2351* వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

ఒక రహదారి పటిష్టత కోసం రోడ్డు భద్రతా చర్యలు - 2351*

సోమవారం (14-2-22) వేకువనే మళ్ళీ చల్లపల్లి రెస్యూటీమ్ 4.30 కు మొదలయింది. నేను కాక ఆరుగురు! గంగులవారిపాలెం వీధి చివర వంతెన దగ్గర - చప్పుడు లేకుండా దుమ్ము మాత్రం లేచి, క్రమ్ముతుంటే ఏమిటో సంగతని పాదచారులు గమనిస్తుంటే - ఆ బండ్రేవుకోడు మురుగు కాల్వ వైపున పనిచేస్తూ కనిపించారు!

          నిన్నటి వేకువ విజయవాడ మార్గంలో 35 మంది శ్రమించి, చక్కగా తీర్చిదిద్దిన చోట - స్వచ్ఛ కార్యకర్తలకు దొరికిన నిధి - ట్రక్కు నిండా సేకరించిన సిమెంటు ధూళి + ఇసుక + దుమ్ము + చిప్స్ మిశ్రమాన్ని ఈ రెస్క్యూ దళం ఇవాళ ఇలా ఉపయోగిస్తున్నదన్నమాట!

          రోడ్డు మార్జిను మెరక వానలకో గేదెల త్రొక్కుళ్లలో కారి, జారి గుంటలు పడితే ఇక క్రమంగా ఆ రోడ్డు భాగం పనైపోయినట్లే - మరి ఈ గంగులవారిపాలెం రోడ్డేమో ఈ ఊళ్ళో కెల్ల ఆదర్శమైన - ప్రతిష్టాత్మకమైనదాయె! తమ శ్రమ ఫలితమైన ఇంత మంచి రోడ్డు దెబ్బతినే ప్రమాదం పసికడితే - రెస్క్యూ టీమ్ ఊరుకొంటుందా?

          వ్యర్ధాల నుండే రోడ్డు భద్రతా కారక్రమమన్న మాట! చెత్త మీద పన్నులని, “చెత్త నుండే సంపదల సృష్టిఅనీ ఈ మధ్య కొన్ని చర్చలు జరుగుతున్నట్లే - ఈ కార్యకర్తలది ఎవరికీ పనికి రాని వ్యర్థాల నుండే వాటికి తమ శ్రమను జోడించి రోడ్లను కాపాడుకోవడం!

          కాల్వ దరిన ముందుగా రాళ్లు పేరుస్తారు; అవసరమనుకొంటే తాడిమొద్దు లెక్కడి నుండే మోసుకొచ్చి - రాళ్లకు దన్నుగా సర్దుతారు! మరొక వీధిలో తామే ఊడ్చిన - పైన పేర్కొన్న వ్యర్ధ మిశ్రమాన్ని అక్కడ పోస్తారు! ఇలా వీళ్లెన్ని రోడ్లను - ఎన్ని చోట్ల ఎన్ని మార్లు మరామత్తు చేశారో! లెక్కేస్తేనేమో నలుగురైదుగురే గాని - రాటు దేరిన కార్యకర్తలు!

          6.30 కు తమ పని సంతృప్తికరంగా ముగించి, రేపటి తమ బాధ్యతలను నిర్ణయించుకొని పద్మావతి గారి మాడు నినాదాలను ప్రతిధ్వనించి.., నేటికి ముగించారు!

 

          ఈ మాత్రపు సహకారం?

పరిసరాల పరిశుభ్రతె స్వస్త మానవుల భద్రత

అని ఒక మౌలిక సూత్రం ఆరోగ్యపు శాస్త్రంలో!

ఆ యదార్ధ ప్రచారకుల స్వచ్ఛ సైన్య ఉద్యమాని

కింతేనా సహకారం ఇంత చల్లపల్లిలో?

 

- నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

14.02.2022.