2360* వ రోజు....

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనకెందుకు?

బుధవారం నాటి బెజవాడ దారి పారిశుద్ధ్యం - @2360*.

            23.02.2022 వ నాటి వేకువ 15 మంది కార్యకర్తలు చేరుకుని కలుసుకొన్నది 4.20 సమయంలో; పని ముగించింది 6.20 కి. 24 మంది శ్రమదాతల కార్యరంగం విద్యుత్ కార్యాలయం, వికాస కేంద్రాల నడుమనే! జీతభత్యాలాసించని - గ్రామ సమష్టి ప్రయోజనం కోసం సాగిన ఈ చరిత్రాత్మక కృషి నిడివి కాలం కొలతలో – 48 పని గంటలు! దాన్ని గత 8 ఏళ్లుగా గణిస్తే మాత్రం 3 లక్షల ఏబై వేల గంటలు!

            ఇదే వాట్సప్ మాధ్యమ వేదికలో చాల మార్లు మనం ప్రస్తావించుకొన్నట్లు - చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల సంఖ్య మొత్తమ్మీద 180 - 200 ఉండవచ్చు! ఇంచు మించుగా అందరూ నిష్కామ కర్మయోగులే! అందుచేతనే వాళ్లు అన్ని భూషణ దూషణ - తిరస్కార పురస్కార - నిరర్థక విమర్శలకు అతీతులు! ఇక వీళ్లకు తీరుతున్న కోరికేమంటే తాము నివసించే చల్లపల్లి క్రమక్రమంగా స్వస్త పరిశుభ్ర - సుందరంగా మారుతుండడం! ఎన్నెన్నో గ్రామాల వారికి చైతన్య ప్రేరకంగా మారుతుండడం!

            స్వచ్ఛంద శ్రమదాతల తీరని ఒక ఆశయమేమంటే - ప్రతి వేకువలో తమ ఊరి బాగుకోసం, ఆహ్లాదం కోసం జరుగుతున్న ఈ అపూర్వ కృషిలో పాల్గొనే గ్రామస్తుల సంఖ్య పెద్దగా పెరగకపోవడం - చాలినంత స్పందన రాకపోవడం!

            అసలు ఏమంచి మార్పుకు ఈ స్వార్థపూరిత సమాజం నుండి సకాల - సముచిత ఆహ్వానం అందింది గనుక! చెడుకు దక్కేంత ఆదరణ, మన్నన అభ్యుదయకర చర్యలకు దక్కడం ఈ కాలంలో కష్టమే మరి!

            మహాభారత కథలో ద్రోణుడి శిష్యులందర్లోకి చెట్టు మీది బొమ్మ పక్షి కన్ను అర్జునుడికే కనపడిందట! - అసలదొక్కటే కనపడిందట! తమ ఊరి కాలుష్యం అనే పక్షి కన్ను ఈ వేకువ ఈ 24 మంది కార్యకర్తలకే కనపడిందేమో! ఇక తమ లక్ష్య సాధన కోసం ఈ శ్రమదాతలు :

- నలుగురేమో విద్యుత్ భవనం దగ్గర గత నెల దాక పడిన వానలకు పెద్ద దశ చక్ర వాహనాలతో రోడ్డు మార్జిన్లో పడిన పెద్ద గుంటల్ని పూడ్చారు.

- దానికెదురుగా రహదారి పడమరగా ఏ పుణ్యాత్ముడు ఎప్పుడో ఆక్రమించి, దాచుకొన్న స్థలాన్ని క్షుణ్ణంగా శుభ్రపరిచింది ఏడుగురు గ్రామహితాభిలాషులు,

 - దీనికి ఉత్తర దిశగా నలుగురు మహిళలు, ఉభయ ప్రసాదులు ఆ మురుగు కంపు ప్రక్కనే అరగంట పాటు శ్రమించి శుభ్రంచేశారు!

- ఈ ఊరి వాళ్లకు, సమీప గృహస్తులకు పట్టని బెజవాడ వీధి పారిశుద్ధ్యం ఎప్పుడో అమెరికా వెళ్లిన ఇద్దరు ప్రవాసుల వంతైంది! నాదెళ్ల సురేష్ కాక, S.R.Y.S.P. కళాశాలోపన్యాసకుడు విజయ సారధి గారి పుత్రుడు - అనిల్‌ కూడ నేటి గ్రామ సేవలో పాల్గొనడం విశేషం!

- చెత్త లోడింగ్ లో చాకచక్యం, ట్రాక్టర్‌లో 1, 2 వ కృష్ణుళ్లు, కాఫీ సమయపు సరదా చర్చలు, సమీక్షా కాలపు కబుర్లు.... షరామామూలే!

            ఈ వేళ అమెరికా తిరుగు ప్రయాణమౌతున్న సురేష్ 3 మార్లు నిర్దుష్టంగా, నిర్దిష్టంగా చెప్పిన స్వచ్ఛ పరిశుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలు, ఉప్పల అనిల్ ఆనందాశ్చర్యాలు - అంతకు ముందు దేసు ప్రభాకర సమర్పిత బిస్కట్లు, ట్రస్టుకు 1000/- (ఇది ఆతని పుట్టిన రోజు బహుమతి - కొంచెం ఆలస్యంగా!) మరికొన్ని విశేషాలు!

            శివరాత్రి సమీపిస్తున్నందున మన రేపటి వేకువ శ్రమదాన రంగస్తలం, పెదకళ్లేపల్లి దారిలోని మేకలడొంక దగ్గరే!

 

            కరోనాతో అష్టకష్టం!

వేన వేల దినాల నుండీ వీధులన్నీ శుభ్రపరచీ

కసవులూడ్చీ మురుగు తోడీ గ్రామ స్వస్తత పాదుకొలిపిన

కార్యకర్తకు కళ్ల ముందే - కరోనాతో గ్రామమంతా

కళాహీనత తాండవిస్తే ఎంత కష్టం! ఎంత కష్టం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   23.02.2022.