2391*వ రోజు ....

 ఒక్క వాడకానికే పరిమితమైన (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులు ఎవరైనా వాడవచ్చునా?

 

ఊరి మెరుగుదలకై కంకణం కట్టుకొన్న శ్రమదాతల మరో ప్రయత్నం - @2391*

 

ఈ శనివారం (26-3-22) నాటి 2 గం12 నిముషాల సామూహిక శ్రమదానం 31 మందిది. మునసబు వీధి దిశగా కొందరు, సజ్జా వారి వీధిలోకి కొందరు, జమీందార్ల ఉభయ ప్రహరీల వెలుపలి కాలుష్యాల మీద ఇంకొందరు, సజీవజల పుష్ప విక్రయశాల దాక మిగిలిన వారు దుమ్ము ధూళి మీద, ప్లాస్టిక్ చెత్తల పైన మురుగ్గుంటల వ్యర్ధాల పైన కాలుదువ్విన ఫలితంగా మొత్తమ్మీద 150 – 200 గజాల - మూడు వీధుల్లో పరిశుభ్ర సౌందర్య సాక్షాత్కారం జరిగింది!

 

          నేటి 30 మంది బాధ్యుల్లో చల్లపల్లి స్థానికులు సగం మందే! పరిసర గ్రామాల, జిల్లాల వ్యక్తులీ బాధ్యతలన్నీ భుజాల మీద మోయడమూ, ఊళ్లోని చాల మంది సహృదయులు గ్రామ కర్తవ్య నిర్వహణకు దూరంగా ఉండడమూ ఆలోచిస్తే ఏదోగా ఉంటున్నది! నిజం చెప్పాలంటే తన వారి బాధ్యతలతో బాటు, ఊరి మేలునూ పట్టించుకొనేవారే అసలైన నాయకులు!

 

          30 మంది సామాజిక నేతల్లోనూ ఈ వేకువ తామేమి చేయాలో, ఎందుకు చేయాలో, ఊరికి ఊడిగాలు చేస్తే వచ్చే ఫలితాలేంటో..... అన్నిట్లోనూ ఒక స్పష్టత ఉంది, నిబద్ధత ఉంది, గ్రామ భవితవ్యం పట్ల తగు మాత్రం దార్శనికత ఉంది, సామూహిక శ్రమదానం పట్ల అవగాహనా ఉంది!

 

          ఈ శ్రమదాతలకు లేనివేమంటే :

 

1. రోడ్డు మీద పబ్లిగ్గా చీపుళ్ళు పట్టి ఊడ్వడంలో బిడియం లేదు

 

2. మోకాలిబంటి - మొలబంటి లోతు మురుగు కాల్వలో దిగి చెత్త లాగడంలో  సంకోచం లేదు,

 

3. తాము 75 – 84 ఏళ్ల వృద్ధులమనీ రోడ్ల మీద వంగి పనిచేసే ప్రాయం కాదనే జ్ఞాపకమూ లేదు,

 

4. పెద్ద డాక్టర్లమనో ఉన్నతోద్యోగులమనో పెద్ద రైతులమనో ఒక ఆభిజాత్యం- ఒకానొక అహంకారం అసలే లేదు,

 

5. ‘వంటింటి రాణులం, మగాళ్ళ చాటు ఆడాళ్ళం, గృహిణులం...లాంటి సందిగ్ధాలైనా లేవు ....

 

          ఇవన్నీ తుంగలో త్రొక్కారు కనుకనే వీళ్ళ సమయ శ్రమదానాలు అన్ని ఊళ్ల సామాజిక చైతన్యకారులకు ప్రేరణనిస్తున్నాయి! 2391* దినాల శ్రమదాన వ్యవధిని అవలీలగా దాటేశాయి! ఇక పై చల్లపల్లిలో గాని, తత్ప్రేరిత ఇతర గ్రామాల్లో గాని నిరంతరంగా - తరంతరంగా ఈ స్ఫూర్తి ఈ శ్రమ సంస్కృతి వర్ధిల్లడమే తరువాయి!

 

          ఈ శనివారం నాటి శ్రమదాన వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తే ఉంటే :

ఒక్కమారు జై స్వచ చల్లపల్లి సైన్యంసామాజిక మాధ్యమాన్ని అందలి దృశ్య శ్రవణ చిత్రాల్ని పరిశీలించండి!

 

- ప్రాధమికంగా స్వచ్చ కార్యకర్త, ఇంత పెద్ద ఊరికి ప్రప్రధమ వ్యక్తీ, రోడ్లు ఊడ్చే డిప్పలెత్తే చెమట చిందించే దృశ్యాలు,

 

- మురుగు వీరుల పనిమంతనాలు, – ఐకమత్య ప్రయత్నంగా సమకూరే

నూతనోత్సాహాల వంటివన్నీ సదరు వాట్సప్ లోనే గ్రహించగలరు!

 

ఇక సమీక్షా సమావేశ సందడిలో :

 

1. భోగాది వాసుదేవుని గ్రామ శౌచ శుభ్ర సౌందర్య సంకల్ప త్రివిధ నినాదాలూ,

2. కంజీరా వాద్య సహకారంతో స్వచ్చ కార్యకర్తల ఆత్మ విశ్వాస/ ఉత్సాహ ఉద్వేగాల వ్యక్తీకరణంగా వచ్చిన క్రొత్త పాటని నందేటి శ్రీనివాస్ మాంచి ఊపుతో పాడటమూ విశేషాలు!

 

          వైద్య శిబిర కారణంగా మనలో కొందరు రాలేకపోతున్నందున -  రేపటి మన శ్రమదాన  కార్యక్రమం తరగని ఉత్సాహంతో జరగబోయే చోటు- బందరు మార్గంలోనే- భగత్సింగ్ దంత వైద్యశాల ఎదుటే ప్రారంభం!

 

     సమర్పిస్తున్నాం ప్రణామం – 90

తాటాకుల మంటల వలె తాత్కాలిక చర్య కాదు;

పాలు పొంగి చల్లారిన బాపతు ఉద్యమం కాదు;

కాలుష్యం అంతు చూసి గ్రామ భవిత కొరకు సాగు

శ్రమ వీరుల కందరికీ సమర్పింతు ప్రణామాలు!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   26.03.2022.