2359* వ రోజు....

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనకెందుకు?

రెస్క్యూ టీం వారి 2359* వ నాటి గ్రామ పరిచర్యలు.

            నిన్నటి గంగులవారిపాలెం బాటలోని పెద్ద మురుగు కాల్వ ఉత్తరపుటొడ్డు రోడ్డు భద్రతా పనుల తరువాయిగా - మంగళవారం వేకువ 4.30 కే ఐదారుగురి కృషి కొనసాగింది. గంటన్నరకు పైగా ప్రవర్ధిల్లిన సదరు స్ఫూర్తి కారక - ప్రయోజనకర శ్రమదానంతో దాదాపుగా ఈ రహదారి రక్షణా చర్యలు ముగిసినట్లే!

            చల్లపల్లి స్వచ్చోద్యమంలో ఈ రెస్క్యూ టీమ్ పట్ల ఇటీవల కొంత ఆకర్షణ పెరుగుతున్నట్లున్నది! అందులోని ఒక సభ్యుడీ వేకువ కుదరక రానప్పుడు ఇద్దరు వచ్చి అందులో కలిశారు. ఇద్దరిలో ఒకరు పాత కాపేగాని, కొత్తగా ఆస్పత్రి ఉద్యోగ యువకుడు వచ్చి, నదురు బెదురు లేకుండా ఆ దళంతో కలిసి పనిచేశాడు. (నిన్న ఈ టీం తో బాటు బరువు పనులు చేసిన స్థానికుడు బహుశా ఒళ్లు పులిసిందేమో - ఈ వేకువ రాలేదు.)

            ఈ నాటి బరువు - కరకు - మొరటు (అని ఇతరులు భావించే) పనులకు శ్రమించింది ఐదారుగురైతే, సహకారులు - కొంచెం హంగుదారులు మరో నలుగురైదుగురు!

            అసలింతటి మురికి చర్యలకు స్వచ్చోద్యమంఅనే పేరు పెట్టి, ఎందరో అసహ్యించుకొనే ఈ పారిశుద్ధ్య పనుల్నే కీర్తిస్తూ - వర్ణిస్తూ ఇలా వ్రాసుకుపోవడమే కొందరి దృష్టిలో కాస్త ప్రశ్నార్థకమౌతున్నట్లుంది. ఇదేదో ఒక చారిత్రక యుద్ధ సన్నివేశంగానో మహా మహానాయకుల సభాదృశ్యంగానో మంచి భాషతో రోజూ వ్రాయడం అవసరమా అని కూడ సందేహభావులకు తోస్తున్నదేమో!

            అలాంటి పెద్దలు దయచేసి చారిత్రక ఘట్టాల్ని కొన్నిటిని గుర్తు చేసుకోవాలని మనవి! తరువాత్తరువాతెప్పుడో మంచి ప్రారంభాలని మెచ్చబడిన చాల క్రొత్త సంగతులు - వీరేశలింగం వితంతు పునర్వివాహాలు గాని, వైదిక జీవన ప్రభను తగ్గించిన బౌద్ధ - జైనాలు గాని, ఆఖరికి దేశ స్వాతంత్య్ర పోరాటాలుగాని.... వేటిని అధిక సంఖ్యాక ప్రజలు చప్పున ఆదరించారు గనుక? స్వార్థ ప్రయోజనాలు, మూఢ సంప్రదాయాలూ, పాత ఒరవడుల ముందు చాల సార్లు త్యాగభావాలూ, విశాల జన ప్రయోజక చర్యలూ నిలవలేకపోవడం జరగలేదా?

            రెస్క్యూటీం వాళ్ల మొండి బండ - బరువు శ్రమదానాలు కాని, 2359* దినాల స్వచ్ఛ కార్యకర్తల ఊరి సేవలు గానీ కొంతమందిమి ఇలాగే అర్థం చేసుకుంటాం!

            నేటి శ్రమదాన ముగింపు వేళ - 6.30 కి తూములూరి లక్ష్మణరావు నిస్సంకోచంగా - ఎలుగెత్తి చాటిన స్వగ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య నినాదాలతో నేటి పారిశుద్ధ్య కార్యక్రమానికి తెరపడింది.

            రేపటి (బుధవారం) వేకువ మన శ్రమదాన సన్నివేశాలు విజయవాడ రోడ్డులోని పెట్రోలు బంకు దగ్గరే!

 

            ఇంతకన్న ఉదాహరణ?

అప్పుడపుడు అడ్డంకులు వచ్చి కూడ కాళ్లకి

స్వచ్చోద్యమ మేమి ఇవ్వలేదు చల్లపల్లికి?

అలుపెరుగని నిరుపమాన స్వచ్చోద్యమ స్ఫూర్తికి

ఇంతకన్న ఉదాహరణ మేమి కలదు ప్రజలకి?

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   22.02.2022.