2344* వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

 

                            2344*వ నాటి గ్రామ వీధుల ఆవశ్యక చర్యలు.

 

ఈ మంగళ వారం (08.02.2022) వేకువ సైతం ఊరి భద్రతా దళం తన పనిని 4.30 కే మొదలు పెట్టింది. ఈ  నలుగురికి తోడు ఒక మహిళా కార్యకర్త, ట్రస్టు ఉద్యోగి ఒకాయన, శంకర శాస్త్రి నామధేయుడైన మరొక ఔత్సాహికుడు, (ఈ శాస్త్రి గారు గత నాలుగు నెలలుగా-తన కత్యంత ప్రీతి పాత్రమైన చల్లపల్లి గ్రామానికి, మిత్ర-సోదర స్వచ్చ కార్యకర్తలకు దూరంగా ఉండగలగడమే పెద్ద వింత! ఆయన నిగ్రహానికి గాను తప్పక సన్మానించాలి!)

 

ఈనాటి రెస్క్యూ దళం వారి రోడ్ల భద్రతా కృషి రెండు వీధుల్లో జరిగింది!  బైపాస్  మార్గం బందరు రహదార్లను కలిపే ఒక సన్నని కురచైన యడ్ల వారి వీధిలోని వ్యర్ధాల గుట్ట ఈ కార్యకర్తల కంటబడినట్లున్నది-దాన్ని ట్రక్కుల్లో నింపుకొని, ముందుగా  వీధి చివర గల చిన్న గుంటల్ని పూడ్చి, మిగిలిన రద్దును 2 కి.మీ. దూరంలోని గంగులవారిపాలెం దారిలో-బండ్రేవు కోడు మురుగు కాల్వ వంతెన దగ్గర రోడ్డు పటిష్టత కోసం సర్ది, తమకెవరో పెట్టిన నిక్ నేమ్ (రెస్క్యూ టీమ్)ను సార్థకం చేశారు!

 

చల్లపల్లి స్వచ్చంద శ్రమదాతల్ని, అందులోని రెస్క్యూ దళాన్ని చూస్తుంటే  నాకేమనిస్తుందంటే అప్పుడెప్పుడో ప్రేమ నగర్ సినిమా కోసం ఆత్రేయ అలతి పదాలతో వ్రాసి ఘంటశాల అజరామరంగా పాడిన మనసు గతి ఇంతే- మనిషి బ్రతుకింతే.... అనే పాట గుర్తుకు వచ్చి-చల్లపల్లి రోడ్ల గతి ఇంతే- ప్రజల సహకారమూ ఇంతే-ఎన్నేళ్లు గడిచినా ఊరిని చక్కదిద్దాలనే కొందరు కార్యకర్తల మొండి ప్రయత్నమూ అంతే..!అని.  స్వచ్చ సైనికులు రోజూ 2 గంటలు శ్రమించి,గ్రామ శుభ్ర-శౌచ-సౌందర్యాలకు మెరుగులు దిద్దే పనే తమ మహద్భాగ్యంగా పరిగణించడం- అది వేరే విషయం ! అది వాళ్ళ ప్రారబ్దం ఇదేమో గ్రామస్తుల అదృష్టం!

 

6.35 కు తామనుకొన్నది సాధించాక-ప్రాతూరి శాస్త్రి గారు ముమ్మార్లు ఉద్ఘోషించిన గ్రామాభ్యుదయకర నినాదాల్ని పునరుద్ఘాటించిన కార్యకర్తలు సంతృప్తిగా గృహోన్ముఖులయ్యారు.

 

రేపటి వేకువ మన శ్రమదానం కోసం సెంటర్లో మూడు రోడ్ల జంక్షన్లో  పునర్దర్శనం!

 

 

        గర్వపడుచు జై కొట్టుము  

గర్వ పడుము చల్లపల్లి కార్యకర్త సేవలకై

జై కొట్టుము ఈ వేకువ శ్రమ విరాళ సంస్కృతికే

సిగ్గు పడుము ఇన్నేళ్లుగ చేయనందుకా కార్యం

అందించుము ఇంటింటికి స్వచ్చోద్యమ సందేశం!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

  ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

  08.02.2022.