2375*వ రోజు....

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?

బస్టాండు వెలుపల 28 మంది కార్యకర్తల స్వచ్చ కృషి @2375*

          28 మంది కర్మవీరులకు 4.13 కే తెలవారిపోయింది. బండ్రేవుకోడు కాల్వ మీద పెదకళ్లేపల్లి దారి వంతెన, ఉత్తరపు కుడి – ఎడమ గట్లు, అక్కడి నుండి చల్లపల్లి దిశగా 50 గజాల బాట, బస్ ప్రాంగణ ప్రహరీ వెలుపల మురుగు కాల్వ, ఆగి వున్న లారీల మరుగున, ఇవి కాక దూరంగా – కల్యాణ మండపం ప్రవేశమార్గం దగ్గర ముగ్గురి సుందరీకరణ..... ఇలా మనుషులు కాస్త తగ్గినా ఈ వేకువ 2 గంటల 10 నిముషాల్లో జరిగిన పనుల జాబితా ఇది.

          ఏ వెయ్యేళ్ల నాడో భర్తృహరి అనే రాజకవి 3 రకాల మనుషుల్ని గురించి ఏమి సెలవిచ్చాడో చిత్తగించండి.

 “ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై

ప్రారబ్దార్థము నుజ్ఞ గింపరు సుమీ! ప్రజ్ఞా నిధుల్ గావునన్

(ఎన్ని అడ్డంకు లెదుర్కొన్నా మరింత ధైర్య సాహసాలతో ధీరులు తాము తలపెట్టిన పనుల్ని పూర్తి చేసి తీరుతారు.)

          మరి, స్వచ్ఛ కార్యకర్తల ప్రారబ్దమేమిటి? గ్రామ సామాజికులు కలిసి వచ్చినా - రాకున్నా , తాము మెరుగులు దిద్దే రోడ్లను, మార్జిన్లను, మురుగు కాల్వల్ని, పెంచిన చెట్లను, బస్ ప్రాంగణాల్ని, రహదారి వనాల్ని కొందరు వివేకరహితులు మళ్ళీ మళ్ళీ కలుషితం చేస్తున్నా, దురాక్రమిస్తున్నా, నరుకుతున్నా, అర్ధం లేని విమర్శలు చేస్తున్నా - సహనంతో 2375* రోజులుగా పదేపదే స్వచ్చ – సుందరీకరించడం – ఇవే గదా వాళ్ల ప్రారబ్దం? లేకపోతే

          లబ్ది ప్రతిష్టుడెన ఒక వైద్యుడు ఇలా రోడ్లు ఊడ్చి, చెత్త ట్రాక్టర్ తోలడమేమిటి? 60 ఏళ్ళు దాటిన విశ్రాంత BSNL బక్క ఉద్యోగి స్పైడర్ మాన్ లాగా బస్టాండు ప్రహరీలో మొలిచి పెరిగిన రావి మొక్కల్ని నరుకుతాడా? అదే స్థాయి - అదే కంపెనీ ఉద్యోగి ఎంగిలి ఖాళీ సీసాల్ని ఏరి గోనె సంచిలో నింపుకొంటూ, మోస్తూ తిరగడమా? 7075 ఏళ్ళు దాటిన పెద్దలు కత్తి పట్టి, గొర్రులు వాడి, చెత్త డిప్పలు మోసి పరమ చెండాలపు డ్రైను బురదను బట్టల కంటించుకొని, వంటికి దుమ్ముకొట్టుకుని..... ఇవే గదా భర్తృహరి చెప్పిన విఘ్నాలంటే?

          ఇన్ని వేల రోజుల – 3 లక్షల పని గంటల గ్రామ స్వచ్చోద్యమంలో స్వచ్ఛంద శ్రమదాతలు ఇలాంటి ఇంకెన్ని అనుభవిస్తూ – ఓరిమి ప్రదర్శిస్తూ – కొండొకచో అవహేళనలెదుర్కొంటూ – సాగుతుంటేనే గదా ఈ వినూత్న - విలక్షణ ఉద్యమం పడిలేస్తూ, లేచిపడుతూ, నిలదొక్కుకున్నది?

          నా దృష్టిలో చల్లపల్లి స్వచ్చోద్యమకారులంటే – కణకణలాడే నిప్పుకణికలే! ఒక్క మారు - వేకువ 4.15 కి కార్యరంగంలో అడుగుపెట్టాక – వాళ్ళు చేయనిదేమిటి? ఊరి మలినం తొలగించి, మలం ఎత్తి, శ్మశానాల్ని సంస్కరించి, డ్రైన్లలో దిగి, పచ్చదనాన్ని పెంచి, పూల వనాల్ని సృష్టించి, రోడ్ల గుంటల్ని పూడ్చి, ఆక్రమణల్నుండి  రోడ్లను కాపుగాచి, ఎదురొచ్చే దూషణ – భూషణ - తిరస్కార -  పురస్కారాల్ని సమదృష్టితో స్వీకరించి...

          ఇప్పుడు నేను వర్ణించిన చేష్టలన్నీ ససాక్ష్యాలే! కావాలంటే శాస్త్రి మహాశయుని వాట్సప్ -  ముఖ పుస్తక మాధ్యమాల్ని పరిశీలించుకోవచ్చు!

          6.45 కు అడపా వాని త్రివిధ గ్రామ మెరుగుదల ప్రతిజ్ఞల్ని, నీతి పద్యాల్ని వినే అవకాశం దొరికింది.

          నేడు కూడ లక్షించిన మేరకు పనికానందున - రేపు సైతం వేకువ సమయంలో మనం కలువదగిన చోటు చంద్ర ఆస్పత్రి దగ్గరే!

 

          సమర్పిస్తున్నాం ప్రణామం 76

ఊరి కోసం వేల దినముల ఉద్యమాలను తలచుకొంటే

మీరొనర్చే క్రతువు చూస్తే – చిత్త శుద్ధిని గణన చేస్తే –

కలం పరుగులు పెట్టుచున్నది! కవిత నర్తన చేయుచున్నది!

మీ సమైక్య ప్రయాణమునకే మేము చేస్తున్నాం ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   10.03.2022.

ఖాళీ మందుసీసాల లోడుతో విజయ్