2402*వ రోజు .......

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

అదే ఊరి తొలి వార్డులో - 2402* వ శ్రమ సమర్పణం!

            సదరు శ్రమ సమర్పకులు 25 మందే! ప్రారంభ సమయం సైతం వేకువ (శుక్రవారం-8.4.2022) 4.17 సమయమే! స్థలంలో మాత్రం కాస్త మార్పు స్థూలంగా ప్రభుత్వ బాలికల వసతి గృహం నుండి బందరు రహదారి వరకు! మరికొంత వివరణగా ఐతే –

1) చర్చికి కుడి ఎడమల సిమెంటు దారులు,

2) వీల్ మార్ట్ పరిసరాలు,

3) ఒక మురుగు కాలువ,

4) ఆరేడుగురు మాత్రం పూల మొక్కల కుదుళ్ల సవరింపులు వగైరా!

            పాతిక వేల జనాభాకు గాను ఈ పాతిక మందే నిత్య శ్రమదానం ఎందుకు చేస్తున్నదీ, (ఇంత సువిశాల-పురాతన గ్రామ మెరుగుదల కృషిలో గ్రామస్తుల్లో కొందరు సామాజిక చైతన్యవంతులై యుండీ వారంలో అన్ని రోజులు కాకున్నా కొన్ని రోజులైనా- గంటన్నర చొప్పునైనా తమ ఊరి బాధ్యతలెందుకు స్వీకరించరో- ఈ అత్యవసర సత్కారాన్ని ఇంకా ఎన్నాళ్లు వాయిదా వేస్తారో.... గ్రహించలేకున్నాం!

            అనవసర ఆవేశకావేశాల్నీ, కోపాన్ని, క్షణిక్రోద్రేకాల్నీ చెడు నిర్ణయాల్నీ, అంకెల్నీ లెక్కబెట్టి ఆకాశం వంక చూసి  వాయిదా వేసుకోవాలని నీతి శతక కవులూ, అనుభవుజ్ఞులూ చెప్పిన మాటైతే నిజం!

            పిల్లలు, అనల్ప వయోధికులు, గ్రామ సమాజంలో తగిన గౌరవ మర్యాదల గుర్తింపు గల వృత్తి కారులు 2402 రోజులుగా నిర్వహిస్తున్న ఈ స్వచ్చ సుందర యజ్ఞంలో ఎప్పటికైనా భాగస్తులు కావాలనీ ఆ సుముహూర్తం తొందరగానే*  ఆగమించాలనీ మా విన్నపం - అభిలాషణం!

            ఇంత పెద్ద ఊళ్లో చిన్నా చితకా 250 కి పైగానే వీధులున్నాయట! ఇప్పటికీ తిన్నగా తమ దారిలో తాము మర్యాదగా నడవక- హద్దులు దాటి రోడ్ల మీది కెక్కుతున్న మురుగు కాల్వలున్నాయి! ఇంకా పచ్చదనం పరిమళించని- పూల ఘుమఘుమలు సోకని, మట్టి కొట్టుకొని, కళాకాంతులు లేని రోడ్లు, కార్యకర్తలెంత శ్రమిస్తున్నా మిగిలిపోతున్న పూల సొగసులు, పచ్చని చెట్ల కనువిందులు చేయని మురుగు, పంట కాల్వ గట్లూ ఉన్నాయి! వీటన్నిటి పరిష్కారాలు శాశ్వతంగా ఈ 30-40-50 మంది స్వచ్చంద శ్రామికులదేనా? లోతుగా ఆలోచిస్తే-ఇదంతా ఎవరి త్యాగం? ఎవరి భోగం? ఎవరి దీక్ష/ ఎవరి ఉపేక్ష?

            గత 3 రోజుల - సుమారు 150 పని గంటల పోరాటంతో ఇప్పుడు 1 వ వార్డు ముఖ్య వీధులు, మురుగు కాలువ ఎంత పరిశుభ్ర - సుందర - మనోజ్ఞంగా ఉన్నాయో- మొన్నటి , నేటి వ్యత్యాసమేమిటో గ్రామస్తులు, ముఖ్యంగా 1 వ వార్డు నివాసులు గ్రహించాలని మనవి!

            ఈ వీధిలో మరొక 120 గజాల బాటను ఊడ్చాక, మార్జిన్ల గడ్డిని చెక్కాక, వ్యర్థాలను ట్రాక్టరులో నింపుకొని డంపింగ్ యార్డుకు చేర్చాక- కాఫీ సమయం కబుర్లు ముగిశాక- గోళ్ల విజయ కృష్ణ ముమ్మారు గ్రామ శుభ్ర - సుందర సంకల్పాన్ని నినదించాక - డాక్టరు గారు నేటి స్వచ్చ శ్రమదానం పట్ల  ఆనందాశ్చర్యాలు ప్రకటించాక... 6.45 కు నేటి కార్యకర్తల గృహోన్ముఖ ప్రయాణం !

            రేపటి మన కాలుష్యం మీద విసుగు చెందని పోరాటం కోసం కలిసి సాగవలసిన చోటు - జమ్మిలంక గ్రామ దేవత గుడి నుండే!     

 

      సమర్పిసున్నాం ప్రణామం 101

ఉషోదయ శ్రమ వేడుక ఒక ఉత్తమ పరిణామం

డజన్ల కొద్ది శ్రమ దాతల తరలి రాక విశిష్టం

అది స్వార్థం కాక ఊరి కంకితమగు మనోజ్ఞం

స్వచ్చ కార్యకర్తకు నా సమర్పిత ప్రణామం!

 

- నల్లూరి రామారావు

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   08.04.2022

 

కార్యకర్తల శ్రమతో శుభ్రంగా ఉన్న రోడ్డు