2392 *వ రోజు ....

 ఒక్క వాడకానికే పరిమితమైన (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులు ఎవరైనా వాడవచ్చునా?

 

సుదీర్ఘ చల్లపల్లి శ్రమదానంలో- 2392* వ రోజు

 

  మార్చి నెల-27 వ నాటి వేకువ - 4.18 కే బందరు జాతీయ రహదారిలో శ్రీకారం చుట్టుకొన్న 45 మంది కార్యకర్తల వీధి శుభ్ర- సుందరీకరణం 2 గంటల పాటు కొనసాగి, భగత్ సింగ్ వైద్య శాల- కమ్యూని స్టు వీధుల మధ్య విజయవంతమైనది. ఈ 200 గజాల సువిశాల మార్గంలోని దుమ్ము-ధూళి- చెత్త- ప్లాస్టిక్ వ్యర్థాలు వంటివన్నీ మాయమై-

          ఉభయ నర్సరీల సజీవ జల పుష్ప (చేపల) విక్రయ శాల రామాలయం-మసీదు మేదర వాడల నడుమ బాటంతా ఇప్పుడు స్వచ్చ-సుందర-శుభ్రంగా కనిపించడం లేదా? నేటి స్వచ్చ కార్యకర్తల సంఖ్య బాగా బక్క చిక్కుతుందని శంకించాను. కారణమేమంటే 20 సంవత్సరాలుగా వేలాది మంది అస్వస్తుల కోసం ఈరోజు విజయా కాన్వెంటు లో 4.30 AM కే మొదలయ్యే GBR ఫౌండేషన్ వారి వైద్య శిబిరంలో చాలామంది స్వచ్చ కార్యకర్తలు బాధ్యతలకు వెళ్లడం! అందుకు భిన్నంగా ఈనాడు 45 మంది శ్రమదాతల కోలాహలం తో ఈ స్వచ్చంద వీధి బాధ్యతలు సైతం నెరవేరాయి.

   గత దశాబ్ద కాలంగా చల్లపల్లి జన విజ్ఞాన వేదిక, తరువాత స్వచ్చ సైన్యం ఆశ్చర్యకరంగా ఏక కాలంలో ఇన్ని ప్రజోపయోగ బాధ్యతలు నేరవేరుస్తున్నాయంటే- అందులో ఇతర సంస్థల సంగతలా ఉంచి, నడక సంఘం వారిదొక ప్రత్యేక అతిథి పాత్ర! వాళ్లు ప్రతిరోజు వచ్చి గ్రామ బాధ్యతలకు పూనుకోరు గాని, వస్తే మాత్రం ముఖ్య భూమిక వహిస్తారు! స్వచ్చ కార్యకర్తలు పదేసి కిలో మీటర్ల పొరుగూళ్లకు పాదయాత్రలకు వెనకాడుతుంటేనూ, లక్షల కొద్దీ పెద్ద పెద్ద ఖర్చులకు సంశయిస్తూంటేనూ ఈ నడక సంఘం వాళ్లే వెన్ను తట్టి, ముందుండి అడుగులేస్తారు!

 

          మరి ఇలాంటి అనుకోని అదృశ్య సహకారాలెన్ని లేకుండా 2392*  నాళ్ళ స్వచ్చ సుందరోద్యమం ఇంత పకడ్బందీగా ఆదర్శంగా నడుస్తున్నది? అలాంటిదే నేటి అనుకోని మరొక గ్రామ ప్రయోజనకర సంఘటన!

 

          సరే ఈనాటి 45 మంది చీపుళ్లతో దంతెలతో- డిప్పల్తో విజృంభించి శుభ్రపరచిన బాధ్యతలెలాగూ నెరవేరాయి! మహిళలు-పెద్దలు చీపుళ్లతో పని వేగం పెంచాక రోడ్డు మధ్య ధూళి మేఘాలేర్పడి అందులో కొందరికి చిరాకేసి, “ రోడ్లు ఊడ్చే యంత్రం ఎంత ఖరీదౌతుందని ఆరాతీసి , అది 25 లక్షలని తెలిసి, “ ఐతే ఏంటట? మనందరం, ఊరి జనం చందాలేసుకొంటే అది చిటికెలో పనేఅని తేల్చేసి, ఒకరు లక్ష, కొందరు 50 వేలు, 10-5 వేల చొప్పున, ప్రకటించేశారు!

 

          నాకైతే ఊరి బాధ్యతల్ని పంచుకొనే ఇలాంటి కార్యకర్తలున్నందుకు- చల్లపల్లి పౌరుడుగా గర్వమే- ఇలాంటి సాహసుల ఔదార్యంతో మున్ముందు ఈ గ్రామం ఇంకెంత సర్వాంగ సుందర మౌతుందో అనే ఉద్వేగమే! ఇందరు సుమనస్కులైన సౌజన్య సంపన్నుల మధ్య బ్రతుకుతున్నందుకు ఎనలేని సంతృప్తే!

          6.40 సమయంలో కాఫీ సందడి ముగిశాక- సమీక్షా సమావేశం మధ్య దాతృత్వ భావాల్ని రెచ్చగొట్టిన మండవ బాల వర్ధనుడే ముమ్మారు ఊరుమ్మడి స్వచ్చ-శుభ్ర-సౌందర్య నినాదాలు చేయడం సమంజసంగా ఉన్నది!

 

          బుధవారం (30.03.2022)మన వీధి పరిశుభ్ర కృషి బైపాస్ మార్గం, కమ్యునిస్టు వీధి కలిసే ప్రాంతం( దాసరి రామ మోహన్ రావు గారి ఇంటి వద్ద ) నుండే మొదలు కావలసి ఉన్నది!  

 

      సమర్పిస్తున్నాం ప్రణామం 91

ప్రాలు మానరు, బద్ధకించరు, గ్రామ సౌఖ్యం ఉపేక్షించరు,

దిన దినం తమ రెండు గంటల శ్రమను మాత్రం వదలి పెట్టరు,

ఇంత సులభం దేశ సేవని ఇన్ని ఏళ్లుగ ఋజువు చేస్తరు-

చల్లపల్లి స్వచ్చ-సుందర-సైనికుల కిదె మా ప్రణామం! 

 - నల్లూరి రామారావు,

 

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   27.03.2022.