2355* వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

ప్రజోపయుక్త శ్రమదానంలో ఏకంగా 2355* పని దినాలు!

          సహర్షంగా, సముత్సాహంగా, ఊరికి సగర్వకారణంగా - సానుకూల దృక్పథంగా సదాశయ స్ఫూర్తిమంత్రంగా సాగుతున్న చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం వయస్సు 2355* రోజులు! గురువారం వేకువ కూడ కార్యకర్తల సంసిద్ధత 4.18 కే - NTR పార్కు ముందర శ్రమత్యాగానికి పూనుకోబోతున్న 16 మందిని చూడండి! మరో 13 మంది - వెరసి 29 మంది శ్రమ ఈ శుక్రవారం (6.28 దాక) 2 గంటలకు పైగా ఈ రెండు రోడ్ల కూడలికే అర్పితమయింది!

          చర్విత చర్వణంగా ఇంచుమించు నిన్నటి చోటనే కార్యకర్తలు గుడ్డిగా ప్రయత్నించడం కానే కాదు - ఇక్కడ పొడవాటి లోతైన మురుగు కాల్వ ఉన్నది; అటు ప్రక్క మిక్కిలినేని రామకోటయ్య స్మారక RTC ప్రయాణికుల ప్రాంగణమున్నది; ఇక చాపల - కూరల టిఫిన్ బళ్ల టీ బడ్డీల - కిళ్ళీ కొట్ల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్ధాలకు అస్సలు లోటేమున్నది! డ్రైన్లలో ప్లాస్టిక్ లు, టిఫిన్‌ పొట్లాల కాగితాల్ని, ఇంకా పరమదరిద్రాలను విసిరేసే కొందరు జనుల చెడు అలవాటు కూడా ఉన్నది....!

          ఇక వీటన్నికి విరుగుడుగా - ఇదుగో పాతిక - ముప్పై మంది కార్యకర్తల మొండి పట్టుదల ఉన్నది. ఎక్కడ లైఫ్ బాయ్ ఉన్నదో - అక్కడ ఆరోగ్యం ఉంటుందిఅనే పాత కాలపు ప్రకటనలాగా – “ఎక్కడ చల్లపల్లి స్వచ్చంద శ్రమదానమున్నదో - అక్కడ శుభ్ర స్వస్త సౌందర్యములుంటవి...అనేది దిన దినం ఋజువౌతూనే ఉన్నది! ఇక వీటికి తోడు – “*తాము కష్టించి, ఊరంతటి మేలు కోసం శుభ్రపరచిన రోడ్డు మార్జిన్లు రాత్రికి రాత్రే ఏ కబ్జా వీరుల పాలౌతాయో*..” అనే అనుమానాలు స్వచ్ఛ కార్యకర్తల్ని తొలుస్తూనే ఉంటాయి!

          గ్రామ వికాసమే లక్ష్యంగా ఇందరు స్వచ్చ కార్యకర్తల కృషిలో పాలుపంచుకోని ఆయా ప్రాంత దుకాణదారులు, గృహస్తులు వాట్సప్ ఛాయా చిత్రాల్లోనైనా వీక్షించి ఆలోచించడం అవసరం! ఈ వేకువ 2 గంటలకు పైగా :

- S.P. & D.P. అనబడే ఇద్దరు ప్రసాదులు బారు పారల్తోను, గోకుడు పారల్తోను గోకి, చెక్కి బెజవాడ రోడ్డు పైనున్న వ్యర్ధాలను తొలగించి, దాన్ని విశాలపరచడం,

- ఒక పోస్టల్ ఉద్యోగి ఎత్తైన అంబేత్కర్ సరసన నిలబడి, చెట్ల కొమ్మల్ని తొలగిస్తుండడం,

- మరొక విశ్రాంత ఉద్యోగి NTR పార్కు ఎదుటి డ్రైన్ లో 2 గంటలు నానిపోయి విజయోద్వేగంతో ఒడ్డుకు చేరడం,

- బస్ ప్రయాణ ప్రాంగణాన్నీ, పరిసర చిరు దుకాణ జాగాల్ని ముగ్గురు శుభ్రపరచడం,

- ధూళి పైకి లేచి, ముఖాల్ని క్రమ్ముతున్నా కొందరు మహిళలు అదే దీక్షగా రోడ్లను ఊడ్వడం, అందులో 84 ఏళ్ల లుంగీవాలా ఒకరుండడం,…

          ఇలా వ్రాసుకొంటూ పోతే ఈ శ్రమదాన విశేషాలకు అంతు ఎక్కడ?

          6.50 ప్రాంతంలో సమీక్షా కాలంలో సదరు వృద్ధ యువకుడే మైకందుకొని, ఒక పద్యం పాడి, గ్రామ శుభ్ర - సౌందర్యాలను ముమ్మారు దబాయించడం జరిగింది!

           అజ్ఞాత వదాన్యుడొకరు గతంలోనివి కాక, నిన్న నిశబ్దంగా చెక్కు రూపేణా 25 వేల రూపాయలను బదిలీ చేశారు! సదరు అజ్ఞాత విరాళానికి మన సుజ్ఞాత ధన్యవాదాలు!

          రేపటి విజయవాడ రహదారి శౌచ సౌందర్య సాధన కోసం మనం మరొక మారు కలిసి, శ్రమించదగిన ప్రాంతం - పెట్రోలు బంకు దగ్గర ఆగి - విద్యుత్ సంస్థ భవనం etc ల దగ్గర.

 

              స్వచ్చోద్యమ కారులే

ఉవ్వెత్తున లేచి సాగు ఉద్యమమిది ఎవరి కొరకు?

నిస్వార్థ క్రమబద్ద శ్రమ దాతలు ఎచట - ఎవరు?

సంఘం బుద్ధం ధర్మంశరణు జొచ్చు ధన్యులెవరు?

శ్రమ పతాక శ్రమ వికాస సజ్జను లెచ్చోట గలరు?

         

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   18.02.2022.