2346* వ రోజు....

 ఒక్కసారికే పనికొచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులైనా ఎందుకు వాడాలి?

మ్యాజిక్ సంఖ్యానంతర స్వచ్ఛంద గ్రామ వికాస కృషి - @2346*

          గురువారం (10.02.2022) నాటి వేకువ 2 గంటలకు పైగా - 21 మంది గ్రామ స్వచ్ఛతా విధేయుల వీధి పారిశుద్ధ్యం ఒక పెద్దాయన మాటల్లో నభూతో నభవిష్యతి!నా లెక్క ప్రకారమైతే అబ్బో! వీళ్లెన్ని వందల మార్లు - ఎన్ని మురుగ్గుంటల్లో, వీధి పాయి ఖానాల్లో, శ్మశానాల్లో - చీకటి వెలుగుల్లో నిర్వికారంగాను, నిశ్చలంగాను పనిచేయలేదు?

          ఒక్కసారి తలకాయల్లోని స్వార్ధాన్ని త్యజించాక, తాము డాక్టర్లమనో - ఉన్నతోద్యోగులమనో కుటుంబాల కంకితమైన నాలుగ్గోడల నడుమ గృహిణులమనో...పెద్ద రైతులమనో....ఆభిజాత్యపుటాలోచనలు వదులు కొన్నాక, కనీసం రోజుకు రెండు గంటల పాటు తమ గ్రామ సమాజ బాధ్యతలకెప్పుడైతే అంకితులై పోయారో, అప్పుడిక వాళ్లు కేవలం స్వచ్ఛ కార్తలుగా మారారు!

          అలా కాకపోతే - ఈ వేకువ ఒక వృద్ధ (83) వైద్యుడు లెక్కనేనన్ని తన శారీరక అస్వస్తతల్నీ, అసౌకర్యాలనీ ప్రక్కన బెట్టి, అగ్రహారం ప్రక్కనున్న విజయవాడ దారి ప్రక్కన చీపురు పట్టి - మధ్యలో కూర్చొంటూ లేస్తూ ఊడ్వడమేమిటి? (ఈయన నిన్ననే స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రయోజనార్థం 2345/- విరాళం ఇచ్చి ఉన్నాడు!)

          అడుగో - 2500 కిలోమీటర్లు ప్రయాణించి - అమెరికా నుండి వచ్చిన పెద్ద ఇంజనీరు గంటన్నర పాటు గోకుడు పారతో రోడ్ల దుమ్ము దులిపి, తరువాత చెత్త ట్రక్కులో కెక్కి ఒళ్లంతా దుమ్ము కొట్టుకుంటు తన పుట్టి పెరిగిన ఊరి మేలుకు కృషి చేస్తున్నాడు! (ఇతగాడి నిరంతర ప్రయత్నం వల్లనే ఈ మారు మూల చల్లపల్లికి ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు! U.N.O. బాధ్యుల ద్వారా ఈయన ఉడుం పట్టుతో తన ఊరికి ఏ మంచో చేయాలని ఇతని ఎడతెగని తపన!

- అనివార్య ఆరోగ్య అసౌకర్యంతో మన స్వచ్చోద్యమ సారధి 4.30 కే ఇంటికి తిరిగి వెళ్ళిపోగా, ఒక గృహిణి చేయగల్గినంత వీధి పారిశుద్ధ్యం చేసి, తొందరగా అరగంట ముందే ఇంటిదారి పట్టింది!

- ఆంధ్రా బ్యాంకు పాత భవనం దగ్గర ఏ ట్రాక్టర్‌ గుద్దుడుకో పడిపోతున్న RTC వారి ప్రయాణ సూచికా ఫలకాన్ని సరిజేసి, నిలబెట్టిన రెస్క్యూటీమ్ వాళ్లెంత చెమట చిందించారో ప్రత్యక్షంగా చూశాను!

 

- చివరి 25 నిముషాల - 10 మంది లోడింగ్ బ్యాచ్ పని వేగం, చాకచక్యం, సమన్వయం ఎవరైనా చూసి తీరాల్సిందే!

          ఇక ఉదయ శంకర శాస్త్రి గారి సంగతి ఈ ఊళ్ళో తెలియని వాళ్లు తక్కువ! కార్యకర్తల్నెలా ఉత్సాహ పరచాలో ఏ వంకతో ఎప్పుడు విరాళాలివ్వాలో బిస్కట్ లో, కేకులో, పప్పుండలో.... ఏ తినుబండారాలెప్పుడు పంచాలో - ఆతనిది భలే సమయస్పూర్తి!

          [వాట్సప్, ముఖ పుస్తక పాఠక మిత్రులకొక హామీ ఏమంటే నేను రోజూ వ్రాసే కథనాల్లో - కార్యకర్తల సేవా విన్యాసాల వివరణలో ఎప్పుడైనా - ఏ కొంచెమో ఉంటే ఉండొచ్చు గాని, పనిగట్టుకొని అతిశయోక్తులుండవని!]

          అమెరికా దేశంలో, ఐక్యరాజ్యసమితిలో మన చల్లపల్లి స్వచ్చోద్యమ రాయబారి, కమ్యూనిస్టు వీధి నివాసి, 30 ఏళ్ల అమెరికా ప్రవాసంలో కూడ పుట్టిన ఊరిని మరవనే మరవని (పాతకాలపు లక్షణం ఉన్న) నాదెళ్ల సురేష్ మూడు మార్లు తన సొంత ఊరి స్వచ్ఛ - స్వస్త శుభ్ర సౌందర్య నినాదాలు పలికి నేటి శ్రమదానాన్ని ముగించడం విశేషం!

          రేపటి మన విజయవాడ వీధి మెరుగుదల కోసం మనం కలువదగిన చోటు - అగ్రహారం తొలి వీధి ప్రారంభంలోనే!

 

కళల కోసం కళలు కాదట స్వచ్ఛ సంస్కృతి దోహదములట!

కళాకృతుల సమగ్రతలతో గ్రామ వీధుల గోడలెన్నో

వర్ణ రంజిత చిత్రమాలతొ - భావగర్భ నినాదములతో

చల్లపల్లి స్వచ్ఛ సంస్కృతి చాటి చెప్పుచు మేలు కొలుపుచు

స్వచ్ఛ - సుందర కళాకారుల పరిణతిని ప్రకటించుచున్నవి!

         

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   10.02.2022.