2365*వ రోజు.......

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనం ఎందుకు వాడాలి?

శివరాత్రికి ముందస్తుగా వీధి సుందరీకరణం - @2365*

         సోమవారం వేకువ కూడ స్వచ్ఛ కార్యకర్తలది అదే ముహుర్తం – 4.15 - 6.22 నడుమ! దక్షిణ కాశిగా చరిత్ర ప్రసిద్ధమైన పెదకళ్లేపల్లి - దుర్గా నాగేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా కార్యకర్తల కర్మక్షేత్రం అదే శివరామపురం రహదారిలో గ్యాస్ కంపెనీ - సిమెంటు కొట్ల ప్రాంతం! హాజరైన శ్రమదాతల సంఖ్య 30! పని గంటలు 50 - 60 ఉండొచ్చు!

         ఏళ్ల తరబడి ఊరి వీధుల్నీ, డ్రైనుల్నీ, పంట కాల్వల్నీ, శ్మశానాల్నీ, కొన్ని కార్యాలయాల్నీ, బస్ ప్రాంగణాల్నీ, ఊళ్ళోకి దారి తీసే 7 రహదార్లనీ ఇష్టపడి, పోటీ పడి, శుభ్రపరిచి - సుందరీకరించి, కశ్మల రహితం కమ్మని, తాము బ్రతికే ఊరిని మనసారా సత్వర పరిశుభ్ర సుందరీకృతమస్తుఅనీ, “సమగ్ర హరిత పుష్ప వర్ణ శోభితమస్తుఅనీ, అందు నిమిత్తం గ్రామ స్వచ్చోద్యమ వికాసమస్తు....అనీ దీవిస్తున్న - దీవెనలను నిజం చేస్తున్న చల్లపల్లి నిస్వార్ధ శ్రమదాతలకు నా ఊరి ప్రజల తరపున నా ప్రాతః ప్రణామాలు!

         2365* పని దినాలుగా - సుమారు 3 లక్షల పని గంటలుగా - తదేక దీక్షగా పాటు బడే శ్రమదాతలకు లేదు; వేలాది రోజులుగా వేకువ శ్రమదానంలో వేలుబెడుతూ - ఆ అద్భుత శ్రమదాన దృశ్యాల్ని ప్రతి క్షణం  లోలోపలే ఆస్వాదిస్తూ - నిండు మనస్సుతో అభినందిస్తూ - భావోద్వేగంతో వర్ణించే నాకు లేనే లేదు; మరో కోణం నుండి పదే పదే చూసే గ్రామ సోదరులెవరికైనా ఈ దుమ్ము - ధూళి - మురుగు - బురద - కరకు - మొరటు శ్రమదాతల్ని చూస్తుంటే - పారల గరగరల, పలుగుల రాపిళ్ల గోకుడు పార చప్పుళ్ల, దంతెల లాగుళ్ళ, చెమట కంపుల సందడి విసుగనిపిస్తుందేమోనని నా చిరకాల సందేహం!

         కాని, ఏం చేస్తాం పారంపర్య సంస్కృతికీ, కాలానుగుణ నవీన స్వచ్ఛ సంస్కృతికీ భావ సంఘర్షణ తప్పదు మరి! ఛార్లెస్ డార్విన్ గారి పరిణామ సిద్ధాంతం – “ఫిట్టెస్ట్ ఆఫ్ ది స్పీసీస్ సర్వైవల్” (అర్హమయిందే బ్రతికి బట్ట కటుతుంది) అనేది గుర్తు చేసుకోవాలి!

         అమావాస్యకు ముందునాటి చీకట్లో - కనీ కనిపించక కన్నుకొట్టే వీధి దీపాల చాలీచాలని వెలుగులో - బురద ఎండుతున్న డ్రైన్లలో దిగి, చిక్కు బడ్డ ముళ్ల - పిచ్చి మొక్కల్నీ, తీగల్నీ తొలగిస్తూ - ప్లాస్టిక్ శత్రు జాతిని మట్టుపెడుతూ ఏ కశ్మలాన్నీ వదలక - కొందరైతే మరీ వంచిన నడుము లెత్తక రెండు గంటల పాటు – 130 గజాల మేర రహదారిని చూసి గుర్తుంచుకోదగినంతగా బాగు చేసిన 30 మంది శ్రమ జీవన్మూర్తులకు చల్లపల్లి గ్రామస్తుల తరపున కృతజ్ఞతాభి వందనాలు!

         నిన్న 100 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి, చల్లపల్లి స్వచ్చ గ్రామ నమూనాను నఖ శిఖ పర్యంతం ఐదారు గంటల పాటు నిశితంగా పరిశీలించి, పరవశించి, చీరాల దగ్గరి తమ గొనసపూడిగ్రామాన్ని స్వచ్ఛ - సుందర పర్యాటక చల్లపల్లి కన్నా మిన్నగా తీర్చిదిద్దాలని భీష్మించిన 15 మంది పర్యాటకుల విషయం - నేటి సమీక్షా సమావేశంలో ప్రస్తావన కొచ్చింది! పైగా - వారిస్తున్నా వినక వారు మనకోసం మనంట్రస్టుకు భూరి విరాళం ప్రతిపాదించినట్లు కూడా తెలిసింది!

         నేటి త్రివిధ గ్రామాభ్యుదయకర సంకల్ప నినాదాలు ప్రకటించినదీ, ఎవరివో గాని మంచి మాటల్ని వినిపించినదీ అడపా గురవయ్య మహాశయుడే!

         ఒక చిన్న మార్పుగా - రేపటి వేకువ మన శ్రమదాన కేంద్రం మరొకమారు పెదకళ్లేపల్లి శివరామపుర మార్గంలోని మేకలడొంకే!

 

         స్వార్థ రహిత దాఖలాలు.

గతంలోన నాకున్నవి కలగా పులగ అనుభవాలు

ఆకుకు పోకకు చెందక అందని విశృంఖలాలు

స్వచ్చోద్యమ చల్లపల్లి స్వార్థ రహిత దాఖలాలు

సామాజిక సద్భావన సాగిన వేల దినాలు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   28.02.2022.