2398* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

అన్నీ నిజాలతో కూడిన స్వచ్ఛ సుందరోద్యమ సీరియల్ - @2398*వ ఎపిసోడ్.

          శనివారం (2.4.22) - ఉగాది శుభోదయాన - సంవత్సరాది వేడుక సంతోషంతో - 32 మంది శ్రమదాన వివేకం జతకట్టింది. ఈ సంఘటన అదృష్టం బెజవాడ రోడ్డులోని NTR పార్కుదే! నిన్నటి సాయంత్రం జానపద కళా సౌరభాన్ని ఆ 3 - 4 వందల మంది ప్రేక్షకులలో కలిసిపోయి ఆ రెండు గంటలకు పైగా ఆస్వాదించిన స్వచ్ఛ కార్యకర్తలు ఏ 11 గం. దాకనో మేల్కొని, ఏ 34 గంటలో నిద్రించి, మళ్ళీ వేకువ 4.19 సమయానికే పార్కులో ప్రత్యక్షమయ్యారు!

          ఇందుకే వాళ్లను కొందరం నిష్కామ కఠోర కర్మిష్టులనీ, ‘గ్రామ సామాజిక కర్తవ్య నిష్టాగరిష్టులనీ పిలిచేది! వాళ్లది ఊరి వీధుల సౌందర్యీకరణ వ్యసనం కాదు; గ్రామ పౌరులుగా కనీస బాధ్యతా నిర్వహణం! మీడియా మేనియా కూడ కాదు; అదొక ఆయాచిత అనివార్య కాకతాళీయం!

          నేటి, రేపటి మాపుల్లో కూడ ఇదే పార్కులో మరిన్ని జానపద కళా విన్యాసాలు జరుగనున్న నేపధ్యంలోనే నేటి వేకువ 30 మంది చేసిన సదరు పార్కు సుందరీకరణం! తమకు కళలెంత ముఖ్యమో - ఆ కళా ప్రాంగణ స్వచ్ఛ పరిశుభ్రతలూ అంతే ప్రధానమనేదే వారి ఉద్దేశ్యం కాబోలు!

          పార్కులోని కళా వేదికకు పడమర గాను, ఉత్తరంగాను, ఇంకొకటి రెండు చోట్లా కార్యకర్తల శ్రమదానం ప్రవర్థిల్లింది. కొన్ని కొబ్బరి తదితర చెట్లు కూడ మట్టలు నరికి, గడ్డి దుబ్బులు, ఎండుటాకులు ఊడిస్తే - ఇప్పుడా 20 - 30 సెంట్ల జాగా ఆకర్షణీయంగా ఉన్నది.

          నలుగురైదుగురు వాలంటీర్లు పారల్తో, కత్తులతో ఎగుడు దిగుడు స్తలంలో హుషారు గాను, శ్రమను మరిపించే లయబద్ద శబ్దాలతోను కాయకష్టం చేస్తున్న తాజా వీడియో ఒకటి అందరికీ నచ్చుతుంది!

          ఏడెనిమిదేళ్ల పిల్లలిద్దరు - తర్షిత్ - జస్వంత్ ట్రాక్టరు ట్రక్కులో నిలిచి నలుగురందిస్తున్న డిప్పల తుక్కును సర్దే దృశ్యం కూడ దర్శనీయమే!

          ఈ మిట్ట పల్లాల్లో తిరుగాడుతూ - నచ్చిన శ్రమదాన దృశ్యాల్ని కెమేరాలో బంధిస్తున్న, నీళ్ల సీసాల బుట్టతో ఎక్కడా పడకుండా కార్యకర్తలకు, మంచి తీర్థమందిస్తున్న 75, 84 ఏళ్ల స్వచ్ఛ వృద్ధ బాలురు కూడ అభినందనీయులే!

          పార్కు వెలుపల అన్నిటినీ తొక్కుకుంటూ పోతాం...అనే అతి పెద్ద సినిమా ఫ్లెక్సీ చూశాను. స్వచ్ఛ కార్యకర్తల వరస కూడ అలానే ఉంది గడ్డి చెక్కుతూ, సకల కశ్మలాల్ని తొలగిస్తూ అలుపెరగక శ్రమిస్తుంటే!

          శ్రమ సమీక్షా సందర్భంలో - కాఫీ సమయంలో - ఉగాది పర్వదిన విశేషంలో కార్యకర్తలందరికీ రవ్వ లడ్లు పంచిన దాతృత్వం లంకే సుభాషిణి గారిది! గ్రామ స్వచ్ఛ పరిశుభ్ర సౌందర్య సాధనా సంకల్పాన్ని మూడుమార్లు తొణకక నినదించిన వంతు కొర్రపాటి వీర సింహుడు గారిది! (ఈ 2 గంటల అదర్శ శ్రమదానాన్ని అంతగా పట్టించుకోని, అంటీ - ముట్టని స్థిత ప్రజ్ఞత పాతిక ముప్పై మంది పాదచారులది - క్రీడాకారులది!)

          మన రేపటి 2399* వ నాటి శ్రమదాన రంగ స్థలం కూడ ఈ NTR  పార్కే!

      సమర్పిస్తున్నాం ప్రణామం 97

ఈ ప్రగతీ - ఈ సుగతీ - ఈ గ్రామోద్యమ నిరతీ

ఈ స త్కృతి ఈ విసృతి ఏ గ్రామస్తుల కొరకో

ఈ సాముహిక సద్గతి - ఈ సామాజిక సన్మతి

కారకులకు స్వచ్చోద్యమ కారులకిదె ప్రణామం!

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   02.04.2022.