2343* వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

2343* వ రోజున గ్రామ భద్రతా దళం చర్యలు.

            చల్లపల్లి గ్రామ స్వచ్చోద్యమంలో సోమ, మంగళ వారాల్లో రెస్క్యూటీమ్ వారి పరిచర్యలు ఒక రివాజుగా మారినవి! ఈ వేకువ 4.30 కే వీరు ఊరికి 2 ½ కి.మీ ఉత్తరాన గల శ్మశానం సరిహద్దులోని డంపింగ్ కేంద్రానికి హాజరయ్యారు. ఎవరికీ ఏ మాత్రం పనికిరానివని రోడ్ల మీద వదిలేసిన రాతి ముక్కల, తారు పెచ్చుల గుట్ట ఒకటి - వీళ్ళేసేకరించి, నిలవచేసిన ఒక గుట్ట నుండి ట్రక్కులోనికి ఎక్కించి కొన్ని రాళ్లతో, మట్టితో ఊరిలో రెండు చోట్ల భద్రతా కృషిని చేపట్టారు.

            అంతకు ముందు వాడుకలోకి వచ్చిన ఒక వాక్యం – “చెత్తనుండి సంపద తయారీ!మరి ఈ రెస్క్యూ టీమ్ వాళ్ల స్లోగన్ మాత్రం – “వ్యర్ధాల నుండి గ్రామ భద్రత!ఇందుకు వీళ్లదొక ముందస్తు ప్రణాళిక! ఒక ప్రక్క వీధుల్లోని వివిధ వ్యర్ధాల తొలగింపు గానూ మరో వంక అదే వ్యర్ధాలతో రోడ్ల గుంటలు పూడ్చే మురుగు కాల్వ అంచుల మరమ్మత్తులు చేసే ఒక ద్విముఖ ప్రయోజనకరమన్న మాట!

            ప్రస్తుతం ఈ భద్రతా సంఘ సభ్యుల దృష్టికి కమ్యూనిస్టు వీధిలోనూ గంగులవారిపాలెం బాటలోని సన్ ఫ్లవర్ కాలనీ దారి మొదట్లోనూ సమస్యల్ని ఈ వేకువ వీళ్లు పరిష్కరించారు.

            ఎంత విలువైనది ఆ సిమెంటు రోడ్డు! మురుగు కాల్వ అంచుకు విరిగిపడే ప్రమాదాన్ని పసిగట్టి వీళ్లు గంటపాటు శ్రమించడమా, సదరు రోడ్డుకు కొంత బలం చేకూర్చడమూ అభినందనీయం కదా!

 

      వికసించిన ఒక త్యాగం.

ఒక త్యాగం వికసిస్తే ఉన్న ఊరి ఉద్దీపన

శ్రమదానం కలిసొస్తే సకల గ్రామ ప్రక్షాళన

గ్రామ పౌర సామూహిక సద్వర్తన సంభవించి

అంతటనూ పరిసరాల కాలుష్యపు ఆందోళన!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   07.02.2022.