2353* వ రోజు.......

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

చిరస్మరణీయ - సదాచరణీయ స్వచ్చోద్యమం - @2353*

            వేలాది వేకువల్లాగే ఈ 16-2-22 (బుధవారం) నాటి బ్రహ్మ ముహూర్తం కూడ! అది పెళ్లిళ్ల - పేరంటాల శుభ ముహూర్తం కాదు - అంతకు మించిన స్వగ్రామ శుభ్ర సుందరీకరణ ఘట్టం! ఈ దృశ్యం ఈ వేకువ ఆవిష్కృతమయింది విజయవాడ బాటలోని R&B, బికనీర్ హోటల్, మండల రెవిన్యూ కార్యాలయాల పరిసరాలు! ఆవిష్కర్తలు 28 మంది. అందులో వృద్ధులన బడేవాళ్లు ఐదారుగురు! మొత్తం పనిగంటలు సుమారు 60! శ్రమదాన స్ఫూర్తేమో అగణితం! అజరామరం!

            అదాటున ఇట్లా వచ్చో, అట్లా చూసో వెళ్లే వారి దృష్టిలో ఇలా నేను వ్రాసే వ్రాతలు అతిశయోక్తులనిపించవచ్చు! ఆ! ఏముందిలే చీపుళ్లతో రోడ్లు ఊడవడమేగా - మురుగు కాల్వల్లో తుక్కులు లాగి ట్రక్కుల్లో నింపడమేగా - రోడ్ల మీది గుంటల్ని పూడ్చడమేగా....అని అనిపించవచ్చు. కాని ఊళ్ళో ప్రతి వీధిని - ముఖ్యంగా ప్రధాన రహదార్లను - ఖాళీ నివేశనాలను - గుడులను - బడులను - వల్లకాడులను - ప్రభుత్వ కార్యాలయాలను - ఎనిమిదేళ్లుగా ఇన్నేసి మార్లు శుభ్ర - సుందరీకరించేందుకు కార్యకర్తలెంత శ్రమించారో, ఎంత చెమట కార్చారో, తమ సమయ - ధనాల్ని వెచ్చించారో ఖరీదు కట్టగల షరాబులకు మాత్రం అలా అనిపించదు మరి!

            ఒక్క కూరల దుకాణం దగ్గరే వ్యాపారులు విలాసంగా పడేసిన కుళ్లు కంపు కొట్టే వ్యర్ధాలను 10 మంది శ్రమదాతలు తొలగించి, డిప్పల కొద్దీ దుమ్ము - ధూళి - వ్యర్థాలను ఊడ్చి, ట్రక్కులోకి మోయడం చూశాను!

            రహదారి బంగళా ఎదుటి రోడ్డు మార్జిన్ ను ఎన్ని మార్లో ఆక్రమణల్నుండి కాపాడి, సొంత ఖర్చుతో కంచెలు నిర్మించి, అక్కడ ఇది వరికే ఉద్యానాలను నిర్మించి ఈ వేకువ అక్కడ గునపాలతో, పారల్తో త్రవ్వి, తిరగేసి, పూల తోటలు నిర్మించేందుకు ఏపాటి దీక్షగా శ్రమించిందీ చూశాను!

            మాంసం దుకాణాల ఎదుట, పాల కొట్ల ముందు, తోపుడు బళ్ల దగ్గర అన్ని రకాల చెత్తల్ని విసుక్కోక, తిట్టుకోక ఇన్నిమార్లు ఇంత సహనంగా శుభ్రపరచే ఈ శ్రమదాన కార్యక్రమం చాల మంది దృష్టిలో చాల విశిష్టమయిందే!

            ఇక - బికనీర్‌ భోజన విక్రయశాల దగ్గర కాలుష్యాల మీద అందహీనత మీద జరిగింది అక్షరాలా యుద్ధమే! బెజవాడ బాటకూ, బైపాస్ వీధికీ నడుమ పడిన పెద్ద గొయ్యి ఇన్నాళ్లుగా వాహన చోదకులకెంత అసౌకర్యంగా ఉన్నా ఐదారుగురు కార్యకర్తల నేటి శ్రమతోనే గదా బాగుపడింది!

            ఎవరికైనా నచ్చకున్నా - ఏ కొందరో మెచ్చకున్నా - ప్రతిరోజూ మితిమీరి వర్ణిస్తున్నాననుకొన్నా - ఇలా కళ్లెదుట రోజూ జరిగే స్వచ్చోద్యమ సన్నివేశాల్ని ఈ మాత్రం మెచ్చుకోక తప్పడం లేదు!

            నేటి కాఫీ సమయం పిదప డి.ఆర్.కె. వైద్యుడు ఈ నిస్వార్థ శ్రమదానానికి పరవశించడం అలా ఉంచితే – ‘మనకోసం మనంట్రస్టు మీద వదాన్యుల విరాళ వర్షం కురిసింది. స్థూలంగా సదరు సార్థక ఆర్థిక సహకార వివరాలు :

1) తొలి నాళ్ల స్వచ్చోద్యమ కార్యకర్త, 80 ఏళ్ల రావూరి సూర్యప్రకాశరావు గారు : సాలుసరి 25,000/-

2) మెరిక లాంటి స్వచ్ఛ కార్యకర్త మెండు శ్రీను : భార్య స్మృత్యర్ధంగా 2,000/-

3) భాగ్యనగరం నుండే ఒక స్వచ్చోద్యమాభిలాషిణి పొట్లూరి అనుపమ తన కుమారుడు నిఖిల్ పేర (అన్నే చంద్రశేఖర శ్రీనివాస్ ద్వారా) 5,000/-

4) ఊరి కోసం శ్రమదానాన్ని, అందుకు విరాళ వ్యసనాన్ని ఈ నడుమ కాస్త పెంచుకొంటున్న కోడూరు వేంకటేశ్వరరావు (తన వైవాహిక స్ఫురణగా) 1,500/-

5) ఆయన అసలు మూలం పెదనందిపాడు పేరు లావు నరేంద్ర నాధ్ (నిమ్స్ మాజీ డైరక్టర్) భార్య కాట్రగడ్డ అనురాధ వెరసి అదొక విశ్వజనీన వైద్య కుటుంబం 1,00,000/-

            రేపటి మన ఊరి స్వచ్చ సౌందర్య నిబద్ధత కోసం, బెజవాడ రోడ్డు పారిశుద్ధ్యం కోసం వేకువనే కలువవలసిన చోటు మండల కార్యాలయం. 

 

            చాటిస్తాం - పాటిస్తాం.

స్వచ్చోద్యమ సంరంభమె సాహసమని - సముచితమని

స్వచ్ఛ సైన్య సారధ్యమె సక్రమమని - సార్థకమని

అది వినా భవితకు ఆస్కారం లేనే లేదని

ఎక్కడెన్ని మార్లైనా - ఇట్లే ప్రకటిస్తామని!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   16.02.2022.