2350* వ రోజు....

  

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

 

ఊరి శౌచ-సౌందర్య సంకల్పంతో - 2350* దినాలు!

 

          ఆదివారం (13.02.2022)నాటి ప్రధాన వీధి శౌచం మరీ 4.15 కే ప్రారంభమై, 36 మంది పిన్నల –మహిళల –వర్షీయసుల సమష్టి సమన్వయ కృషితో 6.27 వరకూ కొనసాగి, 7.00 సమయంలో గాని వారు ఇళ్లు చేరలేదు! చలి గాలుల మధ్య, వాహన రద్దీ ల నడుమ-ఇందరికి పని కల్పించిన చోటు శ్రీమంతు క్లబ్బు నుండి బైపాస్ మార్గం దాక సుమారు 130-140 గజాల విజయవాడ రహదారి!

 

          భావుకులకు ఉద్వేగ పరమైన, తరచి తరచి లోతైన సామాజిక పరిశీలన చేయగల వాళ్లకు ఆసక్తికరమైన ఈ చల్లపల్లి స్వచ్చోద్యమం మా వంటి కొందరికైతే తరగని అభిమాన పాత్రం! ఒక కోణం నుండి  చూస్తే ఇది చారిత్రక చల్లపల్లి గ్రామానికి అనివార్యం – అనుసరణీయం-రాష్ట్రానికి గర్వకారణమే గాని, దురదృష్ట వశాత్తు కొంతమేర అనాదృతం!

 

          ఇప్పటి సామాజిక యువతరం పోకడలతో-అనవసర వస్తు వినిమయ సంస్కృతితో- అడుగంటుతున్న సామాజిక స్పృహతో-ఇంత పెద్ద గ్రామ పారిశుద్ధ్యం-పచ్చదనం-సౌందర్య నిర్వహణం అచ్చంగా పంచాయతీ వల్ల అయ్యే పనా? ఊరూరా చల్లపల్లి లాగ శ్రమదాన సంప్రదాయం రాకుంటే- ఒక సామూహిక జన స్వస్తత సాధ్యమౌతుందా?

 

          గతంలో 30 కి పైగా ఊళ్లలో వేకువ శ్రమదాన ప్రతి ధ్వనులు వినిపించినా- ప్రభుత్వాలు పట్టించుకోక-  కాల క్రమేణా అవి చల్లారినట్లున్నవి! 8 ఏళ్ల నుండి క్రమం తప్పక ఈ గ్రామంలో మాత్రం 40 మందితోనో-30 మందితోనో అది సరైన దిశలో నడుస్తూనే ఉన్నది! ఎందుకంటే-

 

          దీన్ని వెలిగించడానికి ఈ రోజు కూడ అమెరికా నుండి ఇద్దరు ప్రవాసులు వచ్చి పాల్గొన్నారు. పొరుగూరు నుండి రోజూ వేకువ వచ్చే రైతులున్నారు!  ఏ ఒక్క రోజైనా రావడం కుదరనప్పుడు- ఆ రోజంతా వెలితిగా దిగులు పడే చాలామంది కార్యకర్తలున్నారు.

 

          బెజవాడ నుండి వచ్చి- ఇక్కడే తిష్ట వేసుకొన్నవారు, తెలంగాణ- కర్ణాటకల్నుండి వచ్చి, పాల్గొని, ఖర్చులకు చందా లిచ్చేవారు ఉంటే ఈ గ్రామ  ఉద్యమానికి లోటేమిటి?

 

          ఏలూరు వ్యక్తీ , అమెరికా ప్రవాసీ, చల్లపల్లి తో ఏ నిమిత్తమూ లేని  అలాంటి ఒకరు కొమ్మన శివరాం గారు  మన స్వచ్చోద్యమ శ్రేయస్సు  కోరి  7500/-(100 డాలర్లు ) ఈ ఉదయం  నాదెళ్ల సురేష్ ద్వారా విరాళం పంపారు! న్యాయంగా ఐతే చల్లపల్లి గ్రామమంతా కృతజ్ఞతలు చెప్పుకోవాలి!కానీ....?

 

          ఈనాటి శ్రమదాన విశేషాలకేం ! చాలా ఉన్నవి-120 గజాల రహదారి నుండే 30 మందికి పైగా శ్రామికులు-ట్రక్కు నిండా దుమ్ము-ఇసుక-మట్టి-గులకరాళ్ళు- పుల్లా-పుడకా-మరికొన్ని దరిద్రాలనూ ఊడ్చేవాళ్లు ఊడ్చి, డిప్పల కెత్తే వాళ్ళు ఎత్తి, ఒకానొక NRI ట్రక్కులో నిలబడి, దాన్ని నింపి, సర్ది, కొందరు కూరల దుర్గంధ వ్యర్థాలను డిప్పల్లో కెత్తి, మురుగు కాల్వ గట్ల పిచ్చి మొక్కల్ని తొలగించి, చికెన్ దుకాణాల వ్యర్థాలను ఏరి... ఇదొక అంతం లేని చాంతాడు! 2350 * రోజుల అప్రతిహిత సుదీర్ఘ స్వచ్చంద శ్రమదాన ధారావాహిక!

 

          6.50 సమయాన- ఈనాటి ఊరి శుభ్ర-స్వచ్చ-సౌందర్య ప్రణాళికా నినాదాలను గర్జించినదీ- ఎవరెవరో పెద్దల అనుభవ సారాల్ని వివరించినదీ అడపా గురవయ్య గారు! తన ఊరి, పొరుగూళ్ల జన సౌఖ్యమే శ్వాసించే- ఎక్కడున్నా అదే లోకంగా గడిపే మండవ శేషగిరి రావు గారి రకరకాల భావి ప్రయోజనకర ప్రణాళికల్ని వివరంగా విన్నదేమో-35 మంది కర్తవ్య నిష్టులు!

 

          ఇక బుధవారం నాటి వేకువ బాధ్యతల కోసం మనం కలిసి సాగదగిన చోటు బికనీర్ భవనం దగ్గరే!

 

              పవిత్ర అనుష్ఠానంగా

ఈ శ్రమదాతల స్వప్నం నీ గ్రామపు ఆరోగ్యం

ఈ స్వచ్చోద్యమ యజ్ఞం సకలజన హితార్థం

ఎందుకు మరి అలసత్వం వీరితొ కలిసేందుకు?

అనుసరించి అనుష్ఠించు ఆ కఠోర కర్తవ్యం

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   13.02.2022.