2356* వ రోజు....

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

నేటికి 2356* పని దినాల ఆదర్శ శ్రమదానం.

శనివారం (19-2-22) నాటి 16 మంది కార్యకర్తల పని తొందర 4.20 A.M కే! మరో 10 మంది గ్రామ శుభ్ర సుందరీకర్తలు వచ్చి కలిసింది కొద్ది నిముషాల వ్యవధిలోనే! NTR పార్కు కేంద్రంగానే వాళ్ల కృషి మొదలయింది గాని, ఉత్తర దిశగా 50 - 60 గజాల దాక విస్తరించింది. 6.20 దాక ఈ గ్రామ సమైక్య శ్రమైక ఆదర్శజీవనం కొనసాగింది!

            సొంత ఊరి పారిశుద్ధ్యపరమైన ఇందరి సదుద్దేశం నెరవేరి, పార్కు ప్రవేశ ద్వారం నుండి విద్యుత్ కార్యాలయం దాక అటు రహదారి, ఇటు మురుగు కాల్వ, దాని గట్లు దుమ్ము తొలగి, నానా రకాల చెత్తా చెదారం, గడ్డి, ముళ్ల పిచ్చి మొక్కలకు మూడి ఇప్పుడీ 100 గజాల మేర చూడబుద్ధౌతున్నది! మరి - ఇదంతా ఎలా సాధ్యమౌతున్నది? ఉపన్యాసాలతో గాదు, పాండిత్యాలతో గాదు, మంత్రతంత్రాలతోనూ కాదు, కేవలం పాతిక ముప్పై మంది కాయ కష్టంతో మాత్రమే సుమా!

            ఇక - ఆ శరీర కష్టం ఎలాంటిది? మీడియా దృష్టిలో పడి, కెమెరాల కోసం చీపుళ్లు పట్టుకొని, లిమ్కా - గిన్నెస్ పుస్తకాల పేజిలు నింపే పైపై పూతల శ్రమ దానం కాదు; ఇటీవల రాష్ట్రంలో ప్రాచుర్యంలో కొచ్చిన గ్రాఫిక్స్కూడ కాదు; ఒకటీ పదీ వందా కాక, 2356* నాళ్ళ – 3 ½  లక్షల పని గంటల ప్రతి వేకువా 30-40-50 మంది కర్మిష్టుల బహిరంగ యదార్థ శ్రమ దృశ్యం!

            మన ప్రాచీనులు తమ సోమా జ్యోతిర్గమయ - అసతోమా సద్గమయ మృత్యోర్మా అమృతం గమయఅని ఆశించినట్లుగా,

            బాల గంగాధర తిలక్ అనే అభ్యుదయ కవి వ్యంగ్యకోణంలో దేవుడా! రక్షించు నాదేశాన్ని - పరమాచార్యుల్నుండి, మూఢ నమ్మకాల్నుండి....అన్నట్లుగా చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలు ఎవర్నీ వేడుకోక స్వశరీర శ్రమనే నమ్ముకొని, సమున్నతంగా తమ ఊరిని నిలుపుకొనే నిరంతర కృషిలో తల మునకలౌతుంటారు.

- వీరిలో కొందరు మరీ వయోవృద్ధులు, కొందరు ఓ మోస్తరు వృద్ధులు, మహిళలు, యధావిధిగా - యధాశక్తిగా తమ సామాజిక బాధ్యతగా వీథి పారిశుద్ధ్యం నిర్వహిస్తే, మురుగు నిపుణుడైన విశ్రాంత ఉద్యోగి గంటకు పైగా పార్కు దగ్గరి కాల్వలోని గడ్డీ గాదం, తుక్కు, సిల్టు లాగి బైట ఇద్దరికందిస్తుంటే

- పార్కు మురుగు దొడ్లున్న వైపు ప్రహరీ దగ్గరి ఎన్నెన్నో వ్యర్థాలను ఏడెనిమిది మంది నరికి, దంతెలతో లాగి, మధ్య వర్తుల ద్వారా ట్రక్కులోనికి చేరుస్తుంటే - కరెంటు కార్యాలయం దగ్గర ఐదారుగురు డ్రైను గట్ల మీద - బహుశా దుకాణాల వారు పారబోసిన కశ్మలాలను రోడ్డు వార గుట్టలుగా పేరుస్తుండగా

- అక్కడికి దూరంగా ఇద్దరు రైతులు బడ్డీ కొట్ల పరిసరాల్ని ఒక క్రమ పద్ధతిలో శుభ్రపరుస్తుంటే...

            ఇలా 6.20 దాక ఆ పొగ మంచులోనే - చలిలోనే వచ్చే పోయే వాహన రద్దీలోనే ఊరి పారిశుద్ధ్య శ్రమదానం విజయవంతమైంది!

            6.45 కు ముందే కొందరు ఈ నాటి శ్రమౌదార్యాన్ని "అద్భుతః! అత్యద్భుతః!!" అంటూ రకరకాలుగా వర్ణించారు. ఆకుల దుర్గా ప్రసాదు కాస్త ఆవేశంగానే ముమ్మారు గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్యీకరణ సంకల్పాన్ని ప్రకటిస్తే అడపా గురవయ్య నేటి కార్యక్రమాన్ని ముక్తాయించాడు!

            రేపటి (ఆదివారం) వేకువ మన ఊరి మెరుగుదల కృషి కూడ  పెట్రోలు, బంకు దగ్గర ఆగి విజయవాడ బాటలోనే కొనసాగిద్దాం!

 

            ఇది జన్మాంతర ఋణమా?

సేవలనీ - జన్మాంతర ఋణాలనీ పేర్లెందుకు?

'ప్రజారక్తి, దేశ భక్తి' పెద్ద పెద్ద కబుర్లేల?

మానవీయ విలువలనో - బాధ్యత నిర్వహణమనో

స్వచ్చ సైన్య కృషిని పిలువ వచ్చు గదా ఇకనైనా?

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   19.02.2022.