2364*వ రోజు....

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనం ఎందుకు వాడాలి ?

 

ఆదివారం - 2364* వ నాటి రహదారి పారిశుద్ధ్యం.

 

తేదీ 27.02.2022 ; శ్రమదాన సమయం 4.20-6.20 ల నడుమ ; శ్రమదాతలు 38 మంది ; శుభ్ర-సుందరీకృత ప్రముఖ ప్రదేశం మహా శివరాత్రికి శోభ తేబోతున్న పెదకళ్లేపల్లి మార్గం! ఇరుగు పోరుగూళ్ళ నుండి తప్ప-స్థానిక నివాసుల భాగస్వామ్యం మాత్రం పూజ్యం!

 

         ఇంత శ్రమదాన విశేషం జరిగే చోటుకు ఆ దగ్గరి వాళ్ల ప్రమేయం లేకపోవడమనేది ఇంచుమించు పాత కథే! బొత్తిగా స్పందన లేకపోవడం మాత్రం కొందరు స్వచ్చ కార్యకర్తల తీరని వ్యథే! సామాజిక-సామూహిక ప్రయోజనార్థం ఇలా ఎక్కడో-ఎప్పుడో అరుదుగా సంభవించే ఒక సుదీర్ఘ స్వచ్చోద్యమం పట్ల ఇంతటి మందకొడితనం నిజంగా ప్రశ్నార్థకమే!

 

         నేటి శ్రమ వేడుక భాగస్వాముల్లో – అలసిపోతున్న ఒక పెద్ద డాక్టరు, ఒక గాయపడ్డ (ఊండెడ్ సోల్జర్) స్వచ్చ సైనిక వైద్యురాలు, ఏడెనిమిది మంది 68-84 ఏళ్ల వర్షీయసులు, వ్యవసాయ క్షేత్ర పరిశీలనకై బాపట్ల కళాశాల నుండి విద్యార్థినులు, ప్రజా ప్రతి నిధులు, గృహిణులు ఉన్నందుకు సంతోషిద్దాం!   

 

         “ ఇంత మంచి కార్యక్రమానికి సహకరించాలని బుద్ధి పుట్టని గ్రామ సహోదరుల్ని వదిలేద్దాం- ఎప్పటిలాగే  ఈ ముఖ్య రహదారి ప్రక్కల ముళ్ల- పిచ్చి మొక్కల్ని, తీగల్ని కత్తుల కెర చేద్దాం- మనమే నాటి, పెంచిన చెట్లనూ, పూల మొక్కల్ని సంరక్షిద్దాం. ఖాళీ మద్యం సీసాల,  ప్లాస్టిక్ సీసాల, దిక్కు మాలిన ప్లాస్టిక్ సంచుల్తో బాటు రహదారి అందాల్ని దెబ్బ తీస్తున్న నానా రకాల కాలుష్య భూతాన్ని తరిమి కొడదాం- సై సై అని తొడ కొడుతూనే ఉందాం...” అనే సంకల్పాన్ని చాటుతున్న 37 మంది స్వచ్చ సైనికులకూ, సైన్యాధిపతులకూ పునః పునః ప్రణామం!

 

         ఇందరు స్వచ్చోద్యమ వీరాధి వీరులు కూడ ఈ వేకువ కేవలం 100 – 120 గజాల రహదారినే శుభ్ర పరచగలిగారంటే - అది ఇక్కడి సారా దుకాణ దారుల, మద్యం వినియోగదారుల, ప్రయాణికుల,స్థానికుల గొప్పతనం! రోడ్డు మీదా, మార్జిన్లలోనూ, డ్రైన్ల నిండా జానెడు మందాన చెత్తా చెదారం నింపడం మాత్రం ఏమంత చిన్న పనా? వేల మంది నిత్యం రాకపోకలు చేసే ఈ బాట కశ్మల భూయిష్టం కావడం ఈ ఊరి దురదృష్టం, పట్టుబట్టి మళ్ళీ మళ్ళీ విసుగులేని విక్రమార్కుల్లాగా శుభ్రపరచడం స్వచ్చ కార్యకర్తల అదృష్టం!

 

         చల్లపల్లి స్వచ్చ సైనికులకు క్రొత్తగా వచ్చిన మనో వ్యధ ఏమంటే-తమ ఏడెనిమిదేళ్ళ నిరంతర వ్యయ ప్రయాసలతో స్వచ్చ-శుభ్ర-మనోహరమైన రహదారి మార్జిన్ల  రంగు రాళ్ల జాగాల్లో ముందుగా కొన్నాళ్ల తాత్కాలిక, క్రమంగా శాశ్వత దుకాణాలు వెలుస్తుండడం! “కాదేదీ కవితకనర్హం...” అని మహాకవి ఉవాచ! “ఊరంతటి ఆహ్లాదం, సౌకర్యం కోసం ఏర్పడిన ఏ ఖాళీ జాగాలైనా మా అడ్డాలే..” అనే ధోరణిలో  కొందరి వైఖరి 30 వేల మంది ప్రజా ప్రయోజనకర విరుద్ధం కాదా?

 

         ఏ స్వచ్చ కార్యకర్తలైనా ప్రాధేయపడి అడిగితే  “ ఊళ్ళో రోడ్ల ప్రక్క అన్ని దుకాణాల్ని తీసేయించి, అప్పుడడగండి ...” అనే జవాబు - అది దబాయింపో, లౌక్యమో అర్థం కాదు!

 

         ఎనికేపాడు లోని SRK  ఇంజినీరింగ్ కళాశాల Environmental engineering ప్రొఫెసర్ శ్రీదేవి, Income Tax consultant అయిన  ఆమె శ్రీవారు శ్రీ బాబు గార్లు  కాలుష్యరహిత  స్వచ్చ ప్రయోగశాలగా పేరొందిన చల్లపల్లి పరిశీలనకై నిన్న వచ్చి పర్యటించడమూ, చీరాల ప్రాంతం నుండి అధ్యయన జిజ్ఞాసువులు 15 మంది నేడు రానుండడమూ-విశేషాలు!

 

         ఈ ఉదయం పప్పు చెక్కల పంపిణీ అడపా గురవయ్యది, బిస్కట్ల వితరణ వేమూరి అర్జునరావుది! మూడు మార్లు గ్రామ శౌచ – సౌందర్య నినాదాల వంతు తూము వారిది!

 

         రేపటి వేకువ కాలుష్యం పని పట్టే మహత్కార్యానికి మనం కలువదగిన చోటు ఈ పెదకళ్లేపల్లి  మార్గంలోని గ్యాస్ ఏజెన్సీ ప్రాంతమే!

 

         గర్వపడుచు జై కొట్టుము

 

గర్వపడుము చల్లపల్లి కార్యకర్త సేవలకై

జై కొట్టుము ఈ వేకువ శ్రమ విరాళ సంస్కృతికే

సిగ్గు పడుము ఇన్నేళ్లుగ చేయనందుకా కార్యం

అందించుము ఇంటింటికి స్వచ్చోద్యమ సందేశం!

 

         - నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   27.02.2022.