2362 * వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

 

శివరాంపురం రహదారిలో 2362* వ నాటి కాలుష్యంపై పోరాటం..

 

        అది క్రొత్తగా ఏర్పడిన జాతీయ రహదారి ఉపమార్గ సమీపం, చేపల దాణా తయారీ కేంద్రం ప్రక్కనే 42 రకాల మద్యాన్ని ప్రభుత్వమే అమ్మే దుకాణం ఎదురుగా మరొక దుకాణం వీటన్ని నుండి పుట్టుకొచ్చే చాలరకాల ప్రామాదికమైన - అసహ్యకరమైన కాలుష్యం ఉపేక్షిస్తే ప్రజారోగ్య భంగకరం. ఈ శుక్రవారం వేకువ 4.20 నుండి 6.30 దాక 38 మంది స్వచ్చోద్యమకారుల సర్వతోముఖ పోరాటం ఆ కశ్మల భీభత్సం మీదనే!

 

        చీకటిలో, మంచులో ఆ పోరుకు సిద్ధమైన వాళ్ళలో అతి జాగ్రత్తగా అడుగులేసే 84 ఏళ్ళ విశ్రాంత ఉద్యోగుల్నుండి బాపట్ల కళాశాలకు చెందిన 10 మంది వ్యవసాయ విద్యార్ధినులు దాక పాల్గొన్నారు. సమాజంలో లబ్దప్రతిష్టులు, రైతులు, గృహిణులు ఇన్నేళ్లుగా - ఇన్నాళ్లుగా ఒక గ్రామ సౌకర్యాల కోసం, ముందుతరం వారి మేలు కోసం ప్రయాణికుల గ్రామస్తుల ఆహ్లాదం కోసం ఎందుకింత దీక్షగా శ్రమిస్తున్నారని ఆలోచించవలసింది, నచ్చితే ఆచరించవలసిందీ చల్లపల్లి పౌరులే!

 

        ఐతే, ఈ సమాజంలో అత్యంత విషాద పూర్వక హాస్య సన్నివేశమేమంటే ఏ ప్రజా ప్రయోజనార్ధం ఒక క్రొత్త మంచి పని జరుగుతుందో ఆ ప్రజలే ఆ లబ్ది దారులే ఆ నిస్వార్ధ పరుల శ్రమను అపార్ధం చేసుకొంటారు, సహకరించరు, వ్యతిరేకిస్తారు కూడా! స్త్రీ స్వేచ్చ కోసం, భవిత  కోసం పాటుబడ్డ వీరేశలింగం, గుడిపాటి చలం వంటి   వాళ్ళను స్త్రీలు దుమ్మెత్తి పోసే చారిత్రక తప్పిదాలు విషాదమా హాస్యమా?

 

        ఇందుకే కాబోలు భగవద్గీతాకారుడు – “కర్మణ్యే వాధి కారస్తే మాఫలేషు కదాచన...” (సత్కర్మలాచరించు ఫలితం సంగతి పట్టించుకోకు) అని ప్రవచించాడు! దాని సారాంశాన్ని తెలిసో, తెలియకో నిత్యం అనుష్టిస్తున్నది చల్లపల్లి స్వచ్చ సైనికులే!

 

        ఈ ఊరి వాళ్ళు గాని, బైట  జిజ్ఞాసువులు గాని, ఈ వేకువ 5, 6.00 గంటల నడుమ 30 మందికి పైగా చేసిన 60, 70 పని గంటల శ్రమదానం పరిశీలిస్తే అర్ధమయే సంగతులేమిటి ?

 

1. ఎక్కడెక్కడో - కాకినాడ, విజయనగరం, ఒంగోలు, తెనాలి  ప్రాంతాలనుండి  బాపట్ల చదువు కోసం వచ్చి, అనుకోకుండా చీపుళ్లు పట్టి, రహదారుల్నీ -  డ్రైనుల్నీ శుభ్రపరుస్తున్న 10 మంది యువతులు,

 

2) ట్రక్కుల కొద్దీ ప్లాస్టిక్, గాజు మద్యం సీసాలను, గ్లాసుల్ని, ఎంగిలాకుల్ని ఇంకా ఎన్నెన్నో దిక్కు మాలిన వ్యర్ధాలను ఊడ్చి, డిప్పల కెత్తి, ట్రాక్టర్‌లో నింపి, డంపింగ్ కేంద్రానికి చేరుస్తున్న రెండు గ్రామాల 15 మంది కార్యకర్తలు,

 

3) చెత్త ట్రాక్టర్ నడుపుతున్న ఒక ప్రముఖ వైద్యుడు, అంత వేకువనే వెరపు లేక ఉభయ గ్రామాల్నుండి వచ్చి, లక్ష్య సాధనలో మునిగిన మహిళలు, రైతులు….

 

        సానుకూల దృక్పథం ఉంటే - స్ఫూర్తి పొందేందుకు ఈ దృశ్యాలు చాలవా? కాఫీ సమయంలో కూడ - రేపటి కాలుష్యం మీద పోరాటాన్ని చర్చించుకొనే సన్నివేశం చాలదా?

       

        అక్కడి 40 మందికి, హడావిడీ ప్రయాణికులకీ స్వచ్చోద్యమ లక్ష్యాలైన స్వచ్చ శుభ్ర సౌందర్య నినాద సందేశమిచ్చిన వారు లౌవ్లీ నామాంతరం కల కొత్తపల్లి  వేంకటేశ్వరావు గారు.

 

        మెరిక వంటి స్వచ్ఛ కారకర్త - దివంగత కైలా నాంచారయ్య జ్ఞాపకార్థం, కుటుంబీకులిచ్చిన 2,500/- విరాళం నేటి మరొక విశేషం!

 

        బైపాస్ మార్గం నుండి చల్లపల్లి దిశగా రహదారి కాలుష్యాల పని పట్టేందుకు రేపటి మన వేకువ పునర్దర్శన ప్రదేశం నేటి చోటే - సాగర్ ఆక్వాదాణా కేంద్రమే!

 

          స్వచ్చోత్తమ చల్లపల్లి

 

ఎంతో మేధోమధనం - ఎంతెంతో అధ్యయనం

దేశకాల సమస్యలకు దీటగు ప్రత్యుత్తరం

పర్యావరణ సమతుల్యత ప్రజా శ్రేణి సమీకరణ

లక్ష్యంగా మొలిచి పెరుగు లక్షణమగు పెనువృక్షం!

       

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   25.02.2022.