2400*వ రోజు ....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

 

బైపాస్ వీధిలో ఒక అపూర్వ దృశ్యం-2400 * వ నాటి శ్రమదానం!

 

            “Time and tide wait for no man” (కాలమూ, కెరటమూ, ఎవరి కోసం ఆగవు) అనే సామెత లాగా ఈ దేశానికీ, రాష్ట్రానికీ ఒక మారు మూల పల్లెలో- పెద్దగా చడీ చప్పుడు లేకుండానే పాతిక వేల మంది పౌరుల్లో చాలా మంది ప్రమేయం లేకుండానే- 8 ఏళ్ల నుండి ఒక ఆదర్శ అత్యవసర శ్రమదాన ఉద్యమంలోని 2400 * వ నాటి ఘట్టం జరిగిపోయింది.

 

దీనికి కర్తలు 40 మందికి పైగా! వేదిక బైపాస్ మార్గంలోని విజయ్ నగర్ పరిసరాలు! సమయం 4.16 నుండి 6.55 వరకు! ఈ 60 కి పైగా పని గంటల కృషితో పాక్షికంగా 3 అడ్డ రోడ్లు, ప్రధానంగా 150 గజాల సిమెంటు రోడ్డు, కొసరుగా ఒక ప్రధాన మురుగు కాల్వ, ప్రత్యేకంగా 10-12 చెట్ల సుందరీకరణం....!

 

బాటల, వాటి మార్జిన్ల సకలవిధ కశ్మలాల ఊడుపులు, గోకుడు పారలతో చెక్కుడులు, ముళ్ల-పిచ్చి మొక్కల నరుకుడులు, ప్లాస్టిక్ సంచుల, సీసాల ఏరుడులు, దంతెలతో ఎండుటాకులతో సహా అన్ని కశ్మలాల లాగుడులు, డిప్పలతో వాటిని ట్రాక్టరులోకి చేర్పుడులు, సందర్భానుసారంగా కొందరి చతురోక్తులు, పని నాణ్యత-చురుకుదనాలకై ఒకరిద్దరి హెచ్చరికలు, సూచనలు ఒక ముసలాయన మంచి నీళ్ళ సరఫరాలు.... వంటివన్నీ షరా మామూలు సంఘటనలే గాని-

 

ఒక 83 ఏళ్ల, మరొక 82 ఏళ్ల కార్యకర్తలు ఊతకర్రలతో సహా ఒకరికొకరు ఆసరాలై తిరుగుతున్న దృశ్యం మాత్రం నాకు అరుదైన అద్భుత సన్నివేశం!

 

ఇంకొక మహిళ చీకటి వేళ ట్రాక్టరు పైకెక్కి, నలుగురు అందిస్తున్న చెత్త డిప్పల్ని అందుకొని, ట్రక్కులో పొందికగా సర్దుతున్న దృశ్యం కూడ నేను కన్నార్పక చూసినదే!

 

ఇక్కడ గ్రామ సర్పంచో, సీనియర్ డాక్టరమ్మో, గృహిణులో, విశ్రాంత వయోధికులో అనే రిజర్వేషన్ లేవీ ఉండవు! తాము మహిళలమనే వ్యత్యాసం పూర్తిగా మరచి, మురుగు కాల్వలో దిగి శుభ్రపరచడానికి వారు వెనకాడిందీ లేదు.

 

ఇదిగో ఇలా చేరుకున్నది ఒక అపూర్వ సామాజిక-సామూహిక స్వచ్చంద- శ్రమదానం! ఈ మైలు రాయి -2400 * రోజులది ! స్వచ్చ కార్యకర్తల దెప్పుడైనా నిష్కామ కర్మం! వాళ్ళ ఆశయ సాధన ఇప్పటిదాకా సంతృప్తికరం! ఇప్పటికైనా గ్రామస్తుల్లో మిగిలిన వారు కలిసి వస్తే కదం త్రొక్కితే రాబోయే రోజుల్లో మన చల్లపల్లి పరిశుభ్ర సౌందర్యాలు మరింత సంపూర్ణం, సార్థకం, సమగ్రం!

 

6.30 నుండి 20 నిముషాలు జరిగిన సమావేశం- అదొక పండుగ వాతావరణం! కేకు ముక్కల భోజన, భాజనంతో, ZPTC కళ్యాణి గారి, రాజులపాటి శివ ప్రసాదు గారి ఆశంసనంతో, స్వచ్చ గ్రామ రథ సారధి గారి అభివందనంతో, ఆస్తాన గాయకుడి ఉత్తేజ పూరిత స్ఫూర్తి దాయక గానంతో....

1) 2400 రోజులకనుగుణంగా ప్రాతూరి శాస్త్రి గారి 2400/- విరాళంతో,

2) రాయపాటి రాధా కృష్ణుని 2400/- వితరణతో,

3)రిటైర్డ్ ప్రిన్సిపల్ తగిరిశ సాంబశివుని 2400/- చందాతో,

4) మాలెంపాటి డాక్టరు గారి 2000/- ఆర్థిక సహకారంతో ....

 

40 మంది ఉద్యమ కారుల కేరింతల నడుమ, కరతాళ ధ్వనులతో సాగిన ఒక సానుకూల సమంచిత సమావేశం అది!

 

రేపటి మన గ్రామ వీధి బాధ్యతలకై వేకువనే మనం కలువదగిన చోటు బైపాస్ రోడ్డు లోని భారత లక్ష్మీ రైస్ మిల్ వద్ద .

 

      సమర్పిసున్నాం ప్రణామం 99

గ్రామస్తులు గుర్తిస్తే స్వచ్చోద్యమ పరమార్థం,

విద్యార్థుల కర్థమైతె స్వచ్చంద శ్రమదానం,

గృహస్తులాదరిస్తుంటే గ్రామ శుభ్ర పరిణామం-

ఆదర్శ స్వచ్చోద్యమ మందుకొనును ప్రణామం!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   06.04.2022