2377*వ రోజు....

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు ఉపయోగించాలి?

మేకలడొంక ప్రాంతంలోనే మరొక తరి శ్రమదానం - @2377*

            2 వారాల నాటి తరువాయిగా.. మేకలడొంకకు 100 గజాల ఉత్తరంగా మొదలైన 25 మంది కర్మిష్టుల ఐచ్చిక శ్రమదానంతో 150  కి పైగా గజాల శివరామపుర రహదారి సంతృప్తికరమైన స్వచ్చ శుభ్రతల్ని సంతరించుకొన్నది! ఆ బాటలో వెళ్లే వాళ్ల సంగతేమో గాని, 2 గంటల 10 నిముషాలు మొండిగా శ్రమించిన పాతికమందికీ ఆ భాగాన్ని చూసుకొంటే మనసులు నిండిపోయే ఉంటాయి!

            వాళ్ల మనసులేకాదు - కాస్త స్వచ్చస్పృహ ఉండి, ఏ కొద్దిపాటి సామాజిక బాధ్యతను పాటించే గ్రామేతర, రాష్ట్రేతర, దేశాంతర ప్రవాసులకైనా నేటి కార్యకర్తల కర్తవ్య పారీణతను గమనిస్తే ఎదలు పులకరించి తీరుతాయి! భౌతికంగా వాళ్లిక్కడికి దూరంగా ఉన్నావాళ్ల నిండు మనసులు చల్లపల్లి స్వచ్చోద్యమ కారుల బ్రహ్మముహూర్త కాలపు దినవారీ శ్రమదానాన్ని ఆశీర్వదిస్తూనే ఉంటాయి!

            విజయవాడకు చెందిన ఒక M.V. సుబ్బారావు, ప్రవాస అమెరికన్లు మండవ శేషగిరిరావు, నాదెళ్ల సురేష్ లూ, కొందరు హైదరాబాదీయులు క్రమం తప్పక చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని నిశితంగా అనుశీలిస్తూ - అభిమానిస్తూనే ఉంటారు. అట్టి సామాజిక స్వచ్చ - పరిశుభ్ర - సౌందర్యాభిలాషులకోసమే జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంసామాజిక మాధ్యమం ఉన్నది! దానిలో శంకర శాస్త్రీయమైన ఛాయా చిత్రాలు, శబ్ద దృశ్య సన్నివేశాలూ - శనివారం నాటివి పరిశీలిస్తే బోధపడేవేమిటి?

1) 50 పనిగంటల కృషితో బాగా మెరుగుపడిన 150 గజాల రహదారి - డ్రైనుతో సహా!

2) తాటి చెట్ల, ముళ్ల మొక్కల నడుమ చిక్కుపడ్డ ప్లాస్టిక్, చెత్త, ఇంకా ఇతర దరిద్రపు వ్యర్దాల్ని చీపుళ్ళతో, గొర్రులతో బైటకు లాగుతున్న ఊడుస్తున్న నలుగురు మహిళలు!

3) నడముకు గోనె సంచి కట్టుకొని, ప్లాస్టిక్ సీసాల, కప్పుల, ప్లేటుల, గ్లాసుల వంటి పర్యావరణ శత్రువుల్ని ఏరుతూ తిరిగే ఒక BSNL మాజీ ఉద్యోగికి గోనె సంచి నిండి గిట్టు బాటైన వైనం! ప్రక్క పొలంలో వాటిని సైతం ఏరి అతనికి సహకరిస్తున్న ఒకరిద్దరు ముసలి ఘటాలు!

4) డ్రైనులో, గట్టు మీద పిచ్చి చెట్ల మీద కత్తులతో, గోకుడు పారల్తో విజృంభిస్తున్న ఏడెనిమిది మంది కార్యకర్తల విక్రమం!

5) పారలు, రైల్వే పారల్తో రోడ్డు మార్జిన్లను చెక్కి బాటను విశాలపరుస్తున్న, సుందరీకరిస్తున్న ముగ్గురు -  నలుగురి గ్యాంగు!

6) శ్రీశైల దివ్యక్షేత్ర ప్రసాదం పొట్లాలను కార్యకర్తలకు పంచుతున్న ఆనందంలోఒక వీర విక్రమ సింహుడు.

7) ఇవి కాక ఒక చిన్న అపశృతి సామాజిక చింతనతో శక్తి తరిగి, గ్రామ సేవలతో అలసిసొలసి, నిలబడలేక 30 - 40 నిముషాలు కారులో పడుకొని, లేస్తూనే చీపురు ధరించిన ఒక సినియర్ స్వచ్చ వైద్యుడు!

---ఈ ద్యశాలు చాలవా - ఎక్కడెక్కడి చల్లపల్లి గ్రామ స్వచ్చాభిలాషుల దైనందిన ఆనందాలకు?

            7 గంటలకు ముందుగా - ఆహ్లాదకర సూర్యదేవుని సాక్షిగా పంట పొలం నడుమగా కార్యకర్తల దీక్షకు చలించిన DRK గారి ఆత్మనిర్భరంగా - ఉత్సాహంగా జరిగిన సమీక్షా సమావేశంలో ముమ్మారు 3 కిలోమీటర్ల దూరంలోని ఊరికి వినిపించేంత ధృఢంగా స్వచ్చోద్యమ ప్రతిజ్ఞలు చేసినది కోడూరు వేంకటేశ్వర మహోదయులు.

            రేపటి ఆదివారం వేకువ వీలైతే సపరివారంగా మనం కలిసి, శ్రమించవలసిన చోటు - శివరామపురం బాటలోని పరకుటీరాల దగ్గరే!

 

       సమర్పిస్తున్నాం ప్రణామం 78

స్వచ్చోద్యమ కథలేమిటో ఆ తపస్సు కర్ధమేమొ

కార్యకర్తలిందరు తమ గ్రామ భవిత కొరకు చెలగి

ఇంటింటికి తిరిగి - తిరిగి, వీధులన్ని ఊడ్చు పనికి

పరమార్థం తెలుసుకొన్న ప్రజలకెల్ల ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   12.03.2022.