2358* వ రోజు....

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనకెందుకు?

సోమవారం – 2358* వ నాటి రెస్క్యూ టీమ్ కృషి!

          ఈ మధ్య చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమంలో వచ్చిన ఒక మార్పేమంటే సోమ, మంగళ వారాల్లో గ్రామ సంరక్షక దళం వారి హల్ చల్! తక్కిన 5 రోజుల్లో వాళ్ల పాత్ర వేరు, ఈ రెండు రోజులిక వాళ్ల ఇష్టారాజ్యమన్నమాట!

          గ్రామ చిక్కు సమస్యల విషయంలో వాళ్లదొక ప్రత్యేక పరిశీలన! ఎక్కడ ఏ రోడ్ల మీద గుంటలు పడుతున్నాయో, ఏ వానలకు రహదార్ల మార్జిన్లు గుంటలు పడి రోడ్డు దెబ్బతినబోతుందో వీళ్లకొక అవగాహన ఉంటుంది. అందుకనుగుణంగా ఈ రెండు ప్రత్యేక దినాల్లో వాళ్ల ప్రణాళిక, తదనుసారంగా తగిన కార్యాచరణ, అందులో మళ్ళీ సృజనాత్మకత బైటపడతాయన్నమాట!

          21-2-22 వేకువ సమయం 4.25 నుండి 6.25 దాక – 2 గంటల శ్రమతో ఈ గ్రామ భద్రతా దళం సాధించినదేమంటే గంగులవారిపాలెం బాటలోని బండ్రేవు కోడు మురుగు కాల్వ గట్టును కోసుకు పోయే ప్రమాదం నుండి కాపాడడం! వీళ్ల బండ పనుల్లో స్థానిక గృహస్తుడొకాయన ఉత్సాహంగా పాల్గొనడం మరొక విశేషం. వాళ్లకు దన్నుగా నలుగురైదుగురు స్వచ్చ కార్యకర్తల సహకారం కూడ!

          మురుగుకాల్వ ప్రమాదపు టంచు మీద అ వేకువ చీకటిలో - చలిలో, రక్షక దళ విన్యాసాలు చూస్తూ సంతోషించాలో లేక భయపడాలో అనే సందిగ్ధంలో పడుతుంటాను.

నేను చాలా కాలం క్రిందట చదివిన శ్రీశ్రీ గేయంలోని ప్రతిజ్ఞ

శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని....

శరీర కష్టం స్ఫురింపజేసే కొడవలి గొడ్డలి - నాగలి - రంపం...

నా వినుతించే నా విరుతించే - నా విరచించే - నవీన కవితకు ప్రాణం ప్రణవం.."

అనే కొన్ని భాగాలు ఈ వేకువ నాకు మళ్లీ మళ్ళీ గుర్తుకు తెచ్చిన శ్రమత్యాగ ధనులైన కార్యకర్తలకు అభినందనలు!

          6.30 సమయంలో నేటి స్వచ్చోద్యమ సారాంశాన్ని ముమ్మారు నినాద రూపంలో వినిపించిన కార్యకర్త మాలెంపాటి అంజయ్య.

 

          స్వచ్ఛ మాన్య చల్లపల్లి.

పది మందికి మేలు చేయు పనుల పైన విమర్శలా?

గ్రామంలో కదం త్రొక్కు రక్షకులకు వివక్షలా?

ఎన్నెన్నో ఊళ్ల మీద ఈ ఉద్యమ ప్రభావమా?

ఉన్న ఊరి ప్రజ మాత్రం ఉలకని నిర్లక్ష్యమా?       

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   21.02.2022.