2363* వ రోజు.......

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనం ఎందుకు వాడాలి ?

చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో ఇంకొక సార్ధక శ్రమదానం - @2363*

         ఔను - పెదకళ్లేపల్లి మార్గంలో, మహా శివరాత్రి పర్వదిన పవిత్రతకు దీటైన పరిశుభ్ర - సౌందర్య సాధన కోసం ఈ శనివారం వేకువ (4.22 నుండి 6.20 దాక) 28 మంది గ్రామ సామాజిక చైతన్య కారులు చేసినది సార్ధక శ్రమే! సువిశాలమైన బైపాస్ మార్గానికి ఉభయ - ఉత్తర, దక్షిణ దిశల్లో ఈ చలి - మంచు వేకువలో - అత్యధిక గ్రామస్తుల సుఖ నిద్రా పరవశ సమయంలో ఈ వృద్ధ రైతులు, గృహిణులు తమ ఇళ్లకు 2 - 3 కిలోమీటర్ల దూరంలో తమ కాలాన్ని, శక్తిని ఎవరికోసం - ఎందుకోసం వెచ్చిస్తున్నారో - కాస్త లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తుంది!

         నేను ఈ ఉషోదయ పూర్వం గమనించిన తొలి దృశ్యం ఒక వృద్ధ వైద్యుడు కాలూ చెయ్యీ ఆడించడం (వార్మింగ్ అప్!) ఇంకో వృద్ధాతి వృద్ధుడు (ఆయన అస్సలు అలా అనుకోడు -  మానసికంగా 16 ఏళ్ల బాలా కుమారుడు-) కొన్ని నిముషాలు చీపురుతో ఊడ్చి, నిలబడడం కష్టమై, ఎత్తు పీట మీద కూర్చునే ఊడ్వడం!

         రెండో సన్నివేశం డజను మంది ప్రభుత్వ రెండో సారా దుకాణం దగ్గర మద్యం కంపో, మురుగు కంపో తెలియని దుర్గంధం మధ్య - లేచిన దుమ్ము పొగ మంచుతో కలిసిపోతుండగా -  చీపుళ్ళతో, డిప్పులతో, దంతెలతో నానారకాల - అసభ్య - అసహ్య - అనాగరక కశ్మల చండాలాల్ని ఎత్తుతున్నది!

         అందులోనే మరొక ఉపదృశ్యం - నలుగురైదుగురు మహిళలు -  ఆ దుమ్ము - ధూళి మేఘాల మధ్యనే బాటను, దాని మార్జిన్లనూ ఊడుస్తుండడం! (ఇందులో ఒక పల్నాటి స్వచ్ఛ - వీర మహిళ 6.00 కాక ముందే ఇంటి బాధ్యతల కోసం నిష్క్రమించింది. ఈమెదొక ద్విపాత్రాభినయం - రెండు నావల మీద కాళ్లు!

         ఇంకొక తేడా సన్నివేశం - ఒక BSNL మాజీ ఉద్యోగి  ప్లాస్టిక్ తుక్కులు నింపిన పెద్ద సంచిని మోస్తూ - అచ్చం కాగితాలేరుకొనే కార్మికుడి పాత్ర పోషించడం -

         ఇక మరొక ప్రత్యేక సీనరీ - ఒక సీనియర్ డాక్టరమ్మ - ప్రస్తుతానికి తనకు అమల్లో ఉన్నవి 1 ½ చేతులే ఐనా వాటితోనే జాగ్రత్తగా రహదారి పారిశుద్ధ్యానికి పాల్పడడం!

         - ఇలా వ్రాసుకుంటూ పోతే ఇదొక 10 పేజీల వివరణ ఔతుంది! వెనకటి సామెత – “ఉదర పోషణార్థమ్ బహుకృత వేషమ్అన్నట్లుగా చల్లపల్లి స్వచ్ఛ సైనికులు కూడ గ్రామం మెరుగుదల కోసం దశావతారాలెత్తడానికి సంసిద్ధులన్న మాట!

         నేటి దేసు మాధురి గారి వృత్తాంతమేమంటే : ఆ మధ్య వాళ్లాయన పుట్టిన రోజు చిరుతిళ్ల పందేరం కొందరు కార్యాకర్తలకందలేదనే శంకతో మళ్ళీ ఈ వేళ అందరికీ లడ్డూల పంపకం!

         6.15 తరువాత సమీక్షా సమయంలో కార్యకర్తల శ్రమను డి.ఆర్.కె. గారి మెచ్చుకోలు, గురవయ్య గారి వివేకానంద ప్రవచనం, అన్నీ సలక్షణంగా జరిగిపోయినవి. (Yes! ఒక సమున్నత లక్ష్య సిద్ధికై నిస్వార్థంగా శ్రమించే కార్యకర్తలకు, ఈ ప్రముఖ వైద్యునికీ మాత్రమే ఈపాటి అమేయమైన సంతృప్తి లభిస్తుంది మరి!)

         ఈ నాటి స్వగ్రామ పరిశుభ్ర స్వచ్ఛ సౌందర్య సాధనా నినాదాలు ముమ్మారు వినిపించిన ఒక సీనియర్ నర్సు - ఒక సైలెంట్ వర్కర్ గురిందపల్లి ఇందిర.

         రేపటి బ్రహ్మ ముహుర్తాన మనకోసం ఎదురు చూస్తున్న చొటు పెద్ద బైపాస్ - చల్లపల్లి – (పెదకళ్ళేపల్లి) రహదారి!

 

         పరిశుభ్రత మన కవచం.

ఆదర్శం కబుర్లేల? ఆచరణమె ముఖ్యం గద!

కాలుష్యమె రావచ్చు కరోన జబ్బె కావచ్చును

పరిశుభ్రత కవచంగా శ్రమదానం ఆయుధముగ

దేనినైన ఎదుర్కొనక తీరదులే స్వచ్ఛ సేన!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   26.02.2022.