2348* వ రోజు....

  

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

 

అలవాటైన అభ్యాసం -2348* వ నాటి శ్రమదానం.

 

          ఈ శనివారపు వేకువ(12.2.2022) ఠంచను గా 4.15 కే విజయవాడ మార్గం  లోని శివాలయం దగ్గరకు చేరుకున్న వారూ, నిముషాల క్రమంలో వచ్చి కలిసిన వారూ- వెరసి 26 మంది స్వచ్చంద శ్రమ దాతలు ! ప్రధాన, ఉప మార్గాలలో విస్తరించిన వాళ్ల పారిశుద్ధ్య కృషి 100 గజాల పరిధిలోనూ, 2 గం.15 నిముషాల వ్యవధి లోనూ! ఒక వేళ గ్రహీత లెవరైనా ఉంటే- వీళ్ళు పంచిన సామాజిక స్ఫూర్తి అనంతం-నిత్య నూతనం!

 

          తొలుత ప్రస్తావించ దగిన శ్రమదానం ఐదారుగురు రెస్క్యూ టీం వాళ్ళది! ఎందుకంటే వాళ్లు పూనుకునేది మొండి పనికి- బండ చాకిరికి-ఇంకా చెప్పాలంటే కొంత ఛండాలపు కృషికి! వీళ్లలో ఒక మరీ వినయ వినమిత గృహిణి కూడానూ!  డ్రైను మీది బరువు రాళ్లను ప్రక్కకు లాగి, గుప్పున కొడుతున్న మురుగు కంపులో నానా చెత్తల్ని బైటకు లాగి, సిల్టు ను తోడి పోగులు పెట్టే పని ప్రస్తుత కాలంలో గౌరవ వ్యాపకమా?

 

          శివాలయం దాటి 50- 60 గజాల బాట నొకమారు ఊడ్చి, అంతకు ముందే సిమెంటు కొట్టు వైపు, శ్రీమంతు క్లబ్బు ముందు నాలుగైదంగుళాల మందాన ఉన్న దుమ్ము-ధూళి-ఇసుక, నడుమ కొన్ని పిచ్చి-ముళ్ల మొక్కల్ని పెకలిస్తూ, ట్రక్కుకు సరిపడా డిప్పల్ని మోసి నింపడమంటే మాటలా? పోగు చేసి ఎత్తింది 10-12 మందైతే- డిప్పలు ఎత్తి, మోసి, ట్రక్కులోకి చేర్చింది ఇద్దరే!

 

          ముగ్గురు మహిళలు 2 గంటల పాటు ఎగుడు దిగుడుల రెండు రోడ్లనూ ఊడుస్తూనే ఉన్నారు. పూజారినని చెప్పుకొన్న ఒకాయన ఊడ్చిన తర్వాత త్రాగిన టీ కప్పును అక్కడ పడేశారు! చెరుకు బళ్ళ వారూ, ఇతర ప్రయాణికులూ ఆగి, వాడిన టీ/కాఫీ కప్పుల్ని అంగడి ముందున్న డబ్బాలో వేయడం ఏం కష్టమో తెలియదు!

 

          ఇంతటి కఠిన శ్రమదనాన్ని చూస్తూ పని మధ్యలోనూ, సమీక్షా సమయంలోనూ ఆశ్చర్యానందాలు వ్యక్త పరచి, ఎవరెవరి గూళ్లు ఎంత నొప్పెట్టాయో అని డాక్టరు డి.ఆర్.కే గారు తరచూ సందేహిస్తుంటారు గాని, ఇన్ని వేల రోజుల- ఇన్ని లక్షల పని గంటల శ్రమదాతలు మాత్రం అలా అనుకోవడం నేను గమనించలేదు. ఈ పాటి సామాజిక సేవ తమ కనీస బాధ్యత అనుకొన్నప్పుడు చూసే వాళ్ళకే గాని, చేసే వాళ్లకది  బరువు పననో, మొరటు కార్యమనో, పరువు తక్కువనో అనిపించదనుకొంటా!

 

          సరే ఏదైతేనేం- 27 వేల మంది పౌరుల్లో కనీసం 26 మందైనా ఈ వేకువ సమయాన-మంచు దట్టంగా కురుస్తున్నా, మాస్కులు దాటుకొని ధూళి ముక్కుల్లోకి చొరబడుతున్నా-వీధి దీపాలక్కడ వెలగక చీకటైనా-తామనుకొన్నది సాధించారు గదా!

 

          మరి ఈ కార్యకర్తల్లో అమెరికా ప్రవాసి నాదెళ్ల సురేష్, కన్నడ ప్రవాసి 84 ఏళ్ల వేమూరి అర్జునరావు, నిమ్మకూరు మూలాలు గల అన్నే చంద్రశేఖర శ్రీనివాస్ లూ ఉన్నారు.

 

          6.50 కి దైనందిన సమీక్షా సన్నివేశంలో గ్రామ మెరుగుదల దీక్షా నినాదాలిచ్చినదీ, మాలెంపాటి గోపాల కృష్ణయ్య గారితో బాటు చెరి 2000/- విరాళం మేనేజింగ్ ట్రస్టీ కి అందించినదీ వేమూరి అర్జున రావు గారు!

 

          రేపటి  వేకువ ఈ స్వచ్చంద శ్రమదాన గమ్యస్థలం కస్తూరి మామ్మగారి గార్డెన్!

 

            ఒక సామూహిక సత్కృతి

ఇది గ్రామపు ఋణ ముక్తత- ఇది బాధ్యత- పరిపూర్ణత

ఏ దేశపు- ఏ కాలపు ప్రజలకైన ఆదర్శత

ఇదె జాగృతి- నిరహంకృతి- ఇది సామూహిక సత్కృతి

చల్లపల్లి జనులందరు సాహసింప దగు సంస్కృతి! 

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   12.02.2022.