2357* వ రోజు.......

 ఏక మాత్ర ప్రయోజనకరమైన సామానులు మనకెందుకు?

ఆదివారం – 2357* వ నాటి స్వచ్చోద్యమ వీర విహారం!

            ఔను - ఈ వేకువ 4.20 నుండి 6.20 దాక విజయవాడ మార్గంలో 30 మంది చేసింది వీరోచిత శుభ్ర సుందరీకరణం కాక మరేమిటి? ముంబై, హైదరాబాదీయులకు దీటుగా ఇప్పుడు మన గ్రామస్తుల్లో కూడ చాల మంది ఉషోదయ వేళ మేల్కొని, తొలి బాలభానుడి ఆహ్లాదకర ప్రసన్న రూపాన్ని చూడడం మానేశారు - ముఖ్యంగా ఆదివారాలలో ఐతే 7-8-9 గంటలకు మేల్కొనే అలవాటు వచ్చేస్తున్నది.

            స్వచ్ఛ కార్యకర్తలేమో ఏ 3.30 కో లేచి, ఒక ప్రక్క స్వకుటుంబ బాధ్యతల్నీ, అటు గ్రామ కుటుంబ శ్రేయస్సునూ సమన్వయించుకొంటూ ఇలా కంటికి కనిపించని వాతావరణ కాలుష్య ఉమ్మడి శత్రువును ఏ రోజుకారోజు ఎదుర్కొంటూ కనీసం 2 గంటల పాటు పోరాడుతుంటారు!

            ఈ యోధుల్లో ఇవాళ ఏడేళ్ల నుండి 84 ఏళ్ల వయస్సు వాళ్లు - ఎవరి శక్తి కొలదీ వాళ్లు ఒకే లక్ష్య సాధన కోసం - ఒక పెద్ద వీధి స్వచ్ఛ శుభ్ర సౌందర్య కల్పన కోసం పనిచేశారు!

            ఈ ఏడెనిమిదేళ్లుగా స్వచ్ఛ సైనికుల గమ్యం ఒక్కటే కావచ్చు; దూరం నుండి చూసే కొందరికి ఒకే పని చేస్తూ అవే పాటలు వింటూ - అవే నినాదాలు చేస్తూ ఆ రోడ్లే ఊడుస్తూ ఆ రోడ్ల ప్రక్క స్థలాల్ని ఆక్రమణల్నుండి రక్షించుకొంటూ పూల మొక్కలు నాటుతూ - చెట్లు పెంచుతూ - మధ్య మధ్య కొన్నాళ్లు ఏ శ్మశానాన్నో బస్ ప్రాంగణాన్నో - గుడినో - ప్రభుత్వ కార్యాలయాన్నో శుభ్రపరుస్తూంటే - చూసి చూసి బోరు కొట్టుతుండవచ్చు కూడ!

            “కనీసం 7 గంటలదాకైనా పడుకొని, నిద్ర పోనీయకుండా మా ఇళ్ళ ప్రక్కన ఈ చీకట్లో మంచులో ఈ సందడేంటి? ఈ మైకు పాటలేంటి?..” అని చిరాకూ కలగొచ్చు! అది వాళ్ల అవకాశం, అదృష్టం! ఈ స్వచ్ఛంద శ్రమదానం వీళ్ల బాధ్యత! బాధ్యత అని భావించకపోతే - 

            క్షణం తీరిక చిక్కని గృహిణులు, ఆస్పత్రి నర్సులు, ఉద్యోగులు, వ్యాపారులు, డాక్టర్లు, ఇళ్లకు పరిమితం కాదగ్గ పెన్షనర్లు ఇంత వేకువ చలిలో - మంచులో ఇంత సుదీర్ఘ కాల పారిశుద్ధ్య పనులు చేస్తారా? లక్షల గంటల విలువైన కాలాన్నీ, కష్టార్జిత ధనాన్నీ తమ గ్రామ పౌర సమాజం కోసం వెచ్చిస్తారా?

- ఇవన్నీ నావంటి కొందరి వ్రాతలూ, భావ ప్రకోపాలే! నిత్య కర్మిష్టులైన స్వచ్చ కార్యకర్తలు మాత్రం యధా ప్రకారంగా

- విద్యుత్ కార్యాలయం ఎదుటి రోడ్డు దుమ్మునూ, ఆకులలముల్నీ, మురుగు కాల్వనూ, దాన్ని మూసేస్తున్న పిచ్చి తీగల్ని తమకు నచ్చేంతగా శుభ్రం చేశారు;

- ముగ్గురు నలుగురు రహదారి బంగళా ఎదుట నిన్నటి దాక తాము శుభ్రం చేసిన రోడ్డు మార్జిన్ లో గద్ద గోరు పూల తోటను సృష్టించారు! MRO ఆఫీసు ఎదుట పూల మొక్కల్తో సహా ఏ 30-40 పూల మొక్కలో ఇప్పుడు కనిపిస్తున్నవి!

- పెట్రోలు బంకు నుండి ఉత్తరంగా డ్రైను గట్టుల్ని కాలుష్య రహితం చేశారు.

రోడ్డు ఊడ్చే కార్యకర్తలు తమపనిలో తామున్నారు!

            6.40 – నినాదాల వేళ, సమీక్షా సందర్భంలో ముమ్మారు ఊరి సచ్చ శుభ్ర సౌందర్య నీరాజనాలు పలికింది గోళ్ళ వేంకటరత్నం; మనఃపూర్వకంగా గ్రామ శ్రమదానాన్ని మెచ్చింది డాక్టరు DRK. ఈ శ్రమదానోద్యమం ఒక విప్లవం అని తేల్చి చెప్పిందేమో - అడపా గురవయ్య నామధేయుడు!

            ఇక మన బుధవారం నాటి వేకువ వీధి పారిశుద్ధ్య కృషి కొనసాగించవలసిన చోటు విజయవాడ రోడ్డులోని పెట్రోల్ బంకు దగ్గరే!

 

            స్వచ్చోద్యమ రీతులు

వీధులలో కొలువున్నవి వేనవేల మొక్కలు

కర్మల భవనాలు ఇంక శ్మశానాలు రహదారులు

అవి - కార్యకర్త కరస్పర్శతో పర్యాటక ప్రదేశాలు

అనుసరించి అనుష్టించు ఆ ఉద్యమ రీతులు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   20.02.2022.