2345* వ రోజు.......

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

ఒక మాంత్రిక (మాజిక్) సంఖ్య – 2-3-4-5* వ నాటి స్వచ్చోద్యమ లీలలు!

          బుధవారం(9-2-22) నాటిది సంఖ్యాపరంగా నిజంగా ఒక విశేషమే! తక్కిన సంగతులట్లా ఉంచి, కొందరు స్వచ్ఛ కార్యకర్తలను ఇది దాతృత్వ దాడికి పురికొల్పింది మరి! ఈ వేకువ 4.19 నుండి 6.29 దాక – 2 గంటల 10 నిముషాలు దుమ్ములో - ధూళిలో, రహదార్ల గోతుల్లో ఆంధ్ర బ్యాంక్ పాత భవనం దగ్గరి ఉచ్చల్లో  ఊరి శుభ్రత కోసం, తోటి గ్రామస్తుల ఆహ్లాదకర సౌమనస్యత కోసం కష్టించడమొక ఎత్తు; పని దినాల సంఖ్యా విశేషపు వంకతో మనకోసం మనంట్రస్టుకు తమ తమ కష్టార్జితపు పొదుపు నుండి ఇంత మొత్తాలను సమర్పించడం మరొక ఎత్తు!

          గ్రామస్తుల్లో ఇన్ని వేల మందికి పట్టని సమయ, శ్రమ, ఆర్థిక దాతృత్వాలు ఊరుమ్మడి ప్రయోజనం కోసం అవలీలగా - 2345* రోజుల పాటు నిలకడగా ప్రకటించడం ఈ చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలకే చెల్లింది! ఈనాటి అట్టి ఆదర్ములెవరెంటే: 

1. ప్రాతూరి శంకర శాస్త్రి : షరామామూలుగా రూ 5000/-, పని దినాల సంఖ్యాపరంగా రూ 2345/- (రెండోదాంట్లో గంధం బృందావనుడు కూడ ఉన్నాడు)

2. Dr. మాలెంపాటి గోపాలకృష్ణయ్య : రూ 2-3-4-5/-

3. సజ్జా ప్రసాదు : రూ 2-3-4-5/-

          ఈ నాటి స్వచ్ఛ కార్యకర్తల సమయ దానం అందరిదీ కలిపి = 26 X 2.30 గంటలు = 69.

          గ్రహించగలిగితే - వీళ్ళు స్వగ్రామస్తులకు పంచిన సామాజిక స్ఫూర్తి : ????

ఇక వీళ్ల కార్య రంగస్థలం మూడు రోడ్ల కూడలికి కాస్త దక్షిణం గాను, 50 గజాల తూర్పు గాను, పడమరగా అగ్రహారం దాకానూ ! ఏ కార్యకర్త ఏం సాధించాడో చెప్పాలంటే మాత్రం - ప్రతి ఒక్కరికీ ఒక పుటను కేటాయించాలి!

          ఇందరు కార్యకర్తలకు 2-3-4-5* దినాలుగా ముఖ్య వీధుల పారిశుద్ధ్యం మన గ్రామం చూపిస్తున్నదంటే - అది చల్లపల్లి గొప్పతనం! 15 మంది శ్రమదాతలకు చేతి నిండా గుంటలు పూడ్చే బాధ్యత చూపిస్తున్న ప్రభుత్వానిదొక ప్రత్యేకతే! వందలాది వాహనదారులూ, పాదచారులూ ఈ గ్రామ ముఖ్య వీధుల్లో వస్తూ పోతూ ఎవరికైనా కృతజ్ఞత చెప్పుకోవాలనిపిస్తే అది ఈ నిరంతర శ్రమ త్యాగమూర్తులకే!

          వందలాది దుకాణదారులకు, మెకానిక్కులకు, చిన్న బళ్ళ వ్యాపారులకు,... పట్టని  ఊరి వీధి శౌచ సౌందర్యాలు ఈ కొద్ది మంది స్వచ్ఛ కార్యకర్తల వంతెనా! ఈ మహిళ లెందుకు వేకువనే, రోడ్లు ఊడవాలో, ప్రస్తుత/ మాజీ ఉద్యోగులూ గౌరవ వృత్తుల వారూ, రైతులూ, గృహిణులూ గ్రామ వీధుల పరిశుభ్రతకూ, రహదార్ల పచ్చదనాలకీ, శ్మశాన సౌకర్యాలకూ శ్రమిస్తారో ఇప్పటి దాక పట్టించుకోని సోదర గ్రామస్తులు తప్పక ఆలోచించాలని మనవి!

          ఈ నాటి కార్యకర్తల దాతృత్వం అకౌంట్ కాక, దుమ్ము - ధూళి అకౌంట్ - ఒక ట్రక్కు! 6.50 కి సమీక్షా సమావేశం సమయంలో ఊరి శుభ్ర స్వచ్ఛ సౌందర్య సౌభాగ్య సంకల్ప నినాదాలిచ్చింది మాత్రం పెద్దగా ఒళ్ళు వంచని ఒక విశ్రాంత ఉద్యోగి!

          రేపటి మన ఊరి మెరుగుదల కృషి కోసం మనం వేకువనే కలుసుకోవలసింది మాత్రం విజయవాడ రోడ్డులోని అగ్రహారం ప్రధాన రహదారి దగ్గరే!

 

          స్వచ్చోద్యమ పురిటిగడ్డ

ఉద్యమాల జీవగడ్డ స్వచ్చోద్యమ చల్లపల్లి

మంచికొ చెడుకో జనులను మళ్లించెను కొంత - కొంత

ఇది నవీన స్వచ్చోద్యమ మెంతెంతో ఆదర్శం!

అనుసరించి అనుష్ఠించు ఆమహోన్నతాశయం!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   09.02.2022.