2376*వ రోజు....

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?

2376* వ నాటి శ్రమదానం కూడ RTC . బస్ ప్రాంగణ కేంద్రంగానే.

          శుక్రవారం వేకువ కూడ స్వచ్ఛ కార్యకర్తల ఉద్యుక్తత 4.13 కే, శ్రమదాతలు 27 మందే! 2 గంటల 5 నిముషాల వారి ధర్మ పోరాటంలో చూడబుద్ధిపుట్టు తున్నవి - రవాణా సంస్థ ప్రాంగణం పాక్షికం గాను, వెలుపల రోడ్డు దాక వ్యాపించిన టైర్ల షాపులు, స్వీట్ల దుకాణాలు, వస్త్ర, కోళ్ల మాంసపు అంగళ్ల పరిసరాలే! బస్టాండులోతట్టు మొత్తం బాగు చేయాలనుకొన్న స్వచ్ఛ కార్యకర్తలకు నేడు కూడ కొంత అసంతృప్తే!

          స్వచ్ఛ శుభ్ర సౌందర్య విషయాల్లో, పచ్చని చెట్ల స్వాగతాలతో రాష్ట్రంలో తొలి రాంకుల్లో ఉండదగిన ఈ ఊరి RTC ప్రాంగణంలో కూడ, పరిసరాల్లో కూడా ఇంత చెత్త, మురుగు, 2 పెద్ద సంచుల ప్లాస్టిక్ తుక్కులు, ఖాళీ సారా సీసాలూనా? ప్రక్క డ్రైనులో ట్రాక్టరు ట్రక్కులో పట్టనంత కంపుగొట్టే వ్యర్ధాలా? మరి ఇన్ని బట్టల కొట్ల, హోటళ్ల, తినుబండారాల బళ్ళ యాజమాన్యాల నిర్వాకమేమిటి? స్వచ్ఛ కార్యకర్తల సుదీర్ఘ నిరంతర కృషికి సహకరించడమా, కాలుష్యాల్ని విరజిమ్మి వాళ్లకు మరింత పనిచూపడమా?

          స్థానిక - స్థానికేతర ప్రయాణికుల బాధ్యతేమిటి? ఐనకాడికి చేతుల్లోని ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు, ఇతర దిక్కుమాలిన వ్యర్ధాల్ని కుదిరితే డ్రైన్ లోకి, లేకుంటే రోడ్డు మీదకే విసరడమా, లేక ఈ వందలాది కార్యకర్తల వేలదినాల - లక్షల పనిగంటల కఠోర శ్రమార్జిత హరితవనాల్ని, పూల సొగసుల్నీ, స్వచ్ఛ శుభ్రతల్నీ ఆస్వాదించడమా!

          చల్లపల్లిలోని పాతిక ముప్పై వేల ప్రజలకు విన్నపమేమంటే - ఈ కాలంలోనూ ఇంత స్వార్థ రహితంగా గ్రామహిత - అద్భుత శ్రమదానం మనకళ్లెదుట నిత్యం జరుగుతున్నందుకూ, తత్ఫలితంగా అరుదైన స్వచ్ఛ - శుభ్ర - సుందర వాతావరణంలో మనం బ్రతుకుతున్నందుకూ సంతోషించండి స్వామీ! ఇరుగు పొరుగూళ్లకూ బస్ లలో వచ్చేపోయే దూర ప్రయాణికులకూ సదవకాశమేమంటే ఏ ఊళ్ళోనూ చూడలేని ఇంత ఆహ్లాదకర, ఆనందమయ రహదార్లతో ఆనందించి, ఉత్తేజపడండి తండ్రీ!

          నిన్న తాము శుభ్రపరచిన రోడ్లమీదే - డైన్లలోనే ఈ ఉదయానికి కొన్ని వ్యర్ధాలు వచ్చి పడితే సహనంతో మళ్లీ శుభ్రపరుస్తున్న చల్లపల్లి స్వచ్ఛ కార్యకార్తల నిగ్రహమే, నిబద్ధతే, తాత్త్వికతే నన్ను ప్రతిరోజూ ఆశ్చర్యపరిచేది! వేకువ 4.00 కే ఇల్లు వదిలి వచ్చి దారులూడుస్తున్న గృహిణుల్నీ, చెత్తలోడులో నిల్చి సర్దుతూ, మురుగు మట్టి కొట్టుకొన్న వంటితో బట్టల్తో కనిపిస్తున్న ట్రస్టు కార్మిక పర్యవేక్షకుడినీ, కత్తులు దంతెల్తో బస్టాండు లోతట్టును శుభ్రపరుస్తున్న కార్యకర్తల్ని, ఇరుకులో నుండి రకరకాల చెత్తను, బైటకు లాగే శ్రమదాతల్ని రోడ్డు మార్జిన్లను గోకుడుపారల్తో గోకి సువిశాల పరుస్తున్న సుందరీకర్తల్నీ చూస్తుంటే త్యాగ మహిమల్ని గమనిస్తుంటే - మాలాంటి కలం మనుషులకు వాళ్ళ శ్రమ జీవన ధన్యతను వర్ణించాలనిపించదా?

          మొత్తానికి 2 వారాలకు పైగా ఇందరి శ్రమదానంతో బస్టాండు మేకల డొంకల నడిమి సుమారు 2 కిలోమీటర్ల రహదారి బాగుపడింది. కాఫీ సరదా తీరాక 6.45 సమయంలో నేటి గ్రామ స్వచ్ఛ పరిశుభ్ర - సుందరీకరణ ప్రతిజ్ఞల్ని ప్రకటించినది 85 పళ్ల తలపండిన వైద్యుడు/ చలపల్లి స్వచ్ఛ కార్యకర్త - దుగ్గిరాల శివప్రసాద్ గారు. కార్యకర్తల ఆదర్శ కృషిని ఎలా అభినందించాలో తెలియక ఇబ్బంది పడే మరొక వైద్యుడు డి.ఆర్.కె. ప్రసాదు గారు.

          రేపటి రహదారి మెరుగుదల కృషిని కొనసాగించవలసింది - మేకలడొంక వంతెన దగ్గర నుండే!

 

          సమర్పిస్తున్నాం ప్రణామం 77

అరకొరగా అవగాహన - అంతంతగ అనుకూలత

జనంలోన నిర్లిప్తత - శ్రమదానానికి విముఖత

రాజ్యమేలు సమయంలో రాటుదేలి నిలిచి గెలుచు

స్వచ్చోద్యమ కర్తలకే సుమ సుందర ప్రణామాలు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   11.03.2022.