2379*వ రోజు....

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా?

2379* వ (సోమవారం) నాటి వీధి రక్షణ కృషిలో రెస్క్యూ టీం.

          ఈ టీముకు సైతం వేకువ 4.22 సమయమే పనివేళ! గంగులవారిపాలెం బాట తొలి వంతెన దగ్గరి గస్తీ గదిదగ్గరే ప్రారంభం! 6.30 సమయంలో 2 ½ కిలోమీటర్ల దూరంలో పడమర వీధి పోతురాజు గుడి ఎదుట పని ముగింపు! వివరాల్లోకెళ్తే :

1) ఈ భద్రతా దళానికి ఇటు బందరు వైపు, అటు నాగాయలంక వైపు రెండు రహదార్ల మీద కొన్ని చిత్తు పేపర్లు, ప్లాస్టిక్ సంచుల వంటివి నచ్చలేదట. ఏరి పోగేసుకుంటూ పోతే నాగాయలంక రోడ్డు మలుపులో పోతురాజు గుడి దగ్గర - రోడ్డు గుంటలు పడితే బొత్తిగా నచ్చలేదట

2) అందుకోసం 2 ½ కిలోమీటర్ల దూరంలోని డంపింగ్ కేంద్రం దగ్గర వ్యర్ధాల గుట్ట గుర్తొచ్చి, అక్కడి తారు పెచ్చుల్ని ట్రక్కులోకి ఎక్కించుకొని, గుంటల దగ్గర వాలారు.

3) రోడ్ల గుంటల దుమ్ము ఊడ్చి, తాము తెచ్చిన తారు ముక్కల్ని వాటిలో సర్ది, స్ధిరీకరించేప్పటికే 6.20 సమయమయింది.

4) అప్పుడు శంకర శాస్త్రి గారు ఉచ్చరించిన గ్రామ శుభ్ర - స్వచ్చ - సుందర నినాదాలతో ఈ రోజుకు శాంతించారు!

          గుంటల వల్ల ప్రయాణ భద్రత లోపించిన వాహనదారులు గాని, ఆ గుడి దగ్గరి పరిచయస్తులు గాని, ఈ కార్యకర్తలతో సహకరించనేలేదు!

          రోడ్ల మరామత్తులు చేసేశామంటున్న సదరు ప్రభుత్వ శాఖకు ఎందుకో ఈ గుంటలు కనిపించనే లేదు!

         

          సమర్పిస్తున్నాం ప్రణామం 79

ఊరి స్వచ్చతెకాక పొరుగున ఉన్న ఊళ్లకు పాకిపోయిన

రాష్ట్ర మంతట స్వచ్ఛ సంస్కృతి రగులుకొల్పిన - స్ఫూర్తి నింపిన

త్రిదశ గ్రామాలందు సైతం తేజరిల్లిన - ఉద్యమించిన

చల్లపల్లి స్వచ్ఛ - సుందర సైనికులకే మా ప్రణామం!

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   14.03.2022.