2347* వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

స్వగ్రామం కోసం ఇదొక నిరంతర - నిర్విఘ్న శ్రమదానం - @2347*

            ఔను - ఇది శుక్రవారం - (11-2-22) 4:17 వేకువ సమయం! 2 గంటలకు పైగా - 21 మంది గ్రామ సామాజిక చైతన్యకారుల వీధి శుభ్రతా ప్రయత్నం! వేలాది రోజుల్లాగా ఇది ఫలప్రదం - అటు ఊరి స్వస్తత దృష్ట్యా శ్రేయోదాయకం - ఇటు తమ ఈ నాటి కర్తవ్య పరిపూర్తి చేసిన స్వచ్చ సైనికులకు సంతృప్తిదాయకం! విజయవాడ రహదారిలో శివాలయం దాక సుమారు మరొక 100 గజాల అన్ని రకాల కశ్మలాలకు 20 మంది పాడిన మంగళం! (ఇంతటి శుభ సంకల్పం చూస్తున్న - చేస్తున్న నావంటి భావుకుల హృదయాలు కవితాత్మకం!)

            అందుకే నాకు ఎన్నడూ కనిపించని దేవాధి దేవునికి ఇది పదే పదే నా విన్నపం!

            హే ప్రభూ! ఇంకా ఎన్నేళ్లకు నా ఊరి రహదార్ల గుంటలకు మోక్షం?

            ఎప్పటికి ఈ వీధి శుభ్రతలకు, రోడ్ల భద్రతలకు నా గ్రామస్తుల, అధికార్ల కటాక్షం?

            ఇంకెన్ని దశాబ్దాలు ఈ సమాంతర విరుద్ధ గ్రామ సంస్కృతీ సంప్రదాయం?

            గ్రామ ప్రముఖుల్నుండి, ఆలోచనా పరుల్నుండైతే వస్తున్నది గాని ఆర్దిక - హార్దిక సహకారం,        

            ఇప్పుడు కావలసింది మాత్రం విజ్ఞ సోదర గ్రామస్తుల శ్రమదాన భాగస్వామ్యం!

            సర్వజ్ఞుడైన దేవ దేవుని కిదే నా సంప్రార్ధనం!....

            చల్లపల్లి ప్రధాన వీధిలో అందరివీ కలిపి 40 కి పైగా పనిగంటల శ్రమదానం! కోట మలుపులో -  తారు పెచ్చులూడి పోయిన రోడ్డు మీద - శివాలయం దాక ఇందరి సముచిత శ్రమదానం. ఆ వంద గజాల్లోనే మెకానిక్కుల షెడ్లు, చిరు దుకాణాలు, టీ కొట్లు, భోజనశాలలు, తోపుడు బళ్లు వగైరాలు. అసంఖ్యాకంగా రకరకాల వాహనాల రాకపోకలు! అక్కడే ఈ శ్రమదాతల చీపుళ్ల ఊడుపు శబ్దాలు, పారల గోకుడు చప్పుళ్లు, ట్రాక్టర్ లోకి బోలెడంత దుమ్ము - ధూళి కంకర పెచ్చుల నింపుళ్లు!

 

            ఇవాళటి శ్రమదాన సందడి చూస్తుంటే - ఇది వృద్ధుల స్పెషల్ అనిపించింది. 84-83 ఏళ్ల, 74-75 ఏళ్ల వృద్ధులు ఈ చీకటి చలి వేకువ వేళ వీధి శుభ్రతకు పూనుకోవడం ఒక విధంగా నిబిడాశ్చర్యకరం! అంతేగాక - నేటి శ్రమదానం NRC (నాన్ రెసిడెంట్ చల్లపల్లీస్) ప్రత్యేకం కూడ! కనీసం ఇద్దరు ఔత్సాహికులు అమెరికా నుండీ, కన్నడ దేశం నుండి పాల్గొన్నారు మరి! ఇందులో ఒకరు చెత్తబండి లోడింగులో ఉంటే, 84 ఏళ్ల స్వచ్చ వృద్ధ బాలుడేమో ఈ శ్రమదానం పట్ల పరమానంద భరితుడు!

            మహిళలు శక్తిని కేంద్రీకరించి ఉడ్చాక మూత్ర విసర్జిత జాగాలో వ్యర్ధాలను ఏరి, ముళ్ల మొక్కల్ని నరికి శుభ్రపరిచాక - నేటి వ్యర్థాలను ట్రక్కులోకి ఎక్కించాక 100 గజాల వీధిని సంతృప్తికరంగా మెరుగు పరిచాక - 10 నిముషాల కాఫీ - సరదా కబుర్లు గడిచాక - అమెరికా చాక్లెట్లను నాదెళ్ల సురేష్ గారు పంచాక

            6.45 కు ఒక కర్ణాట కాంధ్రుడు - వేమూరి అర్జునుడు - నూతనోత్సాహంతో గ్రామ పరిశుభ్ర - స్వచ్ఛ - సౌందర్య సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించాకనే కార్యకర్తలు ఇంటి దారి పట్టారు.

            రేపటి ఆవశ్యక శ్రమదానం కోసం మనం చేరుకొని, కలుసుకొని, ప్రయత్నించవలసిన ప్రదేశం శివాలయం దగ్గరే!

 

            సంకుచితత్త్వం జిందాబాద్!

నేను నాదే నాకె సర్వం - 'మనం' అన్నదె మరచి పోదాం

భవితలెందుకు - నవతలెందుకు? పాత రోతతో బ్రతుకుతుందాం

ఆరేడు ఏళ్ళుగ చల్లపల్లిలొ స్వచ్ఛ సైన్యం పట్టనట్లే

ఎవరి స్వార్థం వాళ్లు చూస్తూ గ్రామ స్వస్తత మరచిపోదాం !

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   11.02.2022.