2354* వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

ప్రయోజనకర - ప్రయోగాత్మక శ్రమదానం @ 2354*!

            పదమూడున్నొక్క మందికైతే మరీ 4.18 కీ, మిగిలిన వారికి కొద్ది నిముషాలకీ ఈ గురువారం (17-2-22) వేకువలో శ్రమదాన ముహూర్తం! నేటి కార్యకర్తల బలగమైతే - 31. 6.30 దాక - అంటే 30 x 2 గంటల 12 నిముషాల గ్రామ కర్తవ్యమన్నమాట! ఈ సామూహిక శ్రమదాన రంగస్థలం బెజవాడ రహదారిలోని M.R.O, M.D.O కార్యాలయాల లోపలా, వెలుపలా!

            ఈ శుభోదయాత్పూర్యం చీపుళ్లు పట్టిన, కత్తులు ధరించిన, దంతెలతో పనిచేస్తున్న, మురుగు - తుక్కు డిప్పల్ని మోసి, ట్రాక్టర్ లో నింపుతున్న, మోకాల్లోతు డ్రైనులో అడ్డుపడిన సిల్టును, గడ్డిని, ప్లాస్టిక్ సంచులూ, సీసాలూ చేతుల్తో లాగుతున్నదెవరు? ఊరి సర్పంచి, అమెరికా ప్రవాసి, పొరుగూరి రైతూ, కర్ణాటక నుండి వచ్చిన ఔత్సాహిక వృద్దబాలుడితో సహా కొందరు వృద్ధులు, డాక్టర్లు, తదితరులు!

            ఊళ్ళో 27 వేల మందికి పైగా పట్టని, పంచాయతీ కార్మకుల శక్తికి మించిన వీధి పారిశుద్ధ్యం ఈ 30 మందికీ ఎందుకు పట్టుకొంటున్నది? నా కోడి కూస్తే గాని తెల్లారదనే సామెతలాగా 2354* దినాలుగా ఇంత పెద్ద గ్రామంలో ఏదో ఒక మూల స్వచ్చ కార్యకర్తల శ్రమదాన సంరంభమే తప్ప ఎవరి వీధిని, ఇళ్ల పరిసరాల్ని, పచ్చదనాన్ని ఆయా వీధుల వాళ్లు ఎందుకు పట్టించుకోరు?

            BSNL మాజీ ఉద్యోగి - ఒక బక్కాయన MRO ఆఫీసు ముందరి డ్రైనులో దిగి, గంటన్నర పాటు బండెడు చెత్తను బైటకు లాగితే -

            నలుగురైదుగురు మహిళలు చీపుళ్లతో చేతులు నొప్పులొస్తున్నారోడ్లు ఊడిస్తే - నలుగురు తహసీల్దారు కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రపరుస్తుంటే -

            84 ఏళ్ల వృద్ధ బాలుడు పనిముట్లకు చౌకీదారుగా వ్యవహారిస్తుంటే

            పని విరమణ వేళ దగ్గర పడిందనే తొందరలో చివరి 20 నిముషాలు కార్యకర్తలు పని వేగం పెంచుకుంటూ పోతే

            ఒక ట్రస్టు ఉద్యోగి నిన్న పలుగు పడి కాలి వ్రేలు చితికి కూడ ఈ వేకువనే వచ్చి, అందరికీ ఆరగా ఆరగా మంచి నీళ్లందిస్తుంటే

            మైకు నుండి శ్రమ తెలియనీయక మంచి మంచి పాటలు వినబడుతుంటే - నాలాంటి

వ్రాతగాళ్ళకి, కొందరు సామాజిక చైతన్య మూర్తులకీ ఇది ఎంత మంచి పండగ వాతావరణమో ఊహించండి!

     వక్కలగడ్డ కు చెందిన కీర్తిశేషులు, స్వచ్చోద్యమ నిరంతర ప్రోత్సాహకులు, మల్లుపెద్ది రామసుబ్బయ్య గారి కుమార్తె రాణికుమారి 'మనకోసం మనం' ట్రస్టుకు 10,000/- విరాళం చెక్కు రూపంలో సమర్పించినందుకు స్వచ్చోద్యమాభి వందనాలు!

            6.45 తరువాత సమీక్షా సమావేశంలో తన జన్మస్థల పరిశుభ్ర సౌందర్య సంపాదక నినాదాలను చాటి చెప్పిన వ్యక్తి పైడిపాముల కృష్ణకుమారి గారు! ఆమె ప్రస్తుత పదవికి ఎన్నికైన వార్షికోత్సవ సూచకంగా జ్ఞాపిక నిచ్చి, కార్యకర్తలకు చిరువిందు సమకూర్చిన ఆనందం RMP–  శేషు గారిది! (మొత్తంగా చూస్తే ఇంత సుధీర్ఘ కాల గ్రామవికాస కర్తలేమో స్వచ్ఛ సైనికులు, సదరు ఫలితాల భోక్తలు చల్లపల్లి ప్రజలు!)

            శుక్రవారం నాటి మన వేకువ శ్రమదాన ఘట్టం - నడకుదురు, బెజవాడ రోడ్ల కూడలి దగ్గరి పెట్రోలు బంకు నుండి మొదలౌతుంది!

 

                        వలదిప్పుడు.

బాధ్యతలను మోయువాడు నాయకుడే కానప్పుడు

సమాజ ఋణం తీర్చువాడు మార్గదర్శి కానప్పుడు

ఉద్యమాల పేరు చెప్పి, ఉన్నత మహదాశయాల

మాటున - మాటలు చెప్పే మహనీయులు వలదిప్పుడు!

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   17.02.2022.

మల్లుపెద్ది రామసుబ్బయ్య గారి కుమార్తె రాణికుమారి