2401*వ రోజు ....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

 

- 2401 * వ నాటి గ్రామ బాధ్యతా చర్యలు 1 వ వార్డులో

 

            గురువారం (07.04.2022) వేకువ స్వచ్చ సైనికుల కర్తవ్య దీక్ష 4.16 కే మొదలై 6.06 దాక కొనసాగింది. కర్తలు 27 మంది ; కర్మలు బాలికల హాస్టల్ పరిసరాలు; ఇక క్రియలు చెప్పేదేముంది! అక్కడి రెండు ప్రక్కలా మురుగు రొచ్చులు, 150 గజాల మేర ఊడ్పులు, చెట్ల సుందరీకరణలు, ముళ్ళ పొదల తొలగింపులు, గడ్డి చెక్కుడులు.... ఇలా ఏ నీచ- నికృష్ట దిక్కుమాలిన పనులైనా(ఇలా అనుకొనేది చాలమంది ఇతరులే- స్వచ్చ కార్యకర్తలు కాదు-) ఈ శ్రమదాతల కనర్హం కాదు!

 

            6.30 సమయంలో అక్కడి స్థానికురాలు కార్యక్రమానికి ఆగంతుకురాలు-  గ్రేస్ కమల గారి స్వానుభవ వర్ణన ప్రకారం- ఈ మూడు- నాలుగు వందల గజాల దారులొకప్పుడు ముక్కులు మూసుకొని, చీరలు పైకి దోపుకొని, మరీ మర్యాదస్తులైతే ఆఖరికి కళ్ళు మూసుకొని నడవక తప్పని బహిరంగ మల విసర్జనా కేంద్రం పూతి గంధ దుర్భరం భూలోక భయంకర ప్రత్యక్ష నరకం! ఈ అన్ని విషయాల్లో  అప్పట్లో ఈ ప్రాంతమే నంబర్ వన్ ! ఒక్క గంగులవారిపాలెం రోడ్డు మాత్రం దీనికి పోటీ వచ్చేది!

 

            మరి ప్రస్తుత వాస్తవం? ఒక దశాబ్దం గడవక ముందే వచ్చిన పరిణామం? ఇప్పుడిదంతా హరిత సుందరం- సుమ సుగంధం 3 వీధులూ పరిశుభ్రం మర్యాదగా ముందుకు సాగుతున్న మురుగుల మంద గమనం- కుడి ఎడమల్లో రహదారి వనం -  ఏ ఊళ్ళో  ఏ వీధైనా ఇలానే కదా ఉండవలసిందిఅనే ఒక ఆదర్శం!

 

ఇన్ని పెను మార్పుల వెనుక ఏ హస్తమున్నదో గ్రామస్తులందరికీ విదితం! ఎక్కడైనా ఏ మార్పైనా శ్రమతోనే సాధ్యంఅని నమ్మి ఆచరిస్తున్న స్వచ్చ కార్యకర్తల కష్టమే ఇన్ని అద్భుతాలకు మూలం! అందుకు వాళ్ళు పాటించిన సంయమనం సైతం మరొక కారణం! తమ ఊరిని ఇన్నేళ్లుగా ఇన్ని కోణాల నుంచి పరిశీలించి, ఏ మొండి బండ పనులకైనా తెగించి సుదీర్ఘ కాలం కష్టించే కార్యకర్తలుండటం ఈ గ్రామ మాజీ సర్పంచి- సజ్జా వేంకటేశ్వర రావు గారన్నట్లు - ఎంత అదృష్టం!

 

ఈ సజ్జా వారే ఆన్నట్లు అది పంచాయతీ పాలనే కానీ, గ్రామ స్వచ్చ సుందరీకరణోద్యమమే గానీ- దిగితేనే, చేస్తేనే లోతు తెలిసేది? అమెరికాలో అదేదో ఒక షాపింగ్ సంస్థ పేరే ఇంత కన్న చౌకగా వస్తువులమ్మే సంస్థ ఉంటే వెంటనే తెలుపండి...అనే అర్థంతో ఉంటుంది. స్వచ్చ కార్యకర్తలట్లా అనరు గానీ నా అభిప్రాయం అదే- చల్లపల్లిలో కన్నా ఈ స్వచ్చ కార్యకర్తల కన్నా నిరంతర నిస్వార్థ శ్రమదాతలెక్కడైనా ఉంటారా? ’ అని!

 

నేటి స్వచ్చంద శ్రమదానానికి సజ్జా వేంకటేశ్వర రావు గారు అతిథిగా రావడం స్వచ్చ కార్యకర్తల దృష్టిలో అదృష్టం ! తన 10 ఏళ్ల పదవీ కాలంలో ఎన్ని  కష్ట నష్టాలు రుచి చూసి, ఊరికి వందల సిమెంటు రోడ్ల వంటి మంచి పనులెన్ని చేసి కూడ- స్వచ్చ కార్యకర్తలతో కలిసి శ్రమించ లేకపోతినేఅనేదేమో అతనికొక అపరాధభావం(ప్రస్తుతం ఈ పెద్ద మనిషిది గ్రామాంతరవాసం!

 

6.40 కి సజ్జా వారే గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందర నినాదాలీయగా, కన్నడిగుడైన వేమూరి అర్జున రావు గారి ఆశీస్సులు ఫోనులో లభించగా, కోడూరి వేంకటేశ్వర రావు గారి 520/- నెలవారీ చందా అందగా, శుభకృత్ నామ సంవత్సరం లో మరొక సార్థక శ్రమ త్యాగ ఘట్టం ముగిసింది.

 

చాపలమడుగు కళావతి గారు మనకోసం మనంట్రస్టుకు దివంగత బోసు గారి జ్ఞాపకార్థంగా 5000/-  విరాళంగా సమర్పించారు. వారికి కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు. 

 

      సమర్పిసున్నాం ప్రణామం 100

నీతి శతకములు తెలియక నేటి కరోనా పట్టక

సామాజిక సేవకుల విశాల దృష్టి కనిపించక

గతానుగతికంగా చను గ్రామస్తుల బాగు కొరకు

పదే పదే పాటుబడే బాధ్యులకే ప్రణామములు!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   07.04.2022

 

బైపాస్ రోడ్డులో బాలికల హాస్టల్ వద్ద
గుల్ మొహర్ మొక్కను నాటుతున్న శ్రీ సజ్జా వేంకటేశ్వర రావు గారు
భూమిలో కరిగే జనపనార సంచి బహూకరణ
520/- విరాళం అందించిన కోడూరు వేంకటేశ్వర రావు గారు
5000/-విరాళం అందించిన చా పలమడుగు కళావతి గారు