1851* వ రోజు.......

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1851* వ నాటి బహుముఖ చర్యలు.
 
బాగా చలి పులి గాండ్రిస్తున్న నేటి వేకువ 4.03-6.20 సమయాల నడుమ జరిగిన స్వచ్చ- శుభ్ర-సుందరీకరణ ప్రయత్నంలో 32 మంది శ్రమదానం చేశారు. కార్యస్థలం- శివాలయం నుండి విద్యుత్ కార్యలయం దాక!

 
నాలుగు రకాలుగా సాగిన ఈ గ్రామ స్వచ్చంద బాధ్యతలలో:
 
- రద్దీగా ఉండే విజయవాడ మార్గంలో ని ఆరు గుంటలను శాశ్వత పరిష్కారంగా పూడ్చి, వాహన దారుల ప్రయాణానికి మంచి వెసులు బాటును కల్పించారు. 10 రోజుల క్రిందట “ రోడ్ల డాక్టర్” గంగాధర తిలక్ గారి మరామత్తు ను చూసి, పాల్గొన్న చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలు ఈ రోజు తమ తొలి ప్రయత్నంగా విజయవాడ నుండి తెచ్చిన తారు మిశ్రమంతో ఈ 6 గుంటలను పూడ్చారు.
 
- రోడ్ల – భవనాల అతిధి గృహ సమీపంలో ఉంచిన నానా రకాల కల్మష మిశ్రమాన్ని పది మంది కార్యకర్తలు-నిన్నటి శ్రమ దానంలో ఎడమ చెయ్యి బెణికిన ఒక ఆల్ రౌండర్ తో సహా- ట్రాక్టర్ లోకి ఎత్తి , చెత్త కేంద్రానికి తరలించారు.
 
- సుందరీకరణ ముఠాలోని ఆరుగురు నిన్న ఊడ్చి, తుడిచి, ప్రైమర్ పూసిన నీటి పారుదల శాఖ భవనం ప్రహరీకి-దానిపై కెక్కి కూడ- రంగులు పూశారు.
 
- 10 మంది కత్తి వీరులు NTR పార్కు ప్రహరీ వెలుపల నుండి విద్యుత్ కార్యలయం దాక డ్రైను ను, దాని గట్టు మీది పిచ్చి మొక్కల్ని, గడ్డిని తొలగించి, ఎండు టాకుల పుల్లలన్నిటినీ ఊడ్చి, ట్రాక్టర్ లో నింపుతూ శ్రమించారు. తులనాత్మకంగా చూస్తే గతం కన్న ప్లాస్టిక్ సంచుల వ్యర్ధాలు తగ్గినట్లున్నవి.
 
- ఇద్దరు ముగ్గురు చీపుళ్ల తో విజయవాడ మార్గాన్ని ఊడ్చి, శుభ్ర పరచారు.
 
రాజ్యాంగ నిర్మాణ దక్షుడు B.R. అంబేద్కర్ వర్ధంతి ని ఘనంగా జరిపి, ఆయన స్ఫూర్తిని స్మరించుకొన్నారు.
 
నేటి సీనియర్ మోస్ట్ స్వచ్చ కార్యకర్త మాలెంపాటి గోపాల కృష్ణయ్య గారు ఇటీవలి తన అనారోగ్యాన్ని అధిగమించి, స్వచ్చ కార్యక్రమానికి వచ్చి, తన గ్రామ స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించి, 6.45 నిముషాలకు నేటి శ్రమదాన బాధ్యతలు ముగించారు. “మనకోసం మనం” ట్రస్టు కు వీరిచ్చిన 2000/- విరాళానికి మన అందరి ధన్యవాదాలు.
 
రేపటి మన శ్రమదానం చండ్ర వికాస కేంద్రం దగ్గర కలిసి, కొనసాగిద్దాం!
 
ఈ కీర్తన ఎందుకనగ....
అందరిలో స్ఫూర్తి నింపు స్వచ్చ శుభ్ర సేవలనుచు-
ఆత్మ తృప్తి- ఆరోగ్యం- ఆనందపు టవధులనుచు-
త్రికరణ శుద్ధిగ నమ్మే ఒకటొకటిగ వ్రాస్తున్నా!
స్వచ్చ చల్లపల్లి సైన్య చర్యలు కీర్తిస్తున్నా!!
 
నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
శుక్రవారం – 6/12/2019
చల్లపల్లి.