2361* వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

2361* వ నాటి శ్రమదానం పెదకదళీపుర మార్గంలో-

        గురువారం 4.20 - 6.30 నడుమ, చెలరేగుతున్న పొగ మంచులో 27 మంది అనిర్వచనీయ శ్రమదానం! చల్లపల్లి కార్యకర్తలకు నేటి కర్మ క్షేత్రం 2 నుండి 3 కిలోమీటర్ల దూరం! శివరాంపురానికి దగ్గర్లోని మేకలడొంక ప్రాంతం. అక్కడి నుండి చల్లపల్లి దిశగా ప్ర.సా. దుకాణం దాక నేటి రహదారి సుందరీకరణం నా వరకు నాకు మాత్రం పునః పునః స్మరణీయం!

        ఏడెనిమిదేళ్ల నాటి ఈ స్వచ్చోద్యమ తొలి దశలో ఒక చిన్న అపప్రద ఈ ప్రాంతంలో ఉండేదట! అదేమంటే : పదే పదే సామాజిక స్పృహ అనీ - ఊరి బాధ్యతా ఋణం అనీ ఆలోచించే ఒక ప్రముఖ వైద్యుడు అలాంటి దృక్పథమే ఉన్న 15-20 మందిని ప్రోగేసుకొని - (అందులో ముసలీ మూతకా వాళ్లెక్కువట) చీపుళ్లూ, పారలూ, దంతెలూ పట్టుకొని - ఏదో పెద్ద ప్రణాళిక తోనే వీధులూడుస్తుంటాడని...!

        ఇక వాళ్ళలో కొందరేమో అత్యుత్సాహంతో మురుగు కాల్వలేంటి శ్మశానాలేంటి - వీధుల్లో మానవ మల మూత్రాలేంటి అంతకన్నా నికృష్టమైన ఎన్నిటినో తొలగించుకొంటూ పోవడం వెనక గూడ కొంత గుర్తింపు సంక్షోభం (ఐడెంటిటీ క్రైసిస్), ఇంకొంత కీర్తి దురదా లేకపోలేదని....

        అప్పట్లో ఇంకొందరు పరిశోధకుల అనుమానమైతే - వీళ్ళకు ఏకంగా ఈ స్వచ్చోద్యమం ద్వారా M.P/M.L.A పదవులూ, ఇంకా రికార్డులూ - రివార్డులే టార్గెట్లనీ...

     ప్రస్తుతానికి మాత్రం అలాంటి శంకలన్నీ సద్దుమణిగినట్లే ఉన్నవి!

        ఈ వేకువ శ్రమదాన విశేషమేమంటే - శివరాంపురం నుండి కనీసం ముగ్గురు రైతులూ, ఆ గ్రామానికి అతిథులైన ఐదుగురు యువతులూ చల్లపల్లి శ్రమదాతలతో కలిసి పని చేయడం.

   యువ చైతన్యం వల్ల నేటి పాతిక మందికి పైగా శ్రమదాతల సగటు వయస్సు తగ్గడం మంచి పరిణామం!

        కదళీపుర/శివరాంపుర మార్గమంటే, దాని హరిత - పుష్ప - స్వచ్ఛ - పరిశుభ్రలంటే ముఖ్యంగా మహా శివరాత్రి సమయాన ఇక్కడి ఆకర్షణ అదంతా కార్యకర్తల కఠోర కాయకష్ట సముపార్జితమే. ఈ మార్గంలో ప్రతి చెట్టూ, ప్రతి పూవూ, ప్రతి అంగుళమూ వాళ్ల చెమట సుగంధాన్ని గుర్తు చేసేవే!

        ఈ దారి పట్ల కొంత ఆత్మీయతతో, అనుబంధంతో ఈ వేకువ శ్రమించిన ఎక్కువ మందికి అసలది శ్రమ అనో - తామేదో గ్రామాన్ని ఉద్ధరించామనో కాక - కేవలం తమ కనీస సామాజిక బాధ్యత నిర్వహిస్తున్నామనే సంతృప్తి దక్కింది!

        6.45 కు నేటి కృషి అభినందన సమావేశంలో గ్రామ స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య సంరక్షక నినాదాలు పలికినది మల్లంపాటి ప్రేమానంద్ గారు. ఇంతటి నిస్వార్థ శ్రమదానంలో భాగస్వామినులైనందుకు సంతోషం వెలిబుచ్చినది - బాపట్ల వ్యవసాయ  కళాశాల విద్యార్థినులు!

        రేపటి వేకువ మన శ్రమదాన ఉద్యుక్తత ఇదే మార్గంలోని సాగర్ ఆక్వాఫీడ్స్” (చింతచెట్టు) దగ్గర నుండే!

 

        స్వచ్ఛ శుభ్ర చల్లపల్లి

ఇది ప్రజోద్యమమె ఐతే  ఏరి గ్రామ ప్రజలెల్లరు?

ఇది త్యాగ పునీతమె ఐతే ఎంతమంది - వారెవ్వరు?

ఒంటి చేతి చప్పట్లతొ ఒక విచిత్ర పరిస్థితి!

ఉద్యమ అంతిమ లక్ష్యం ఊరి స్వచ్ఛ పురోగతి!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   24.02.2022.