2352* వ రోజు....

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

ఒక గ్రామ శుభ్ర - సుందరీకరణ కోసం పని దినాల క్రమ సంఖ్య – 2352*

          మంగళవారం (15.2.22) వేకువ సైతం ఊరి రోడ్ల పటిష్టత కోసం మళ్ళీ అవే చర్యలు -  సమయమూ అదే (4.30 Am) - గంగులవారిపాలెం దగ్గర వంతెన సమీపాన మరొక మారు అదే దృశ్యం! గ్రామస్తుల ప్రయాణ సౌకర్య బాధ్యతలు చప్పట్లు కొట్టి పిలుస్తూ ఉంటే – రెస్క్యూ టీమ్ కు నిద్రెలా పడుతుంది? ఐతే వాళ్లకు రాన్రానూ మద్దతు బాగా పెరుగుతున్నది!

          గ్రామ రక్షక దళం గానీ, వాళ్లకు సపోర్టుగా ఇతర కార్యకర్తలు గానీ ఈ రోజు మొత్తం 16 మంది! (ఇందులో ఒక కాల భైరవ మూర్తిని కూడ - వాట్సప్ చిత్రంలో గమనించండి) ఆ ప్రకారంగా బండ్రేవుకోడు మురుగు కాల్వ ఉత్తరం గట్టు మీద ఈ వేకువ 4.30 & 6.20 మధ్య సందడే సందడి.

          యదాలాపంగా చూసే చాలమంది దృష్టిలో ఈ సందడి - ఈ స్వచ్చోద్యమం ఆర్భాటమనీ, చాదస్తపు రాద్దాంతమనో అనిపించవచ్చు గాక - వ్యక్తి, సమాజం, గ్రామ వికాసం, క్రమశిక్షణ... అని పట్టుకు వేలాడే వాళ్లకి మాత్రం ఈ తరహా స్వచ్చంద శ్రమదానం కనీస ఆవశ్యకం మరి! “లోకోః భిన్న రుచీ” అనే సామెత అందుకే!

          ఈ శుభోదయంలో రెస్క్యూ టీం వాళ్ళు కొద్ది మందే గాని, వాళ్లకి సహకారులూ – ప్రోత్సాహకులూ మరి కొందరే గాని - జరిగిన పని మాత్రం తక్కువ కాదు. సందడి గానే - సరదా కబుర్లు గానే - శ్రమదానాన్ని ఒక ఆటగానే చేసుకుపోతున్నా, అది ఈ వేళ కనీసం 20 గజాల రోడ్డు భద్రతకు పూచీ పడింది!

          అందుకు గాను ఒక తాటి బొందును అడ్డంగా నిలిపారు, మళ్ళీ దాని స్థిరత్వం కోసం పొడవాటి మేకులు (పెగ్స్) పాతారు, రోడ్డు మార్జిన్ గుంటల్ని రాళ్లు పేర్చి, మట్టితో చదును చేశారు. ఇందుకు ప్రతిఫలంగా ఇంత చలిలోనూ చెమటలు కార్చారు! అనుకొన్నది సాధించిన సంతృప్తినీ పొందారు!

          6.40 సమయంలోని సమావేశంలో శివరామపురం గ్రామస్తుడూ, మన మాజీ రెగ్యులర్ కార్యకర్తా - B.D.R. ప్రసాదు గారు ముమ్మారు ప్రవచించిన గ్రామ శుభ్ర – స్వచ్చ సౌందర్య నినాదాలు పలికి నేటి కృషిని ముగించారు.

          రేపటి వేకువ మనం మరొక వీధి మెరుగుదల ప్రయత్నం కోసం కలిసి శ్రమించడానికై విజయవాడ మార్గంలోని బికనీర్ భోజనశాల దగ్గరే కలుసుకొందాం!

 

          అదే సంస్కృతి విస్తృతి

స్వచ్ఛ సైన్య త్యాగం, శ్రమ – అదొక క్రొత్త సంస్కృతి

సకల జనుల స్వస్తతకే సదా అట్టి సత్కృతి

గ్రామస్తుల సహకారమె కదా దాని విస్తృతి?

ఎప్పుడైన రాక తప్పదీ జనాలలో పరిణతి!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   15.02.2022.