2378*వ రోజు....

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా?

శివరామపురం రహదారి శుభ్ర సుందరీకరణంలో – 2378* వ నాడు.

            ఆదివారం (13-3-22) వేకువ 16 మంది చేరిక 4.17 కైతే - ఆ సంఖ్య క్రమంగా బలపడి 30 మంది 6.50 దాక అచంచల దీక్షతో ఆకర్షణీయంగా మారిన రహదారి సుమారు 140 గజాలు. పని అవసరం ఏ రోజుకారోజు మారుతుంది గాని, 30 మంది పనిమంతుల్లో ఎవరి అభిరుచి వారిదే! కత్తులతో గోకుడు పారల్తో గొర్రుల్తో చీపుళ్ళతో తమ ఇష్టానుసారం శ్రమదానానికి పాల్పడుతుంటారు!

            మరి – 2 గంటల 25 నిముషాల పాటు పనిలో విసుగురాదా? విరామం వద్దా? చెమటలను ఆరబెట్టుకోవద్దా?... అంటే - అందుకే వీళ్లలో కొందరు శ్రమ తెలియకుండా కూనిరాగాలందుకొంటారు - కొందరు జోకులు పేలుస్తారు ఎక్కడో ఒకరు పద్యం అందుకొంటారు - ఇవన్నీ మైకులో వినిపించే పాటలు కాక! ఇంత శ్రమ, దీక్ష, 2378* నాళ్ల మొండి పట్టూ – (ఇవేమీ ఇందులో ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో కాక గ్రామ ఉమ్మడి సౌభాగ్య స్వస్త సంక్షేమాల కోసం సుమా!) చూస్తుంటేనే దీనికి శ్రమైక జీవన సౌందర్యంఅనే సముచితమైన పేరు వచ్చింది!

            చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదాన కారక్రమం ఏ నిర్బంధమూ కాదు - పనికి వేతన పథకమో - పనికి ఆహార పథకమో కాదు కనుక అందరి శ్రమా ఒకే రకంగానూ ఉండదు; సుందరీకర్తల ప్రణాళిక, ఊహ, సృజనశీలత - అవొకరకంగా ఉంటాయి; కత్తులతో చేసే వీరవిహారం కాస్త కఠినంగా ఉండొచ్చు - చేతులు పడిపోయేట్లు రోడ్లు ఊడ్చే వారి కష్టం వేఱు - ప్లాస్టిక్ తుక్కులు ఏరేవాళ్ల సంగతి వేఱు - ఒంట్లో ఓపిక చాలకున్నా వచ్చి చాతనైనంత శ్రమించే వాళ్ల ప్రయత్నం మరో కథ! ఒకాయన తనకు నచ్చిన శ్రమ సన్నివేశాల్ని కెమేరాలో బంధిస్తాడు, మరొకతను ఈ దైనందిన అసాధారణ స్వచ్చోద్యమాన్ని కథనం చేస్తాడు - ఒకతను ఈ ఉద్యమాన్ని పాటలుగా పాడుతాడు మొత్తమ్మీద పరిశీలిస్తే - ఇదొక స్ఫూర్తిమంతమైన, ఆదర్శమైన, సర్వులకూ అనుసరణీయమైన సమగ్ర చల్లపల్లి స్వచ్చ సుందరీకరణ ప్రయత్నం!

            అనుకొనే సాధించారో  - అప్రయత్నం గానే సాధ్యపడిందో గాని, కార్యకర్తల నేటి కృషి ఫలించి, చేసినంత మేర రహదారి శుభ్ర సుందరం గాను, సువిశాలం గాను, అంతకు ముందు వాళ్లేనాటి, సాకి, పెంచిన పూల చెట్లతోను చూపు త్రిప్పుకోనీయనంత బాగున్నది. అ మాటకొస్తే చల్లపల్లి గ్రామంలోకి ప్రవేశించే ఏడు ప్రధాన రహదారులూ ఇలా ప్రత్యేకంగానే కనపడుతాయి!

            మరి ఇందరి నిస్వార్థ నిరంతర - నిర్నిబంధ శ్రమ ఊరికే పోతుందా? గడ్డిచెక్కి, పూలమొక్కల నడుమ కలుపు తీసి, డ్రైనులో తుక్కు తీసి, పట్టి పట్టి ప్లాస్టిక్కులు, తుక్కులు తొలగించి, పూల మొక్కల్ని సింగారించి, దుమ్ము - పుల్ల పుడక - గులకల్ని మాయం చేస్తుంటే చల్లపల్లి రోడ్లు ఈ మాత్రం అందంగా కనిపించకుంటాయి? ఇప్పటికి కూడ స్వచ్చ సుందరోద్యమం పట్టని గ్రామస్తులకూ - ఆశావహులైన చిరు వ్యాపారులకూ - స్వచ్చసైనికుల సవినయ సంప్రార్ధనమేమంటే – “దయచేసి అనాలోచితంగా రోడ్ల మీద చెత్త పడ వేయవద్దు; ఖాళీ సీసాలో పొట్లాలో విసిరి, మురుగు కాల్వల నడకల్ని భంగపరచవద్దు; రోడ్ల మార్జిన్లను దురాక్రమించ వద్దు; అందుకు ప్రోత్సహించవద్దనే వద్దు; ఫ్లెక్సీలతో గ్రామ వీధుల్ని, పర్యావరణాన్ని నష్ట పరచవద్దు....

            6.50 వేళ మినుము తీసిన మాగాణిలో జరిగిన సమీక్షా సమావేశంలో గురవయ్య నీతి పఠనం కాక పద్యాలాపన కాక, మరొక విశేషం - నందేటి శ్రీనివాస గాయకుని క్రొత్తపాట! దాశరథి ప్రసిద్ధ గేయానికనుసరణగా స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రత్యేకతగా రూపొందిన గేయమది!

            బుధవారం (16-3-22) వేకువ మన పునర్దర్శన ప్రదేశం ఈ రహదారిలోనే. బహుశా 7 వ నంబరు పంట కాల్వ వంతెన కావచ్చు.

           

            ఈ ఉద్యమ సంరంభం.

ఇది కొందరి ఉద్వేగమొ - ఏ ఒక్కరి ఆవేశమొ

మహారంభ శూరత్వమొ - మరొక్కటో కాదు సుమా

ఈ చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రస్థానం నిబద్ధితం

నిమంత్రితం నియంత్రితం నిరంతరం - తరంతరం!

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   13.03.2022.