప్పుడైనా ప్రశంసనీయమే గాని, ఈ ఆదివారం వేకువ నడకుదురు గ్రామానికి చెందిన స్థానిక వస్త్ర దుకాణ ఉద్యోగిని రమణ, తన నాలుగేళ్ల చిన్నారితో సహా శ్రమాదానానికి పాల్పడమూ, 83 ఏళ్ల సీనియర్ వైద్య శస్త్రకారుడు సైతం చీపురు పట్టడమూ విశేష సంగతులు!

            6.50 కి దుస్తుల వ్యాపారి, ధ్యానమండలి ప్రముఖుడూ గోళ్ళ వేంకటరత్నం ముమ్మారు ప్రస్తావించిన గ్రామ స్వచ్చ - పరిశుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలు కాక దాసరి రామకృష్ణ ప్రసాదు గారి జనవరి నెల జమా ఖర్చుల వివరణ కూడ జరిగింది. (కాని, దుమ్ము రోడ్ల, మురుగు కాల్వల మట్టి సేకరణ, వాటి వినియోగాల అకౌంట్ కూడ వివరించడం అవసరమా అని!)

            బుధవారం వేకువ మన గ్రామ వీధుల మెరుగుదల కోసం కలువవలసిన చోటు విజయవాడ రహదారి మొదటిలో అని నిశ్చితమయింది!

            ఈ ధన్యులె మాన్యులు

మహాదర్శ జీవితాల మర్మాలు గ్రహించినారు

జీవన సాఫల్యాలను చెలగి ఋజువు చేసినారు

మాతృ గ్రామ స్వస్తతలను మంచి స్థితికి చేర్చినారు

అనుసరించి -  అనుష్టించి - అందరమూ గెలుద్దాం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   06.02.2022.